ఈ ఏడాది డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-05-19T05:53:14+05:30 IST

కొత్త ఔషధాల విడుదల, సామర్థ్యాల విస్తరణ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది

ఈ ఏడాది డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొత్త ఔషధాల విడుదల, సామర్థ్యాల విస్తరణ కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది. కొవిడ్‌తో లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అమెరికా మార్కెట్లోకి కొన్ని కీలక ఔషధాలను ఈ ఏడాది ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెట్టుబడులు ఉంటాయని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. 2020-21 ప్రారంభంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా మొత్తం ఏడాదికి రూ.974 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. చివరి త్రైమాసికంలో అత్యధికంగా రూ.288 కోట్లు వెచ్చించింది.


అదే విధంగా 2021-22లో కూడా దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న  రోగులు వినియోగించే ఐఓసాపెంట్‌ ఇథైల్‌ జనరిక్‌ ఔషధం ‘జి-వాసెపా’ ఔషధాన్ని వచ్చే రెండు మూడు నెలల్లో అమెరికా మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసే వీలుంది. ఈ ఔషధానికి సంబంధించిన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్‌ (ఏపీఐ) అవరోధాలు తొలిగిపోయాయయని పేర్కొంది. జి-కొపాగ్జాన్‌పై ఎఫ్‌డీఏ కంప్లీట్‌ రెస్పాన్స్‌ లెటర్‌ (సీఆర్‌ఎల్‌) ఇచ్చింది. వీటితో పాటు మరిన్ని జనరిక్‌ ఔషధాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  లేదంటే వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ సన్నాహాలు చేస్తోంది. బయోసిమిలర్‌ ఔషధం రితుజిమాబ్‌పై మూడో దశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

Updated Date - 2021-05-19T05:53:14+05:30 IST