Abn logo
Sep 26 2021 @ 00:00AM

నాన్న మాట నడిపించింది

నన్ను సివిల్స్‌ వైపు తిప్పింది మా నాన్న. అనుక్షణం ఒక మాట చెప్పేవారు. ఒక డాక్టర్‌గా నీ సేవలు ఆసుపత్రికే పరిమితం. అదే అధికారి అయితే నీ సేవలను మరింత విస్తృతంగా, ఎక్కువ మందికి అందించవచ్చు అనేవారు. అమ్మ కూడా అదే ఆలోచనల్లో ఉండేది. చదువు ముఖ్యం, ఉద్యోగం అంతకన్నా ముఖ్యం అని చెబుతూ ఉంటుంది. ఇద్దరూ కూడా మొదట్నించీ చదువుకుంటేనే ఏదైనా సాధించవచ్చు అని పదేపదే చెప్పేవారు. నీ కాళ్ళ మీద నీవు నిలుచుంటేనే భవిష్యత్తులోనూ నెగ్గుకురాగలవు అనేది వారిద్దరి మాట. అదే నా మీద బలంగా పనిచేసింది. సివిల్స్‌కు ప్రిపేరయ్యేలా చేసింది. 


సివిల్స్‌లో నా ఆప్షన్‌ ‘మెడికల్‌ సైన్సెస్‌’ అంటే నా గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టే. సాధారణంగా ఎక్కువమంది వేరే సబ్జెక్టు తీసుకుంటారు. అయితే అంతవరకు చదివిన సబ్జెక్టు అయితే మంచిదని భావించాను, అలాగే విజయం కూడా సాధించాను. పదేళ్ళ(ప్రీవియస్‌) ప్రశ్నపత్రాలు తీసుకుని సివిల్స్‌కు అనుగుణంగా సబ్జెక్టు మొత్తం మళ్లీ చదివాను. నిజానికి జనరల్‌ స్టడీస్‌ ఓషన్‌. దాని నుంచి ఆటవిడుపుగా ‘మెడికల్‌ సైన్సెస్‌’ ఉండేది. దీనిపై ఒకమేర పట్టు ఉండటంతో ప్రిపరేషన్‌ సులువుగానే సాగింది. సివిల్స్‌లో ఏదైనా డీప్‌గా చదువుకోవాలి. రోజుకు ఇన్ని గంటలు అని సమయం కేటాయించుకుని మరీ ప్రిపేరయ్యాను. 


ఇంటర్వ్యూలో నన్నొక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీరు డాక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఐఎఎస్‌ అధికారిగా ఉన్న వ్యక్తి పలానా పేషెంట్‌కి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ చేయమని ఆర్డర్‌ వేస్తారు. దీనిపై మీరెలా స్పందిస్తారు అని ప్రశ్నించారు. డాక్టర్‌గా నాకు అందరు పేషెంట్లు సమానమే. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టే నా ప్రాధాన్యం ఉంటుంది.   విచక్షణ మేరకే నేను పనిచేస్తాను. దీన్నే మెడికల్‌ భాషలో ‘ట్రయేజ్‌’ అంటారు. సమర్ధుడైన అధికారి అయితే నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పాను. 


నా ప్రిపరేషన్‌కు సంబంధించి ఒక విషయం చెపుతాను.  చదువుకునేప్పుడు చిన్న ట్రిక్‌ ఫాలో అయ్యేదాన్ని. అదే ‘రివార్డింగ్‌ ప్రిన్సిపుల్‌’. మన భుజాలు మనమే తట్టుకోవడం అన్నమాట. చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని, అవి సాధిస్తే మనకు మనమే ఏదైనా ప్రెజెంట్‌ చేసుకోవడం. అది ఆట... సినిమా... చాక్లెట్‌... ఏదైనా కావచ్చు. మరొకరి ప్రమేయం ఇందులో ఉండదు.  ఇక్కడ లక్ష్యం పెట్టుకునేది మనమే, భేష్‌ అని చెప్పుకొని, గిఫ్ట్‌ తీసుకునేది మనమే.  


పైన చెప్పినట్లు చదువు, ఉద్యోగం, సేవ మొదలైనవన్నీ మా ఇంట్లో చర్చకు వచ్చేవి. స్త్రీ సాధికారికత అన్నది ఇంట్లో నుంచే మొదలు కావాలి. పురుషులతో సమానం అన్నది ఇంట్లో నుంచే ఆరంభమవ్వాలి. ఏదైనా అమ్మే చేయాలి అంటే ఎలా చెప్పండి. ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా ఆమే వంట, ఇంటి పని చేయాలి అనుకోవడంలోనే వివక్ష మొదలవుతోంది. ఆమె అన్నీ చేసి పెడుతూ ఉంటే మనం కూర్చుని టీవీ చూస్తామంటే పరిస్థితిలో ఎన్నటికీ మార్పు రాదు. అందరూ తలో చెయ్యి వేస్తే, పని తొందరగా అవుతుంది. అందరం కలిసి టీవీ చూడవచ్చు. అమ్మ కూడా మనలో మనిషే కదా. మొదట ఆమె కష్టాన్ని గుర్తించడం అనేది నేర్చుకోగలిగితే, అదే సమాజంలోనూ ప్రతిఫలిస్తుంది. స్త్రీకి గౌరవం లభిస్తుంది.  


పురుషులతో సమానంగా విద్య, ఆరోగ్య సదుపాయాలు మహిళలకూ లభిస్తే మహిళా సాధికారికతకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా మహిళలకు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. అటు చదువు ఇటు ఆరోగ్యం ఉంటే సామాజికంగా ఇన్‌క్లూజన్‌కు వీలుపడుతుంది. అదే దేశ ఉత్పాతకతను పెంచేందుకూ దోహదపడుతుంది. ముందే చెప్పినట్టు ఇంట్లో మొదలై సమాజానికి చేరుతుంది. రేపు ఒక అధికారిగా స్త్రీల విషయంలో నా పరిధిలో ఆ రెంటికీ తగు ప్రాధాన్యం ఇస్తాను. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వానికి ఆ రెండూ బాగా తోడ్పడతాయని భావిస్తాను. 


ప్రభుత్వ సేవలను అందుకోవడం ప్రజల హక్కు. అందుకే అధికారులు ఉన్నారు. ఎంత పెద్ద అధికారి అయినా, ప్రజలకు జవాబుదారీ. వాళ్ళ పన్నులతోనే వ్యవస్థ నడుస్తోంది. అలాంటప్పుడు వాళ్ళు ప్రశ్నించకుండా ఎలా ఉంటారు అన్నది సదా గుర్తుంచుకుంటాను.


పేరు: డాక్టర్‌ పి. శ్రీజ

ర్యాంకు: 20

స్వస్థలం: వరంగల్‌ (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం)

తండ్రి: శ్రీనివా్‌స (హోండా షోరూమ్‌లో సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌)

తల్లి: లత (రఘునాథపల్లి పీహెచ్‌సీలో నర్సు)

తమ్ముడు: సాయిరాజ్‌ (డిగ్రీ చదువుకుంటున్నాడు)