మా వ్యాక్సిన్ ధర రూ.750 కాదు : డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

ABN , First Publish Date - 2021-04-22T19:36:24+05:30 IST

స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్‌ ధరపై తుది నిర్ణయం జరగలేదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గురువారం

మా వ్యాక్సిన్ ధర రూ.750 కాదు : డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

న్యూఢిల్లీ : స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్‌ ధరపై తుది నిర్ణయం జరగలేదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గురువారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను మన దేశంలో విక్రయించే ధరపై చర్చలు జరుగుతున్నట్లు వివరించింది. ఈ వ్యాక్సిన్‌ను మన దేశంలో పూర్తిగా ప్రైవేటు రంగానికే విక్రయించనున్నట్లు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. 


డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా నుంచి దిగుమతి చేసుకునే స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ పూర్తిగా ప్రైవేటు రంగానికి విక్రయిస్తారు. ఒక మోతాదు స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను 10 డాలర్లకు ఇతర దేశాల్లో విక్రయిస్తున్నారు. అదే ధరను మన దేశంలో కూడా నిర్ణయించాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ భాగస్వామి కోరుతున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ప్రారంభించిన తర్వాత కొంత వరకు ఎగుమతి కూడా చేయాలనుకుంటున్నారు. ఒక మోతాదుకు 10 డాలర్లు అనే పరిమితి ఉంది కనుక, మన దేశంలో అంతకన్నా కాస్త తక్కువకు అందుబాటులోకి తేవచ్చు. దీనిపై రెండు, మూడు వారాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ దిగుమతులు మే నెల నుంచి ప్రారంభమవుతాయి. 


ఈ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ఒక మోతాదు స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ అంతర్జాతీయ ధర 10 డాలర్లు అని, మన దేశానికి దిగుమతి చేసుకునే వ్యాక్సిన్ ధరపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ధర విషయంలో తదుపరి పరిణామాలు జరిగిన వెంటనే వెల్లడిస్తామని పేర్కొంది. 


స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలి. రెండు మోతాదులకు మధ్య 21 రోజుల వ్యవధి ఉండాలి. కోవిడ్-19పై 91 శాతం సామర్థ్యాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-04-22T19:36:24+05:30 IST