మొక్కే కదా అని మెక్కేశారు!

ABN , First Publish Date - 2020-07-13T20:10:00+05:30 IST

జిల్లాలోని డీఆర్‌డీఏ, వెలుగులో అవినీతిపరులకు అడ్డేలేకుండా..

మొక్కే కదా అని మెక్కేశారు!

పెంపకం పేరుతో రూ.కోట్లు స్వాహా

అవెన్యూ మాటున వెలుగు ఉద్యోగుల నిర్వాకం

అవినీతిపరులకు అండగా అధికారులు

వాటాల కారణంగానే చర్యలకు వెనుకడుగు

ఏడాదికాలంగా చర్యలు నిల్‌

డీఆర్‌సీలో మంత్రుల ఆదేశాలూ బేఖాతరు


ఒంగోలు(ప్రకాశం): జిల్లాలోని డీఆర్‌డీఏ, వెలుగులో అవినీతిపరులకు అడ్డేలేకుండా పోతోంది. కోట్లు స్వాహా చేసినా అడిగే దిక్కే లేకుండా పోతోంది. ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా, విజిలెన్సు అధికారులు అవినీతిని నిగ్గుతేల్చినా వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అవినీతిపరులను కాపాడే ప్రయత్నాల్లో ఆ శాఖ అధికారులు ముందువరుసలో ఉంటున్నారు. మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడి.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటమని ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తే వాటిని కాగితాలకే పరిమితం చేసి రూ.కోట్లు జేబుల్లో వేసుకున్నారు. అందిన అవకాశాన్ని వినియోగించుకొని చిక్కినకాడికి దోచుకున్నారు. వారిలో కొందరు ఇతర జిల్లాలకు బదిలీ అయిపోగా ఇంకొందరు ఇక్కడే దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మొక్కలు నాటి పెంచే పేరుతో మెక్కేశారు. మొత్తం 18మందిపైన అవినీతి ఆరోపణలు రుజువై వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినా ఇక్కడ అధికారులు ఆ ఫైలును పక్కన పడేసి చోద్యం చూస్తున్నారు. 


ఉపాధి హామీ నిధులతో ప్రభుత్వం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉద్యానవనాల సాగు, రోడ్ల వెంట మొక్కల పెంపకం ఈ నిధులతో చేపట్టింది. లక్షలాది మొక్కలను ఇతర జిల్లాల్లోని నర్శరీల నుంచి కొనుగోలు చేశారు. వారికి బిల్లులు చెల్లించకుండానే తెచ్చి రోడ్ల వెంట నాటించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ  కార్యక్రమాన్ని ఎక్కువగా నిర్వహించారు. అవెన్యూ ప్లాంటేషన్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్ల వెంట చెట్లు నాటడం, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయటం, రోజూ నీరు పోయించటం, ఎరువులు వేయటం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ బాధ్యతను ప్రభుత్వం వె లుగు అధికారులకు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి నిధులతో అవెన్యూ ప్లాంటేషన్‌ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం సెర్ప్‌కు అప్పగించింది. ఉపాధి నిధులను మొక్కల సంరక్షణ కోసం ఖర్చుచేసే బాధ్యతను వెలుగుకు అప్పగించారు.


సంరక్షణ పేరుతో చప్పరించేశారు

నర్శరీల నుంచి మొక్కలను లక్షల్లో కొనుగోలు చేశారు. వాటిని అవెన్యూ ప్లాంటేషన్‌ పథకం కింద రోడ్ల వెంట నాటారు. కొన్నిచోట్ల నాటకుండానే నాటినట్లు చూపించారు. సంరక్షణ చర్యలు చేసినట్లుగా లెక్కల్లో చూపి బిల్లులు పెట్టుకున్నారు. నీరు పోసిన వారికి, ట్రీగార్డులకు, ఎరువులు వేసినందుకు బిల్లులు చెల్లించే అధికారం వెలుగులోని ఏరియా కోఆర్డినేటర్లకు అప్పగించారు. ఆయా మండలాల్లోని ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలో కూడబలుక్కుని నిధులను పక్కదారి పట్టించేశారు. వారి బంధువుల పేర్లతో ఉన్న అకౌంట్లకు నిధులను మళ్లించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. బోర్డుల డబ్బులను కూడా దిగమింగారు.  


