Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేమూరులో తాగునీరు కలుషితం : 20మందికి అస్వస్థత

తొట్టంబేడు, నవంబరు2: తొట్టంబేడు మండలం చేమూరులో గురువారం పలువురు అస్వస్థతకు గురికావడం అధికారుల్లో ఆందోళన కలిగించింది. వర్షాల కారణంగా రక్షిత మంచినీటి ట్యాంకు కోసం వినియోగిస్తున్న రెండు బోర్లు మరమ్మతులకు గురికావడంతో గ్రామంలో తాత్కాలికంగా వినియోగంలో లేని మరో రెండు చేతిపంపుల నుంచి నీటిని వినియోగిస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి నలుగురు విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వారిని తిరుపతి, శ్రీకాళహస్తికి తరలించి వైద్యం అందించారు. చేమూరులో గ్రామస్తుల పరిస్థితిని తెలుసుకున్న కాసరం పీహెచ్‌సీ వైద్యాధికారి గురువారం సిబ్బందితో కలిసి చేమూరుకు చేరుకుని వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. మరో 13మందికి అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వారికి సెలైన్‌ ఎక్కించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో పెంచలయ్య చేమూరుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం క్లినికల్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. క్లినికల్‌ రిపోర్టులు శుక్రవారం వస్తాయని, అప్పుడే అసలు కారణం ఏంటో తెలుస్తుందని ఆయన చెప్పారు. తహసీల్దారు పరమేశ్వరస్వామి, ఎంపీడీవో వెంకట సౌభాగ్యలక్ష్మి పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీవో తెలిపారు.

Advertisement
Advertisement