తాగునీటికి నిధులు నిల్‌!

ABN , First Publish Date - 2021-06-15T07:24:44+05:30 IST

మౌలిక సదుపాయల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటాం.. ’అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన సర్కారు వారు ఆచరణలో మాత్రం అమలుచేయడం మరిచారు.

తాగునీటికి నిధులు నిల్‌!

రెండేళ్లుగా నిలిచిన చెల్లింపులు

నీటి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు పేరుకుపోతున్న బకాయిలు

2019లో రూ.19.04 కోట్లు, 2020లో రూ.73.13 కోట్ల బిల్లుల పెండింగ్‌

తాజాగా ఆర్థిక సంఘం నిధులతో మెలిక  8 నేడో రేపో నిలిచిపోనున్న సరఫరా


యర్రగొండపాలెం మండలంలో రోజుకు 300 ట్రిప్పుల నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.  పద్దెనిమిది నెలలుగా బిల్లుల చెల్లింపు లేదు. ఇప్పటివరకు రూ.6.48కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

పెద్దదోర్నాల మండలంలో రోజూ 121 ట్రిప్పులు  తోలుతున్నారు. గతేడాది 350 ట్రిప్పులు సరఫరా చేసేవారు. అయితే గతేడాదికి సంబంధించి రూ.90లక్షల బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది రూ.14లక్షలు పెండిం గ్‌లో ఉన్నాయి.

కనిగిరి మండలంలో 120 మంది వరకూ కాంట్రాక్టర్లు గ్రామాలకు నీటి సరఫరా చేశారు. అయితే గతేడాది వర్షాలు సమృద్ధిగా పడటంతో  జూలై నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. గత బిల్లుల బకాయిలు రూ.1.2కోట్లను ఇంతవరకూ చెల్లించలేదు.  ఏదైనా అవసరం వచ్చి నీటి సరఫరా చేయాల్సి వస్తే వారు ముందుకొచ్చే పరిస్థితి లేదు.


ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాలలో అగ్రభాగాన ఉంటుంది.. ఉండాలి కూడా... అలాంటి కీలకమైన తాగునీటి సరఫరాకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై సర్కారు శీతకన్నే వేస్తోంది. నిధుల కొరత పేరుతో బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. అంతా కలిపి రూ.100 కోట్లే అయినప్పటికీ రెండేళ్లుగా చిల్లిగవ్వ  చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. గ్రామాల్లో నివాసం ఉండే వారే సొంత ట్రాక్టర్లను తాగునీటి సరఫరా కోసం వినియోగించి ప్రభుత్వం నుంచి బిల్లులు పొందుతుంటారు. వీరికి చెల్లించేది కూడా ట్రిప్పుల లెక్కే. అంటే వీరంతా సాంకేతికంగా కాంట్రాక్టర్ల కోవలోకే వస్తున్నా నీటి సరఫరా ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారికి బిల్లుల చెల్లింపులలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. తమ ఏలుబడిలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని బీరాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలు తాగునీటి సరఫరా విషయంలో ఏడాదిన్నరగా ఆర్‌డబ్ల్యూఎస్‌కు కేటాయించిన నిధులు శూన్యం. ఇప్పటివరకు బిల్లులు వస్తాయనే ఆశతో నీళ్లు తోలుతున్న కాంట్రాక్టర్లు  సర్కారు నిర్లక్ష్యపు వైఖరితో విసిగిపోయారు. రేపోమాపో గ్రామాల్లో తాగునీటి సరఫరాను నిలిపివేసేందుకు  సిద్ధమవుతున్నారు.