రూ2.77కోట్లు అవినీతి

మొక్కల పెంపకంలో అవినీతి ఎక్కువగా కనిగిరి, బేస్తవారిపేట, మార్కాపురం, అద్దంకి తదితర క్లస్టర్ల పరిధిలోనే జరిగింది. ఆ ప్రాంతాల్లో గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో కూడా ఎక్కడా మొక్కల జాడ కనిపించలేదు. నీళ్లు పోసిన వారు లేకపోగా ట్రీగార్డులు పెట్టిన దాఖలాలు లేవు. ఏరియా కోఆర్డినేటర్లు బిల్లులు చెల్లించిన వారు అక్కడి వారు కాదు. ఒక ఏరియా కోఆర్డినేటర్‌ అయితే ఇతర జిల్లాల్లో ఉన్న తమ బంధువుల బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు జమచేసి వారి దగ్గర నుంచి తిరిగి తీసుకున్నాడని తేలింది. ఇంకో ఏరియా కోఆర్డినేటర్‌  రైతులతో ఉద్యాన పంటల సాగు పథకం మొక్కల కోసం అని రైతులతో సంతకాలు చేయించుకొని, రూ. 10లక్షలకు కొనుగోలు చేసినట్లు చూపి గంపగుత్తగా నిధులు డ్రా చేసుకున్నాడు. ఇలా ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు కలిసి అవెన్యూ ప్లాంటేషన్‌, ఉద్యానవన పంటల పథకాల్లో రూ. 2.77కోట్లు నిధులు స్వాహా చేసినట్లు డీఆర్‌డీఏ, వెలుగు అధికారులు గుర్తించారు. 


డీఆర్‌సీలో మంత్రి ఆదేశించినా.. బేఖాతరు

ఈ ఏడాది మార్చిలో కలెక్టరేట్‌లో డీఆర్సీ సమావేశం జరిగింది. అందులో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో వెలుగులో జరిగిన అవినీతిపై గళమెత్తారు. రూ. 6కోట్ల అవినీతి జరిగిందని, వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను సమావేశంలో వివరణ అడిగారు. వెంటనే విచారణకు ఆదేశించారు. కానీ ఇంతవరకూ అవినీతిపరులపై చర్యలు తీసుకునేందుకు వెలుగు అధికారులు ముందుకు రావటం లేదు.


షోకాజ్‌ నోటీసులతోనే సరి

అవినీతికి పాల్పడిన వెలుగు ఉద్యోగులపై చర్యలకు ఆ శాఖ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. దోపిడీ చేసిన సొమ్ములో తమ వంతు ఎంత అనే దిశగా బేరసారాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారిపై చర్యలు నిలిచిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పైగా కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారు కూడా ఉన్నారు. సెర్ప్‌ నుంచి అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు జిల్లా వెలుగు కార్యాలయానికి ఆదేశాలు అందుతున్నా వారిపై చర్యలకు ససేమిరా అంటున్నారు స్దానిక అధికారులు.


విజిలెన్సు విచారణ

అవినీతిపరులపై చర్యలకు వెలుగు అధికారులు ససేమిరా అంటున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు మొక్కల పెంపకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపినట్లు తెలుస్తోంది. రెండు మూడు మండలాల్లో ఈ వివరాలను సేకరించినట్లు సమాచారం. వారి విచారణలో కూడా అవినీతి రుజువైనట్లు తెలుస్తోంది.


Updated Date - 2020-07-13T20:10:00+05:30 IST