Abn logo
Sep 26 2021 @ 23:53PM

కాడా.. కోత

రేపల్లె : నల్లూరిపాలెం డ్రెయిన్‌లో పేరుకుపోయిన తూటికాడ

కాల్వలు, డ్రెయిన్లపై శీతకన్ను

ప్రతిపాదిత పనుల్లో భారీగా కోత

149 ప్రతిపాదిస్తే 89 మాత్రమే మంజూరు

నిధులు తగినంతగా లేవని పనులపై నిర్లక్ష్యం

కాడా కమిషనర్‌ నిర్ణయంపై సాగునీటి సంఘాల అసంతృప్తి


వర్షాలు పడుతున్నాయి. జలశయాలు నిండుకున్నాయి. పంటల సాగుకు నీటి కష్టాలు లేవు. అయితే ఆ నీరు పంట పొలాలకు చేరాలంటే డ్రెయిన్లు, కాల్వలు సక్రమంగా ఉండాలి. ఈ డ్రెయిన్లు, సాగునీటి కాల్వలు నాచు, పూడికతో నిండి ఉన్నాయి. ఏటా వీటిని తొలగించి పొలాలకు సాగునీరు పుష్కలంగా పారేలా చేయాలి. అయితే ఈ పనులపై ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. డ్రెయిన్లు, కాల్వలు నాచు, పూడికతో నిండి నీరు విడుదల చేసినా పొలాలకు చేరడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేవన్న సాకుతో ఈ ఏడాది ప్రతిపాదిత పనుల్లో భారీగా కోత వేశారు. జిల్లా అధికారులు 149 పనుల కోసం రూ.17.04 కోట్లు అడిగితే కాడా కమిషనర్‌ 89 పనులు మంజూరు చేసి కేవలం రూ.6.68 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయంపై సాగునీటి సంఘాల నాయకులు, రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):  ఏటా సాగునీటి కాలువలు, డ్రెయిన్లలో నాచు, పూడిక తొలగింపు, షట్టర్ల రిపేర్లు వంటి పనులను మంజూరు చేసే కాడా (సీఏడీఏ - కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఈ ఏడాది జిల్లాపై శీతకన్ను చూపుతుంది. ఫ్లవ్‌ బ్యాక్‌ ఫండ్స్‌ తగినంతగా అందుబాటులో లేవన్న సాకుతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదించిన పనుల్లో ఇంచుమించుగా సగం కోత పెట్టింది. ఎక్కువ అంచనా విలువ కాగల పనులను పక్కన పెట్టేసి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే వర్కులకు మాత్రమే కాడా కమిషనర్‌ అనుమతి మంజూరు చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి, డ్రెయినేజీ డివిజన్‌ రేపల్లెలో ప్రతిపాదించిన పనుల్లో కోత విధించారు. కాడా కమిషనర్‌ నిర్ణయంపై సాగునీటి సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నారు. ప్రస్తుతం కాలువలు, డ్రెయిన్లలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నాచు, పూడిక తొలగింపు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. అలానే షట్టర్లు రిపేర్లు చేయాలన్నా నీటి విడుదల తగ్గాలి. మరోవైపు అరకొర పనులు మంజూరు చేయడంపై డెల్టా రైతులు కాడా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా సీజనల్‌ రిపేర్లు పూర్తిస్థాయిలో చేస్తేనే కాస్తో.. కూస్తో కాలువల చివరి భూములకు సాగునీరు అందుతాయి. నాచు, పూడిక తొలగించకపోతే నీటి ప్రవాహం మధ్యలోనే నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో ప్లవ్‌ బ్యాక్‌ ఫండ్స్‌తో సంఽబంధం లేకుండా అదనపు నిధులు మంజూరు చేసైనా పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.


ప్రతిపాదిత పనులు ఇలా..

2021-22 ఆర్థిక సంవత్సరానికి 149 పనులను నాలుగు డివిజన్ల నుంచి ప్రతిపాదించారు. కేడబ్ల్యూ తెనాలి డివిజన్‌ నుంచి 49 పనులు రూ.5.41 కోట్లు, ఇరిగేషన్‌ గుంటూరు డివిజన్‌ నుంచి 6 పనులు రూ.1.14 కోట్లు, డ్రెయినేజీ డివిజన్‌ చీరాల నుంచి 22 పనులు రూ.3.13 కోట్లు, రేపల్లె డ్రెయినేజీ డివిజన్‌ నుంచి 72 పనులు రూ.7.34 కోట్లతో ప్రతిపాదనలను ఆయా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కాడా కమిషనర్‌కు పంపించారు. అయితే ప్లవ్‌ బ్యాక్‌ ఫండ్స్‌ అందుబాటులో లేవని తెనాలి డివిజన్‌లో కేవలం 32 పనులకు మాత్రమే రూ.3.48 కోట్లకు మంజూరు చేశారు. గుంటూరు డివిజన్‌లో 6 పనులు మంజూరు చేసి అంచనా విలువని రూ.40 లక్షలకు తగ్గించేశారు. చీరాల డివిజన్‌లో 15 పనులకు శాంక్షన్‌ ఇచ్చి అంచనా విలువని రూ.86.59 లక్షలకు కుదించారు. రేపల్లె డివిజన్‌లో 36 పనులు మంజూరు చేసి అంచనా విలువని రూ.1.93 కోట్లకు తగ్గించారు. కాడా కమిషనర్‌ శాంక్షన్‌ చేసిన పనులన్నింటికి టెండర్లు పిలిచి 75 వర్కులను ఇరిగేషన్‌ వర్గాలు గ్రౌండింగ్‌ చేశాయి. 14 పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.