Abn logo
Sep 25 2021 @ 22:51PM

తాగునీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి

సమస్యలపై అధికారిని ప్రశ్నిస్తున్న జడ్పీటీసీ శ్రీరామరావు

- మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల వినతి
దహెగాం, సెప్టెంబరు 25: మండలంలో తాగునీరు, విద్యుత్‌ సమ స్యలను పరిష్కరించాలని ఎంపీపీ సులోచన, జడ్పీటీసీ శ్రీరామరావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సులోచన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొట్లగూడ, దహెగాం, లగ్గాం, రాంపూర్‌ తదితర గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని డీఈ సిద్దికిని సభ్యులు ప్రశ్నించారు. గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు. యాసంగిలో వరి పంటను సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఏవో శ్రీనివాస్‌ సూచించారు. పీఏసీఎస్‌ నుంచి పంపిణీ చేసే యూరియా నకిలీదని వ్యాపారులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నా ఏవో పట్టించుకోవడం లేదని జడ్పీటీసీ, పీఏసీఎస్‌ చైర్మన్‌ మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మొట్లగూడలో విద్యుత్‌ సరఫరా కావడం లేదని ఏఈకి మూడు నెలలుగా చెప్పినా పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ వెంకట్‌ సమావేశంలో ప్రస్తావించారు. విద్యుత్‌ తీగలు పడినట్లు సబ్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని ఏఈ వివరించారు. గిరివెల్లి పంచాయతీలోని అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వహించడం లేదని సర్పంచ్‌ రాజన్న, వైస్‌ ఎంపీపీ సురేష్‌ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణగౌడ్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.