Abn logo
Apr 2 2020 @ 00:21AM

స్వాప్నికుడు, చరిత్రకారుడు

ఆదర్శవంతమైన ఉజ్వల భవిష్యత్తును, మత కుల రహిత సమాజాన్ని అర్జున్ దేవ్ ఆశించాడు. వాస్తవంలోనే వుంటూ, వాస్తవానికి దూరంగా, మరేదో ఉజ్వల భవిష్యత్తును ఆశించిన అర్జున్ దేవ్ చారిత్రక సంపద, వారసత్వాలను, భవిష్యత్ కలలను మిగిల్చిపోయాడు. 

నివాళి: అర్జున్ దేవ్ (1938–2020)


ప్రముఖ చరిత్రకారుడు అర్జున్ దేవ్ మార్చి 29న న్యూఢిల్లీలో మరణించారు. 1938లో ఇప్పటి పాకిస్థాన్ భూభాగంలో పుట్టిన అర్జున్ దేవ్, దేశ విభజనానంతరం భారత దేశానికి తల్లిదండ్రులతో తరలి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీ లోని కిరోరి మల్ కళాశాలలో ఆయన విద్యాభ్యాసం, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కె.యమ్. ఆష్‍రాఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి చరిత్ర విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలిలో (NCERT) సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా పని చేసి రిటైరయ్యారు. 


అర్జున్ దేవ్ స్వయంగా భారత దేశ చరిత్ర, దేశ సాంస్కృతిక చరిత్ర, సమకాలీన చరిత్ర, ప్రపంచ చరిత్రపై పలు ప్రామాణిక గ్రంథాలు రాశాడు. ‘The Story of Civilization’ అనే గ్రంథం జపనీస్ భాషలోకి అనువదించబడి, జపాన్ ప్రభుత్వ అవార్డు పొందింది. జాతీయ పరిశోధనా మండలి తరఫున ప్రముఖ చరిత్రకారులు రొమిలా థాపర్, ఆర్.యస్. శర్మ, బిపిన్ చంద్ర తదితరులు రాసిన పాఠ్యగ్రంథాల ప్రచురణ, పునఃపరిశీలన అనంతరం వాటి పునర్ముద్రణ, చరిత్ర పాఠ్యాంశాలపై రాష్ట్రాల సహకారంతో వర్క్‌షాపులు నిర్వహణ; ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పాఠ్య గ్రంథాల పరిశీలనకు వర్క్‌షాపుల నిర్వహించి, తగు మార్పులు సూచించడంలో ఎన్ సి ఇఆర్ టిలోని తన సహచరులతో కలిసి ఆయన ప్రముఖ పాత్ర వహించారు. భారత దేశ  స్వాతంత్ర సమరాన్ని, బొమ్మలతో, ఫొటోలతో పాటు ప్రతి ముఖ్య ఘట్టంపై వివరణాత్మక రచనలతో, పెద్ద సైజులో జాతీయ పరిశోధనా మండలి ముద్రించింది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపు దిద్దుకొని, అప్పటి ప్రధాన మంత్రి కీ.శే. పి.వి.నరసింహారావు గారిచే ఆవిష్కరింపబడి పలువురి ప్రశంసలు పొం దింది. ఇందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాల్లో జరిగిన బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలను సవివ రంగా పొందుపరిచింది. తెలం గాణ రైతాంగ పోరాటం, అల్లూరి సీతారామరాజు రంప ‘పితూరి’, చీరాల పేరాల ఉద్యమాలతోపాటు, గరిమెళ్లవారి గేయం ‘మాకొద్దీ తెల్లదొరతనము’ పాటను ఆంగ్లీకరించి ప్రచురించింది. ఈ ఆల్బమ్, ‘నభూతో న భవిష్యతి’గా పేరుగాంచింది. 


అర్జున్ దేవ్ రిటైరయ్యాక, ఐ.సి.హెచ్.ఆర్ (ICHR) చేపట్టిన ‘Towards Freedom’ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్ ఎడిటర్‌గా అత్యంత ప్రామాణిక సంపుటాలకు, అపురూపమైన డాక్యుమెంట్లతో, సంపుటి సంపాదకులతో కృషి చేసి ముద్రింప చేశారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వార్షిక సభల్లోచురుగ్గా పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించడం, విదేశీ వ్యవహారాలపై అధ్యక్షోపన్యాసం చేశాడు (అమృతసర్ వార్షిక మహాసభలు). ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వార్షిక సభలో, ‘పరిశోధనా పద్ధతులు’ విభాగానికి అధ్యక్షత వహించారు. అర్జున్ దేవ్ జీవితాన్ని ప్రేమించాడు. ఆదర్శవంతమైన ఉజ్వల భవిష్యత్తును, మత కుల రహిత సమాజాన్ని ఆశించాడు. అర్ధ శతాబ్దంపాటు పెంపొందుతూవచ్చిన మా స్నేహమాధుర్యంలో ఎన్నో జ్ఞాపకాలు. సంభాషణల్లో ఉర్దూ, సూఫీ కవుల పద పంక్తుల్ని అలవోకగా ఆలపించేవాడు. ఇటీవల కొంతకాలంగా తాను చూసి అనుభవించిన సమాజం, యింకా అంతకంటె తానాశిస్తున్న భవిష్యత్తు క్రమేపీ దూరం కావడం గమనించి నిరాశ చెందుతూవచ్చాడు. వాస్తవంలోనే వుంటూ, వాస్తవానికి దూరంగా, మరేదో ఉజ్వల భవిష్యత్తును ఆశించిన అర్జున్ దేవ్ యివ్వాళ లేడు. చారిత్రక సంపద, వారసత్వాలను, భవిష్యత్ కలలను మిగిల్చిపోయాడు. 

వకుళాభరణం రామకృష్ణ

Advertisement
Advertisement
Advertisement