డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.706 కోట్లు

ABN , First Publish Date - 2022-01-29T08:49:00+05:30 IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం ఏకంగా 3,468 శాతం వృద్ధి చెంది రూ.706.50 కోట్లుగా నమోదైందని వెల్లడించింది....

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.706 కోట్లు

  క్యూ3 లాభంలో 3,468 శాతం వృద్ధి

 ఆదాయం రూ.5,320 కోట్లు 

హైదరాబాద్‌: డాక్టర్‌  రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం ఏకంగా 3,468 శాతం వృద్ధి చెంది రూ.706.50 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు గణనీయంగా తగ్గటంతో లాభం భారీగా పెరిగిందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పరాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం రూ.19.8 కోట్లుగా ఉంది. కాగా ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు రూ.597.2 కోట్ల నుంచి రూ.4.7 కోట్లకు తగ్గాయి. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 8 శాతం వృద్ధి చెంది రూ.5,320 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,929.60 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో గ్లోబల్‌ జెనరిక్స్‌ విక్రయాలు గణనీయంగా పెరగటంతో పాటు నిలకడైన పనితీరును కనబరిచిందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. 

కాగా రానున్న రోజుల్లో కొత్త ఉత్పత్తులు అభివృద్ధి కోసం పెట్టుబడులు కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. త్రైమాసిక కాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాల కోసం రూ.416 కోట్లు వెచ్చించింది. ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌, యాక్టివ్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (పీఎ్‌సఏఐ) ఆదాయం 4 శాతం వృద్దితో రూ.730 కోట్లుగా ఉందని తెలిపింది. 


అమెరికా వాటా 35 శాతం: డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 35 శాతంగా ఉంది. ఈ కాలంలో అమెరికా విక్రయాలు 7 శాతం పెరిగి రూ.1,860 కోట్లుగా ఉన్నాయి. కొత్తగా 4 ఔషధాల విడుదల, వ్యాపార వృద్ధి, విదేశీ మారకం రేటు ప్రోత్సాహకరంగా ఉండటం కలిసివచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఈ కాలంలో కొత్తగా ఒక అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌ (అండా)ను దాఖలు చేయటంతో మొత్తం వీటి సంఖ్య 91కి చేరిందని పేర్కొంది. కాగా యూరప్‌ మార్కెట్లో మాత్రం విక్రయాలు 2 శాతం తగ్గి 410 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. భారత మార్కెట్లో కొత్త ఔషధాల విడుదల చేయటంతో ఆదాయం 7 శాతం పెరిగి రూ.1,030 కోట్లుగా నమోదు కాగా వర్ధమాన మార్కెట్లలో ఆదాయం రూ.1,150 కోట్లుగా ఉందని పేర్కొంది.


స్పుత్నిక్‌ ఎం కోసం డీసీజీఐతో చర్చలు: భారత్‌లో 12 నుంచి 18 ఏళ్ల వయసు గల వారికి రష్యాకు చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ ఎం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)తో చర్చలు సాగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ (ఏపీఐ) దీపక్‌ సప్రా తెలిపారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటా రష్యాలో అందుబాటులో ఉందని, అదే డేటాను ఇక్కడ సమర్పించే ప్రక్రియను మొదలుపెట్టామని, రానున్న కొద్ది నెలల్లో దీన్ని రెగ్యులేటర్‌కు అందించే వీలుందని అన్నారు. కాగా సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌కు సంబంధించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షల డేటాను ఇప్పటికే సమర్పించామని, అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు దీపక్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-29T08:49:00+05:30 IST