ఒంగోలు (జడ్పీ), జూన్‌ 14 : ‘మౌలిక సదుపాయల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటాం.. ’అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన సర్కారు వారు ఆచరణలో మాత్రం అమలుచేయడం మరిచారు. అందుకు తాగునీటి సరఫరా బిల్లుల చెల్లింపే నిదర్శనం. గత ఏడాది వర్షాలు విస్తారంగా కురిసి భూగర్భజలాలు ఉబికి వచ్చి చాలా గ్రామాలు నీటి ఎద్దడి నుంచి ఉపశమనం పొందాయి. దీంతో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నీటిఎద్దడి ఉన్న గ్రామాలు సగానికి సగం తగ్గిపోయాయి. ప్రస్తుతం రోజుకు 2,481 ట్రిప్పులే సరిపోతున్నాయి. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు సొంతడబ్బులతో నీటి సరఫరా చేయలేమని చేతులేత్తేశారు. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో ప్రభుత్వం ఇస్తామని చెప్పిన మొత్తమే తమకు అసలు గిట్టుబాటు కాదని ఒకపక్క ఆందోళనచెందుతుండగా, మరోవైపు అసలు బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదని ఇలా అయితే ట్రాక్టర్లను అమ్ముకోవడం మినహా తమకు వేరే గత్యంతరం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇకపై తాము నీటి సరఫరా చేయలేమని అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెబుతున్నారు. అదే జరిగితే నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల ప్రజలు అవస్థలు పడే ప్రమాదం పొంచి ఉంది. 


మొత్తం రూ.92.17 కోట్ల పెండింగ్‌

జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.92.17కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 2019కి సంబంధించి రూ.19.04 కోట్లు కాగా, 2020కి సంబంధించి రూ.73.13 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్న వారిని గుర్తించి వారికి ఆ బాధ్యతను అప్పగిస్తారు. వారికి ఒక్కో ట్రిప్పునకు రూ.350 వరకూ చెల్లిస్తారు. వీరు రోజుకు దాదాపు 10 నుంచి 15 ట్రిప్పుల వరకు వేస్తారు. సహజంగా ఏళ్ల తరబడి పాతవారే ఈ నీటి సరఫరా పనులను చేస్తుంటారు. దాదాపు రెండేళ్ల నుంచి చెల్లింపులు లేకపోవడంతో తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నీటి సరఫరా కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.


గతంలో కేంద్రం నిధులిచ్చేది

గతంలో దేశవ్యాప్తంగా లోటు వర్షపాతంతో కరువు అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించి వాటికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చేది. దానికి రాష్ట్రం వాటా కూడా తోడయ్యేది. ఆ నిధులను ఈ చెల్లింపులకు వినియోగించుకునే వీలుండేది. ప్రస్తుతం భూగర్భజలాలలో వృద్ధి నమోదవడంతో దుర్భిక్షం ఎదుర్కొంటున్న జాబితా నుంచి ప్రకాశం జిల్లాను కేంద్రం మినహాయించింది. దీంతో  నిధుల రాక నిలిచిపోయింది. రాష్ట్రం వాటా కూడా రాకపోవడంతో నిధుల విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.


ఆర్థిక సంఘం నిధులతో మెలిక

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో నోట్‌  రూపంలో ప్రభుత్వం తాజాగా ఒక సూచన చేసింది. ఆర్థిక సంఘం నిధులను వారికి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో సర్దుబాటు చేయాలని అప్పటికీ ఏమన్నా బకాయిలు ఉంటే పరిశీలిస్తామని దాని సారాంశం. వాస్తవానికి పంచాయతీలకు ఆర్థిక సంఘం కేటాయించే నిధులను తాగునీటి అవసరాలతోపాటు రోడ్లు, పారిశుధ్యం ఇతరత్రా మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తారు. తాగునీటి అవసరాలలో కూడా కాలువల పూడికతీత, చేతిపంపుల మరమ్మతులు, వివిధ ప్రాజెక్టుల కింద నీటి లభ్యత వీటికి మాత్రమే ఆ నిధులను వాడటం రివాజు. ఇప్పుడు ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల కోసం వాడమనడం కొంత విడ్డూరంగా ఉంది. నిబంధనల ప్రకారం పంచాయతీ పరిధిలో నిష్పత్తి మేరకు మాత్రమే ఆర్థిక సంఘం నిధులను తాగునీటికి ఖర్చుపెట్టాల్సి ఉంటుంది కానీ బకాయిల చెల్లింపుల విషయంలో పూర్తి బాధ్యతలను తీసుకోలేమని యంత్రాంగం చెబుతోంది. టాక్టర్ల యజమానులు సీరియస్‌ నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వం స్పందించి వారికి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


Updated Date - 2021-06-15T07:24:44+05:30 IST