తూతూమంత్రంగా డ్రెయిన్‌ పనులు!

ABN , First Publish Date - 2021-07-30T06:39:53+05:30 IST

భారీ వర్షాలు కురిస్తే డ్రెయిన్లు పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

తూతూమంత్రంగా డ్రెయిన్‌ పనులు!

 డ్రెయిన్‌లలో ఎక్కడి మురుగు అక్కడే

 భారీగా అల్లుకున్న తూడు, గుర్రపుడెక్క 

 లజ్జబండ డ్రెయిన్‌ కాంట్రాక్టర్‌ ఎమ్మెల్యే అనుచరుడే

 మచిలీపట్నం డివిజన్‌లో రూ.2 కోట్లతో పనులకు అంచనాలు

  పనుల తీరుపై నోరెత్తని అధికారులు 

పాలకులు, డ్రెయినేజీ విభాగం అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ల లాభాపేక్ష వర్షాకాలంలో రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. డ్రెయిన్లలో  తూడు, గుర్రపుడెక్క పెరిగిపోయాయి. మురుగు పారుదలను నిలిపేశాయి. దీనివల్ల ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లోనే నీరు నిల్వ ఉండి రైతులు నష్టపోతున్నారు. తూడు, గుర్రపు డెక్క తొలగింపునకు రూ.2 కోట్లు కేటాయించినా కాంట్రాక్టర్‌ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో తూతూమంత్రంగా సాగుతున్న పనులపై అధికారులు నోరెత్తడం లేదు. 

 ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :

 భారీ వర్షాలు కురిస్తే డ్రెయిన్లు పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. డ్రెయిన్లలో తూటుకాడ, గుర్రపుడెక్క, నాచు నివారణ పనులను మేలో ప్రారంభించాలి. వీటిని నివారించేందుకు వేసవిలో రసాయనాలు పిచికారీ చేస్తే కొంతమేర ఉపయోగం ఉంటుంది. వర్షాలు కురిసే సమయంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపుడెక్క, నాచులను నివారించేందుకు రసాయనాలు నామమాత్రంగా పిచికారీ చేయడంతో ఎందుకూ కొరగాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. జూలైౖలో కురిసిన భారీవర్షాలకు పొలాల్లోని వర్షపునీరు డ్రెయిన్లలోకి చేరడం, తీపినీటి ప్రభావంతో తూటుకాడ, గుర్రపుడెక్క, నాచు విపరీతంగా పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని రైతులు అంటున్నారు.  నారుమడులతోపాటు, వెదజల్లే పద్ధతిన నాట్లు పూర్తిచేసిన పొలాల్లో వర్షపునీరు రోజుల తరబడి ఉండిపోవడంతో వరిసాగు తొలిదశలోనే నష్టయామని తీర ప్రాంత రైతులు అంటున్నారు. 

ఎమ్మెల్యే అనుచరుడికి పనులు

   లజ్జబండ డ్రెయిన్‌... గూడూరు మండలం జాతీయ రహదారి వద్ద నుంచి ప్రారంభమై పెడన, బంటుమిల్లి, గుడ్లవల్లేరు, బందరు మండలాల్లోని సుమారు 70 వేల ఎకరాల ఆయకట్టులోని మురుగునీటిని బందరు మండలం కానూరు-పెదపట్నం గ్రామాల మధ్య సముద్రంలో కలుపుతుంది. 24 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లజ్జబండ డ్రెయిన్‌లో నడుపూరు వద్ద వడ్లమన్నాడు డ్రెయిన్‌ కలుస్తుంది. ఈ డ్రెయిన్‌లో తూటుకాడ, జమ్ము, నాచు పేరుకుపోయాయి. సకాలంలో రసాయనాలు పిచికారీ చేస్తే ఇవి చనిపోయి నీటి ప్రవాహం వె ంట కొట్టుకుపోయేవి. తూడు, గుర్రపుడెక్క చనిపోకపోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆంటంకంగా మారింది. లజ్జబండ డ్రెయిన్‌లో  పూడికతీత పనులను ఎమ్మెల్యే అనుచరుడికి అప్పగించారు. సంబంధిత కాంట్రాక్టరు   నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో  రసాయనాలు పిచికారీ చేయలేదని గూడూరు, పెడన మండలాల రైతులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. లజ్జబండ డ్రెయిన్‌లో కిలోమీటర్ల కొద్దీ తూటుకాడ, గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా మారాయని రైతులు అంటున్నారు. ఈ డ్రెయిన్‌ సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇసుక మేటవేసిందని రైతులు చెబుతున్నారు. గత 15 సంవత్సరాలుగా లజ్జబండ డ్రెయిన్‌లో పూడిక తీసిన దాఖలాలు లేవని రైతులు  అంటున్నారు. 

డ్రెయిన్‌ పనులకు రూ.2 కోట్లు 

 మచిలీపట్నం డివిజన్‌ పరిధిలో గుండేరు,  శివగంగ, ఐనంపూడి, భీమనది, తాళ్లపాలెం, లజ్జబండ, తదితర ప్రధాన డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో తూటుకాడ, గుర్రపుడెక్క, నాచులను తొలగించేందుకు ఈ ఏడాదికి రూ.2 కోట్లతో  అంచనాలు రూపొందించారు. వేసవిలోనే ఈ డ్రెయిన్లలో రసాయనాలు పిచికారీ చేయడంతోపాటు, కాలువలు వదిలిన తరువాత, భారీవర్షాలు కురిసిన సమయంలో డ్రెయిన్లలో తూడు, గుర్రపుపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డురాకుండా ఎప్పటికపుడు పనులు చేస్తూ ఉండాలి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తాము పంటలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు.

లజ్జబండలో పనులు చేయిస్తున్నాం 

ఇటీవల కురిసిన వర్షాలకు లజ్జబండ డ్రెయిన్‌లో మురుగునీరు పొంగి ప్రవ హించింది. రైతుల అభ్యర్థన మేరకు ఈ డ్రెయిన్‌లో తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయిన ప్రాంతాల్లో యంత్రాల ద్వారా వాటిని తొలగిస్తున్నాం. అధిక వర్షాలు కురవడంతో రసాయనాలు పనిచేయలేదు. 

- మురళీ, డీఈ, బందరు డ్రెయినేజీ విభాగం


Updated Date - 2021-07-30T06:39:53+05:30 IST