కవలల కల నెరవేరిన వేళ!

ABN , First Publish Date - 2020-03-17T05:59:44+05:30 IST

ఎంత ఎత్తయిన పర్వతమైనా తాషి, నుంగ్షిమాలిక్‌ల ముందు చిత్తు కావాల్సిందే. ఈ కవలలిద్దరూ కలసి ఈ భూమ్మీద అత్యంత ఎత్తయిన ఏడు శిఖరాలపై పాదం మోపి, పర్వాతోరాహకుల...

కవలల కల నెరవేరిన వేళ!

ఎంత ఎత్తయిన పర్వతమైనా తాషి, నుంగ్షిమాలిక్‌ల ముందు చిత్తు కావాల్సిందే. ఈ కవలలిద్దరూ కలసి ఈ భూమ్మీద అత్యంత ఎత్తయిన ఏడు శిఖరాలపై పాదం మోపి, పర్వాతోరాహకుల ‘గ్రాండ్‌స్లామ్‌’ సాధించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా కవలలుగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారు.     


రిటైర్డ్‌ కల్నల్‌ వీఎస్‌ మాలిక్‌ అందరి తండ్రుల్లాంటివాడు కాదు. ఆయన తన కూతుళ్లు తాషి, నుంగ్షిమాలిక్‌లను పై చదువులు చదవమని ఒత్తిడి చేయలేదు. ఇంటర్‌లో ఇద్దరూ 90 శాతానికి పైగా మార్కులు సాధించినా దూరవిద్యలో చదువుకుంటూ ఏదైనా నేర్చుకోమని వారికి సూచించాడు. అలా వాళ్లిద్దరూ జర్నలిజం, మాస్‌కమ్యూనికేషన్‌ వైపు అడుగులు వేశారు.  సామాజిక సమస్యలు మీద రచనలు చేశారు. చదువు, రచన, డ్యాన్స్‌లో పట్టు సాధించారు. 


ట్విన్‌ ఎవరెస్టర్స్‌...

తండ్రి వీఎస్‌ మాలిక్‌ ఈసారి తన కూతుళ్ల జీవితాన్ని ఊహించని మలుపుతిప్పారు. ఇద్దరు కూతుళ్లను 2009లో ఉత్తరకాశీలోని ‘నెహ్రూ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌’లో బిగినర్స్‌గా చేర్చారు. శిక్షణలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ఇద్దరు వెనుకడుగు వేయలేదు. వారి శ్రమను చూసి శిక్షకులు ప్రోత్సహించారు. ‘మీరిద్దరూ కచ్చితంగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కుతారు’ అనేవారు. కోచ్‌లు వారిద్దరినీ ‘ట్విన్‌ ఎవరెస్టర్స్‌’ అని పిలిచేవారు. కఠిన శ్రమతో శిక్షణలో అన్ని స్థాయిల్లోనూ ఏ గ్రేడ్‌ సాధించారు. తాషి, నుంగ్షీలు ఇనస్ట్రక్టర్‌ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ముప్పై మంది శిక్షార్థుల్లో ముగ్గురికి మాత్రమే ఈ గ్రేడ్‌ వచ్చింది. 


అదే ఊపులో గ్రాండ్‌స్లామ్‌...

‘‘ఎవరెస్ట్‌ ఎక్కడానికి 2010లో ప్రయత్నాలు ప్రారంభించాం. 2013లో అనుకున్నది సాధించాం. అయితే అక్కడే మరో మహాప్రయత్నానికి పునాది పడింది. ఏడుఖండాల్లో ఎత్తైన శిఖరాలన్నింటినీ ఎక్కడాన్ని పర్వతారోహకుల ‘గ్రాండ్‌స్లామ్‌’ అంటారు. మాతోపాటు ఉన్న కొంతమంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ ఎక్కితే వారి లక్ష్యం పూర్తయి గ్రాండ్‌స్లామ్‌ సాధించినట్టే. అన్ని పర్వతాల్లోకి ఎవరె స్ట్‌ ఎక్కడమే కష్టం. 26 వేల అడుగుల ఎత్తైన శిఖరం మీద ఏ క్షణంలోనయినా ప్రాణానికి ప్రమాదం ఏర్పడొచ్చు. ఆక్సిజన్‌ అందదు. దీన్ని పర్వతారోహకులు ‘డెత్‌ జోన్‌’ అంటారు. మేము అప్పటికే కిలిమాంజారో పర్వతం ఎక్కాం. మా రెండో ప్రయత్నంగా ఎవరెస్ట్‌ ఎక్కే పనిలో ఉన్నాం. ఈ ప్రయత్నంలో గెలిస్తే  భూమ్మీద ఎత్తైన ఏడు పర్వతాలను సులభంగా ఎక్కగలమని భావించాం. ఆ విధంగా 2013లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కాం’’ అని కవలలిద్దరూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.


అంటార్కిటికా సాహస యాత్ర!

అంటార్కిటికాలో విన్సన్‌ మాసిఫ్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి తాషి, నుంగ్షీలు చాలా కష్టపడ్డారు. అక్కడ -7 నుంచి -40 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. రోజులో 22 గంటల పాటు తీక్షణంగా పరుచుకునే వెలుగు, ప్రమాదకరమైన మంచునదులు.. ఇలా ధ్రువాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొని మరీ 2014లో విన్సన్‌ మాసిఫ్‌ పర్వత శిఖరాన్ని ఎక్కారు. ‘‘చివరకు మా ప్రయత్నం అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ మాసిఫ్‌ ఎక్కడంతో పూర్తయింది. 18 రోజులు అంటార్కిటికాలో సాహసయాత్రలా గడిచింది. పర్వతారోహణలో కీలకమైన సమయంలో పీరియడ్స్‌ రావడం చెప్పలేనంత బాధ కలిగిస్తుంది. అన్నింటినీ ఓర్చుకొని లక్ష్యాన్ని చేరుకున్నాం’’ అని తాషి, నుంగ్షిమాలిక్‌లు తాము పడిన కష్టాలను వివరించారు. 


నాన్న తోడుగా... 

‘‘శిఖరాలు ఎక్కేటప్పుడు త్వర గా శరీర బరువును కోల్పోతాం. ఎవరెస్ట్‌ను ఎక్కే ప్రయత్నంలో మేమిద్దరం 12 కిలోల బరువు తగ్గాం. వెంటవెంటనే పర్వతాలను ఎక్కాల్సిరావడంతో శక్తిని పుంజుకోవడానికి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, ఏరోబిక్స్‌ చేసేవాళ్లం. నాన్న మాకు కోచ్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా ఉండడంతో మా పని సులువయింది. జీవితంలోనే కాదు గ్లాండ్‌స్లామ్‌ సాధించడంలోనూ నాన్నే మా వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపించాడు’’ అన్నారు. ఆఫ్రికాలో టాంజానియాలోని 5895 మీటర్ల ఎతైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడంతో తాషి, నుంగ్షీల గ్రాండ్‌స్లామ్‌ పూర్తయింది. ఇలా ప్రపంచంలోనే తొలిసారి భూమ్మీద అత్యంత ఎత్తయిన ఏడు శిఖరాలను అధిరోహించిన తొలి మహిళా కవలలుగా ‘గిన్నిస్‌బుక్‌’లోనూ చోటు దక్కించుకున్నారు. ఇటీవలే ఈ కవలలిద్దరూ రాష్ట్రపతి నుంచి ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్నారు.

Updated Date - 2020-03-17T05:59:44+05:30 IST