అకాల వర్షం.. అపార నష్టం

ABN , First Publish Date - 2021-04-16T09:35:43+05:30 IST

అకాలవర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. బుధవారం రాత్రి, గురువారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడంతో కల్లాల్లోని ధాన్యం, మిర్చి తడిసిపోయాయి.

అకాల వర్షం.. అపార నష్టం

కల్లాల్లో తడిసిపోయిన ధాన్యం, మిర్చి

గాలులకు కూలిన పామాయిల్‌, అరటి చెట్లు

మామిడి, జీడి మామిడి తోటలకూ నష్టం

దెబ్బతిన్న మొక్కజొన్న, కొర్ర, సజ్జ పంటలు

‘తూర్పు’లో పిడుగుపడి మహిళకు గాయాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

అకాలవర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. బుధవారం రాత్రి, గురువారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు  కురవడంతో కల్లాల్లోని ధాన్యం, మిర్చి తడిసిపోయాయి. అరటి, పామాయిల్‌ చెట్లు కూలిపోయాయి. మామిడి, జీడి మామిడి తోటలకూ అపార నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా బుధవారం రాత్రి ఈదురుగాలులతో వర్షాలు కురవడంతో వందల ఎకరాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఉండ్రాజవరం, పెరవలి, దెందులూరు, పెదవేగి, పెదపాడు, గణపవరం, నిడదవోలు, ఆకివీడు, ఉండి మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. చింతలపూడిలో ఈదురు గాలులకు పామాయిల్‌ చెట్లు నేలకొరిగాయి. పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో అరటి దెబ్బతింది. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో కోతలు చేపట్టి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది.



 నేడు, రేపు వర్షాలు

ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి విస్తరించింది. విదర్భ, పశ్చిమ బెంగాల్‌లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వీచే తేమగాలులతో రానున్న రెండు రోజుల్లోనూ కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం తెలిపాయి.


అనంతపురం జిల్లాలో గాలివానకు కూడేరు, హిందూపురం, వజ్రకరూరు, లేపాక్షి తదితర మండలాల్లో అరటిపంట నేలకొరిగి దాదాపు రూ.20 లక్షల నష్టం జరిగింది. గుమ్మఘట్ట, కణేకల్లు, శింగనమల, గార్లదిన్నె, డి. హీరేహాళ్‌ తదితర మండలాల్లో 100ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో 2వేల ఎకరాల్లో కొర్ర, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం బస్తాలు, మినుము ఓజలు, పసుపు కొమ్ములు తడిచిపోగా, మరికొన్ని గ్రామాల్లో వరిపైరు నేలవాలింది. కడపజిల్లా పోరుమామిళ్ల మండలంలో 150 ఎకరాల్లో అరటి పంట, 50 ఎకరాల్లో వరి, 25 ఎకరాల్లో సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం రామచంద్రపురంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఆ ఇంట్లో ఉన్న మడివి ఉంగమ్మ దుస్తులకు మంటలు అంటుకోవడంతో ఒళ్లంతా కాలిపోయింది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


Updated Date - 2021-04-16T09:35:43+05:30 IST