‘ద్రావిడ’ మహమ్మారి!

ABN , First Publish Date - 2020-04-05T07:24:01+05:30 IST

‘మహమ్మారి’ అనే మాట ఇటీవల బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ మాటను తన హిందీ ప్రసంగంలో ‘మహామారి’ అని ఒకసారి, ‘మహమ్మారి’ అని మరొకసారి రెండు విధాలుగా సంబోధించారు. హిందీ, సంస్కృతం వార్తలలో...

‘ద్రావిడ’ మహమ్మారి!

‘మారి’ అనే పదాన్ని అంటువ్యాధి అనే అర్థంలో ప్రయోగించడం మనకు చాల ప్రాచీన కాలంనుండే ఉంది. ఈ పదాన్ని తిక్కన తన విరాట పర్వం, ద్రోణ పర్వాలలో ప్రయోగించాడు. ‘మారి’ ద్రావిడ శబ్దమేనని, దక్షిణాది నుంచే అది ఔత్తరాహ భాషలలోనికి పోయింది అని చెప్పడానికి ఆధారాలున్నాయి. 


‘మహమ్మారి’  అనే మాట ఇటీవల బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ మాటను తన హిందీ ప్రసంగంలో ‘మహామారి’ అని ఒకసారి, ‘మహమ్మారి’ అని మరొకసారి రెండు విధాలుగా సంబోధించారు. హిందీ, సంస్కృతం వార్తలలో కూడా ఇది ఇటీవల ప్రతి రోజూ ప్రయోగితమవుతోంది. మహమ్మారి అనే మాట సంస్కృత పదం అని చాలా మంది నమ్ముతున్నారు. సంస్కృ తపదాలనుండే తెలుగుపదాలు ఎక్కువగా పుట్టాయి లేదా వచ్చాయి అని చెప్పడానికి మన పండితులు ఉత్సాహపడుతుంటారు కదా. అయితే మహమ్మారి అనే పదం ద్రావిడ భాషలనుండే సంస్కృతానికి పోయింది.


మారి అనేది ఒక జబ్బుకు పెట్టుకున్న అమ్మవారి పేరు. మనకు వర్షఋతువులో వచ్చే సాంక్రామిక వ్యాధులకు అన్నింటికి అమ్మవారి పేర్లే ఉన్నాయి. ముత్యాలమ్మ, ఆటలమ్మ, మారెమ్మ అనేవి అన్నీ మనం వేరు వేరు అంటు రోగాలకు పెట్టుకున్నపేర్లు. ఇక మహమ్మారి అని కూడా అన్ని రకాల అంటు జబ్బులకు వాడతాము. ఇది, మారెమ్మ అనే దేవత పేరే. ఈ మారెమ్మ అంటే మన దగ్గర ఉన్న దేవత. ప్రతి గ్రామంలో ప్రతి కులం వారికి అమ్మవారు ఎల్లమ్మ. ఎల్లమ్మకు ఉన్న మరొక పేరే మారెమ్మ. తండ్రి జమదగ్ని ఆజ్ఞ పైన తన తల్లిని తల నరికి చంపడానికి ఉద్యుక్తుడౌతాడు పరశురాముడు. తప్పించుకోవడానికి ఎల్లమ్మ పారిపోతుంటుంది. అలా వేరు వేరు కులాల వారి ఇండ్లకు పోయినప్పుడు వారు కొద్ది సేపు ఉంచుకొని పరశురాముడు వస్తున్నాడని తెలుసుకొని భయపడి ఆమెను బయటికి పంపిస్తారు. ఆ ఇండ్ల వారి అందరి పైనా కోపగించి ఏడాదికి ఒకసారి తనకు కొలుపు జేయకపోతే తన ఆగ్రహానికి పిల్లలు, గొడ్డూ గేదెలను పోగొట్టుకోవలసి వస్తుంది అని హెచ్చరిస్తుంది. అలా పారిపోతూ చివరికి ఒక మాదిగ గృహస్తు ఇంటికి పోయింది. 


అక్కడ ఆమెను తోలు ఊనే లందలో దాచి పెడతారు. పరశు రాముడు వెదుకుతూ వెదుకుతూ ఆ మాదిగ ఇంటికి వస్తాడు. ఇంట్లో కనిపించదు. చివరికి లందలో పట్టుకుంటాడు. తల నరకబోతుంటే ఆ యింటి ఇల్లాలు వచ్చి అడ్డుకొని ఆమెను వాటేసుకొని కాపాడే ప్రయత్నం చేస్తుంది. పరశురాముడు ఆవేశం లో తల నరకగా ఇద్దరి తలలు తెగిపోతాయి. అలా తల్లిని చంపిన తర్వాత ఆయన తండ్రి జమదగ్ని పరశురాముని ఏదైనా వరం కోరుకోమంటాడు. తన తల్లిని బతికించమని కోరుకుంటాడు ఆయన.  అప్పుడు తలను మొండానికి అతికించి ఎల్లమ్మను బతికిస్తారు. కాని ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. మాదిగ స్త్రీ తలను ఎల్లమ్మ మొండానికి ఎల్లమ్మ తలను మాదిగ స్త్రీకి పెడతారు. ఇద్దరూ బతుకుతారు. ఇలా ఎల్లమ్మ మారింది. మారిన అమ్మే మారెమ్మ, మారి అయింది. ఎల్లమ్మ తల–మాదిగ మొండెం ఉన్న దాన్నే జమదగ్ని భార్యగా స్వీకరిస్తాడు. ఆమెను రేణుకా ఎల్లమ్మగా పిలుస్తారు. మాదిగ తల ఎల్లమ్మ మొండెం ఉన్న దాన్ని మారెమ్మ అని పిలుస్తారు. అంతే కాదు ఇద్దరినీ ఎల్లమ్మ అనడం కూడా ఉంది. ఇద్దరినీ మారెమ్మ అని కూడా అనడం ఉంది. అందుకే ఎల్లమ్మ సబ్బండ కులాల దేవత అయింది. 


