Abn logo
Jul 8 2020 @ 04:19AM

ఆయాసం...ప్రథమ లక్షణం

ఇంకా జ్వరం..గొంతునొప్పి..ఒంటి నొప్పులు, దగ్గు..వాంతులు, విరేచనాలు

ఇవి ఉంటే కరోనాగా అనుమానించాల్సిందే

...అయితే జిల్లాలో లక్షణాలు ఏవీ కనిపించకుండానే అత్యధికులకు పాజిటివ్‌

 యువత, మధ్య వయస్కుల ద్వారానే ఎక్కువగా వ్యాప్తి

జ్వరం వస్తే ఇంట్లో వారికి దూరంగా ఉండడం మేలు

చేతులు శుభ్రం చేసుకోవడం,భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి

కేజీహెచ్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌.వాసుదేవ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా...ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తున్న ఈ వైరస్‌ వ్యాప్తి, లక్షణాలపై ఇప్పటికీ ప్రజల్లో అనేక రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయంగా జరిగిన పరిశోధనల్లో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఇవీ, అవీ...అంటూ ఎన్నో వస్తున్నాయి. అయితే జిల్లాలో వైరస్‌ బారినపడిన అధిక శాతం మందిలో అసలు లక్షణాలు పైకి కనిపించడం లేదని (అసిమ్టమాటిక్‌), కొద్దిమందిలో మాత్రం ఒకటి, రెండు కనిపిస్తున్నాయని చెబుతున్నారు కేజీహెచ్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌.వాసుదేవ్‌. కొద్దిరోజులుగా జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో సీజనల్‌ జ్వరాల వ్యాప్తి ప్రారంభం కావడంతో ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి, లక్షణాల పట్ల స్పష్టమైన అవగాహనను కలిగి వుండాలని ఆయన అంటున్నారు. కరోనా వ్యాప్తి, నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వాసుదేవ్‌ మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


అప్రమత్తతతోనే కరోనాకు చెక్‌.. 

కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో చాలావరకు అవగాహన వచ్చింది. అయితే ఇప్పటికీ కొందరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మన నిర్లక్ష్యం కుటుంబానికి శాపంగా పరిణమించే అవకాశముందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రస్తుతం  కేసులు పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా వుండడం ఉత్తమం. సాధారణంగా యువత, మధ్య వయస్కుల ద్వారా వైరస్‌ ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశముంది. చిన్నారులు, వృద్ధులు ఇళ్లల్లోనే ఉంటారు. వృత్తి రీత్యా, ఇతర పనుల్లో భాగంగా యువత, మధ్య వయస్కులు బయటకు వెళ్లి వస్తుంటారు. వారు ఇతరులను కలిసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్‌ వారికి, వారి ద్వారా కుటుంబంలోని ఇతరులకు సోకే అవకాశముంది. ముఖ్యంగా యువత వైరస్‌ బారినపడినా వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా వుండడం వల్ల ఆ లక్షణాలు బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. ఈలోగా వారి ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశముంది. కాబట్టి, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతోపాటు కనీసం రెండు మీటర్లు దూరం వుండేలా చూసుకోవాలి. 


ఆ లక్షణాలు ఉంటే అనుమానించాలి.. 

కరోనా వైరస్‌ బారినపడిన వారిలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, రుచి కోల్పోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే మన జిల్లాలో చాలావరకు అసలు ఎటువంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఇకపోతే..ప్రస్తుతం సీజన్‌ మారుతోంది. ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్సా?, ఫ్లూ జ్వరమా?...తెలుసుకోవాలంటే....ముందుగా మీరు రెడ్‌జోన్‌లో ఉన్నారా..?, ఈ మధ్య కాలంలో బయట వ్యక్తులతో దగ్గరగా మెలిగారా?, జన సమూహం ఎక్కువగా వుండే ప్రాంతాలకు వెళ్లి వచ్చారా? వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పైన పేర్కొన్న వాటిల్లో ఏదైనా జరిగి వుండడంతోపాటు జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా కరోనాగా అనుమానించాలి. మన దగ్గర నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం...వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అతికొద్దిమందిలో మాత్రం ముందుగా చెప్పుకున్న మరికొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. 


ఆయాసం వచ్చిందంటే.... 

వైరస్‌ లక్షణాలేమీ లేకుండా ఆయాసం వచ్చిందంటే తప్పనిసరిగా వైద్యుని వద్దకు వెళ్లి చూపించుకోవడం మంచిది. చాలామంది రోగుల్లో ఆయాసం ప్రథమ లక్షణంగా కనిపిస్తోంది. ఆస్తమా, ఇతర సమస్యలున్న వారిలోను ఆయాసం ఎక్కువగా ఉంటుంది. అయితే, అటువంటి సమస్యలు వున్నవారు మందులు వినియోగిస్తే కొంతవరకు అదుపులోకి వస్తుంది. అయితే కరోనా వైరస్‌ బారినపడిన వారిలో మందులు వినియోగించినా ఆయాసం అదుపుచేయడం కష్టమవుతుంది. అటువంటివారు వెంటనే ఆసుపత్రిలో చేరడం మంచిది. 


ఇవి తప్పనిసరి... 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం మంచిది. పోషకాహారం తీసుకోవడం, గోరు వెచ్చని నీళ్లు తాగడం, ఉప్పునీటితో గార్గిలింగ్‌ చేయడం, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం, చేతులను శుభ్రం చేసుకోవడం, బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం, జన సమూహ ప్రాంతాలకు, రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండడం మంచిది. 


మాస్క్‌ తప్పనిసరి

బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. దీనివల్ల వైరస్‌ అంత వేగంగా సంక్రమించేందుకు అవకాశముండదు. అయితే వైరస్‌ బారినపడిన వ్యక్తి మాస్క్‌ ధరించకుండా మాట్లాడినప్పుడు వైరస్‌ లేని వ్యక్తి మాస్క్‌ ధరించినప్పటికీ కొంత ఎఫెక్ట్‌ అయ్యే అవకాశముంది. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించని వ్యక్తులకు దూరంగా వుండడం ద్వారా మనల్ని మనం రక్షించుకునేందుకు అవకాశముంది. అదే సమయంలో ఇంట్లో ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వారిని ఇతరులకు దూరంగా వుండేలా చూడాలి. సాధారణ ఫ్లూ జ్వరమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గేంత వరకు ఒంటరిగా ఉండడం మంచిది. 

Advertisement
Advertisement
Advertisement