రియల్‌ హీరోస్‌

ABN , First Publish Date - 2020-04-04T09:30:52+05:30 IST

‘మాస్క్‌లు కావాలి సార్‌’, ‘వార్డులో నీళ్లు లేవు’, ‘ఇక్కడ చెత్త పేరుకుపోయి ఉంది’, ‘టెస్ట్‌ల కోసం కొత్త వాళ్లు వస్తున్నారు సార్‌’... ఆయన ఫోన్‌కి క్షణం విశ్రాంతి ఉండదు.

రియల్‌ హీరోస్‌

మనోధైర్యమే ఆయన ఆయుధం

 డాక్టర్‌ ఎన్వీ రమణయ్య


ఆంధ్రజ్యోతి- తిరుపతి: ‘మాస్క్‌లు కావాలి సార్‌’, ‘వార్డులో నీళ్లు లేవు’, ‘ఇక్కడ చెత్త పేరుకుపోయి ఉంది’, ‘టెస్ట్‌ల కోసం కొత్త వాళ్లు వస్తున్నారు సార్‌’... ఆయన ఫోన్‌కి క్షణం విశ్రాంతి ఉండదు. హఠాత్తుగా అధికారులు వస్తారు మొత్తం కలియదిరుగుతారు. ప్రజాప్రతినిధులు వస్తారు వారితోనూ కలిసి తిరగాలి, అందిస్తున్న వైద్య సేవలను వివరించాలి. క్షణక్షణం మారుతున్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ, సమీక్షించుకుంటూ, సమాచారం ఉన్నతాధికారులకు అందిస్తూ... పదిమంది పనిని ఒక్కరే చేస్తూ కనిపిస్తారు డాక్టర్‌ నన్నం వెంకట రమణయ్య. ఆపరేషన్‌ కోవిడ్‌-19 కి నాయకత్వం వహిస్తున్న వైద్యాధికారి. రుయా సూపరింటెండెంట్‌. కరోనా ఒత్తిడంతా రుయా మోస్తూ ఉంటే, రుయా భారమంతా ఆయన మోస్తున్నారు.


నిద్ర లేవగానే ఆసుపత్రికి పరుగులు, రాత్రి ఏ వేళకో ఇల్లు చేరుకుంటారు. అపరాత్రి వేళ కూడా ఆసుపత్రి నుంచి ఫోన్‌లు. అవసరమైతే మళ్ళీ పరుగెత్తాలి. వేళకి భోజనం ఉండదు. నీళ్ళు తాగలేదనే విషయమే గుర్తుండదు. అరవై పదులు దాటిన వయసులోనూ యువకుడిలా ఆయన అందిస్తున్న సేవలకు వైద్య సిబ్బందే ఆశ్చర్యపోతుంటారు. ‘సార్‌.. మీరు కాస్త కుదుటగా ఉండండి..మేం చూసుకుంటాం’ అని భరోసా ఇస్తుంటారు. మనిషి గుణం మాంసం కాడ బయట పడ్డట్టు, వైద్యుల సేవలు  కష్టకాలంలోనే లోకానికి తెలుస్తాయి. ‘ఈ విపత్తు వేళ కాకపోతే ఇంకెప్పుడు పని చేస్తాం ఇట్లా’ అంటారు డాక్టర్‌ రమణయ్య. ఒక రోజు అర్థరాత్రి దాకా ఆసుపత్రిలో విధుల్లో అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. ఒళ్ళంతా నిస్సత్తువ. ఆయన్ని అలా చూసి కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వెంటనే చేతికి సెలైన్‌ పెట్టుకుని పడుకున్నారు. తెల్లవారి లేచి ఇంకో యూనిట్‌ సెలైన్‌ పెట్టుకుని బయలు దేరారు. మళ్ళీ అవసరం రావచ్చని ముంజేతికున్న క్యానులాను అలాగే ఉంచుకున్నారు.


అది ఎవరికీ కనిపించకుండా పొడవు చేతుల చొక్కాతో కప్పేసుకుని యథావిధిగా అధికారుల సమావేశాల్లో పాల్గొంటూ, వచ్చే నాయకులకు సమాధానాలిస్తూ  గడిపేశారు. కరోనా విశ్వరూపం తెలిసిన డాక్టరుగా రుయాను మరింత సన్నద్ధం చేయడం మీద దృష్టి పెడుతున్నారు. కొత్తగా వస్తున్న రోగులను పరీక్షిస్తూ, పాజిటివ్‌ రోగులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తూ, కొరత కనిపించకుండా వైద్య సిబ్బందికి అవసరమైనవన్నీ దాతల ద్వారా సమకూర్చుకుంటూ తలమునకలవుతూ కనిపిస్తారు. కరోనాపై పోరుకు నడి యుద్ధరంగంలో నిలబడి తన సిబ్బందిని సన్నద్ధం చేస్తూ పోరాడుతున్న డాక్టర్‌ రమణయ్యకు కుటుంబం అండగా నిలబడుతోంది. భార్య డాక్టర్‌ నిర్మలాదేవి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రొఫెసర్‌, కూతుళ్ళు లహరి, రిషిత రుయాలోనే పీజీలు చేస్తున్నారు. సైనికుల్లా ఆయన వెంట నడుస్తున్నారు. కనిపించని మహమ్మారితో మనోధైర్యమే ఆయుధంగా పోరాడుతున్న ఈ వైద్యవీరుల కుటుంబానికి జేజేలు పలుకుదాం!

Updated Date - 2020-04-04T09:30:52+05:30 IST