ఇదే మారెమ్మ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోనూ ఉన్నది. అక్కడ ఈమెను మారెమ్మ, మారియమ్మ, మారియమ్మన్ అని పిలుస్తారు. కర్ణాటకలో ఎల్లమ్మ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈమెను మారెమ్మ అంటారు. మారెమ్మ అని పిలిచే కథ ఉత్తర భారతంలో లేదు. అక్కడ రేణుక కథ మన ఎల్లమ్మ కథ ఒకటే. కాని మాదిగ స్త్రీ ఉదంతం అక్కడ ఉండదు. కాబట్టి దక్షిణ భారతదేశంలోని ద్రావిడ భాషలలోనే ఈ మారి మారెమ్మ అనే పిలుపుతో కూడిన కథ ఉంది. మారి అనే పదం ఇక్కడనుండే వ్యాథిదేవతలకు పేరుగా ఉత్తర భారతానికి పోయింది. ఈ మారెమ్మ అనే పదం ప్రాచీన కాలం నుంచి ఉంది అని చెప్పడానికి సాక్ష్యాలు మనకు లభిస్తున్నాయి. మారి, మారు పదాలను Dravidian Etymological Dictionary తమిళ తెలుగు పదాలుగానే చూపింది. మారి అనే పదాన్ని అంటువ్యాధి అనే అర్థంలో ప్రయోగించడం మనకు చాల ప్రాచీన కాలంనుండే ఉంది. మనకు మహాభారతంలోనే మారి అనే పదాన్ని తిక్కన తన విరాట పర్వం, ద్రోణ పర్వాలలో కూడా ప్రయోగించాడు. విరాట పర్వంలో తృతీయాశ్వాసంలో 37వ సీస పద్యంలో మారి శబ్దాన్ని ప్రయోగించాడు. భీముడు ఉపకీచకులను అందరినీ గంధర్వుని వేషంలో వచ్చి చంపిన తర్వాతి రోజున ద్రౌపది వీధిలో పోతుంటే అక్కడి ప్రజలు ఇలా అనుకున్నారట. ‘మనకీచకుల కెల్ల మారియై పుట్టిన సుదతి పోయెడను నని చూచువారు.....’ అని ఇంకా పద్యంలో వర్ణిస్తాడు. ద్రౌపదినే ఒక మారెమ్మగా భావించి ఆమె వైపు కూడా చూడడానికి భయపడి పక్కకు తప్పుకొని తల వంచుకొని జనం పోయారని తిక్కన అక్కడ వర్ణించాడు. 


ఇక ద్రోణ పర్వం ప్రథమాశ్వాసంలో ద్రోణుడు చేసిన వీర విక్రమాన్ని వర్ణిస్తూ 141వ పద్యంలో ఇలా వర్ణిస్తాడు. ‘కూల్చుచు గజముల నెత్తుట/ దేల్చుచు దురగముల వీఁకఁ దేరులు మరలన్/వెల్చుచుఁ గాల్బముల బొరి/మాల్చుచు రౌద్రముగ మారి మసగిన భంగిన్’. మారెమ్మ అనే వ్యాధి కలయ దిరిగి మనుషులను అంత మొందించినట్లుగా ద్రోణుడు ఏనుగులను కూలుస్తూ గుర్రాలను నెత్తుట తేలుస్తూ రథాలను వెనుకకుపోయేటట్లు చేస్తూ పదాతి దళాన్ని చంపుతూ వీరవిహారం చేసాడని ఇందులో వర్ణించడం ఉంది. ఇక మారెమ్మ వస్తే ఊడ్చుకు పెట్టి పోతుంది అనే నానుడిని ఇక్కడ ధ్వనించేలాగా దీన్ని వర్ణించాడు తిక్కన. ఈ రెండు ప్రయోగాలలో మారి అనే పదం జబ్బుకు పర్యాయపదంగా వ్యాధి దేవతగా వర్ణించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది, 13వ శతాబ్ది నాటికే ‘మహమ్మారి’ అనే పదం ఉందని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం. దీనికన్నా ముందు కూడా చాలా కాలం క్రితమే ఉండి వుండడానికి ఆస్కారం ఉంది. సాహిత్య గ్రంథాలలో సాక్ష్యాలు చూపడానికి ఇదే అన్నింటికన్నా ప్రాచీనమైన గ్రంథంగా కనిపిస్తుంది. తర్వాతి కాలంలో కూడా పెద్దన ‘మను చరిత్ర’లో దీన్ని ప్రయోగించాడు. 


బ్రిటిషు అధికారి, పరిశోధకుడు విలియం క్రూక్ రాసిన గ్రంథం ‘ఫోక్ లోర్ ఆఫ్ ఇండియా’ అనే గ్రంథంలో ఈ అమ్మతల్లులు అంటువ్యాధుల అధిదేవతలుగా ఉండే వారిని గుర్తించాడు. వారిని వర్ణించడానికి The Godlings of Diseases అని ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్నే కేటాయించాడు. దక్షిణ భారతం అంతటా వ్యాధులకు మారి అనే పదం ఉండడాన్ని అతడు గుర్తించాడు. ఎల్లమ్మ కథ ఆధారంగా మారి అనే పదం ద్రావిడ శబ్దమేనని, ఇది దక్షిణాది నుంచే ఔత్తరాహ భాషలలోనికి పోయింది అని చెప్పవచ్చు. 

పులికొండ సుబ్బాచారి

Updated Date - 2020-04-05T07:24:01+05:30 IST