ముసాయిదా ఓటర్ల జాబితాపై.. అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి

ABN , First Publish Date - 2020-11-21T09:14:45+05:30 IST

ఇటీవల విడుదలచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలుంటే తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ ..

ముసాయిదా ఓటర్ల జాబితాపై.. అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి

జనవరి 5లోగా పరిష్కరిస్తాం

అఖిల పక్ష భేటీలో సీఈవో వినతి


అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదలచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలుంటే తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నూతన ఓటర్ల నమోదుకు కూడా సహకరించాలని కోరారు. శుక్రవారమ్కిడ సచివాలయంలో ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముసాయిదా జాబితాతో కూడిన హార్డ్‌ డిస్క్‌లను సమావేశంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఇదే జాబితాను ‘సీఈవో ఆంధ్ర’ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 16వ తేదీన ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. ‘ఈ జాబితాలో మార్పులు, చేర్పులపై డిసెంబరు 15వ తేదీ వరకూ అభ్యంతరాలు, క్లెయిమ్‌లు తెలియజేస్తే..


వచ్చే జనవరి 5లోగా పరిష్కారం చూపుతాం ఓటర్ల తుది జాబితాను 2021 జనవరి 15న ప్రచురిస్తాం’ అని తెలిపారు.  ఎన్నారై, సర్వీసు ఓటర్లతో కలుపుకొని 4,01,45,674 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా తయారు చేశామని తెలిపారు. కాగా, రాబోయే మార్చిలో రెండు టీచర్‌ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయని, దీనికి సంబంధించిన ఓటర్ల నమోదుకు సహకరించాలని పార్టీలను విజయానంద్‌ కోరారు. ఈ సమావేశంలో టీడీపీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 49 పోలింగ్‌ స్టేషన్లను ఇష్టారాజ్యంగా రేషనలైజ్‌ చేశారని విజయానంద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో  వైసీపీఅధికార ప్రతినిధి నారాయణమూర్తి, సీపీఎం ప్రతినిధి జె.ప్రభాకర్‌ కూడా పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T09:14:45+05:30 IST