సంగోజివాడిలో తాగునీటి ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-03-14T06:15:38+05:30 IST

రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

సంగోజివాడిలో తాగునీటి ఇబ్బందులు
చందాపూర్‌ శివారులో లీకేజీ అయి వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీళ్లు

- మిషన్‌భగీరథ నీళ్లు రాక అవస్థలు

- పట్టించుకోని అధికారులు


తాడ్వాయి, మార్చి 13: రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం మిషన్‌ భగీరథ నీళ్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిషన్‌భగీరథ పథకం అభాసుపాలవుతోంది. జిల్లాలో తాడ్వాయి మండలంలో మిషన్‌భగీరథ నీళ్లతో ట్యాంకులు నిండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగోజివాడి గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ అవడంతో ట్యాంకులకు నీరు సరఫరా కాక వృథాగా పోతుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామంలో రెండు ట్యాంకులకు తక్కువ నీళ్లు సరఫరా కావడంతో నిండడం లేదు. ప్రత్యామ్నాయంగా గతంలో ఉన్న గ్రామ పంచాయతీ బోరుబావితోనే ట్యాంకులను అరకొరగా నింపుతున్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేసే బోరుబావులు రెండు ఉండగా అందులో ఒకటి మరమ్మతులో ఉంది. ఈ బోరు బావి నుంచి వచ్చే పైప్‌లైన్‌ను గత మూడు నెలల క్రితం ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు కోసం తవ్వగా మిగిలిపోయింది. మరో బోరు బావితో ట్యాంకులు నింపడం కష్టంగా మారిందని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పేర్కొంటున్నారు.

20 రోజులైనా పట్టించుకోని అధికారులు

తాడ్వాయి మండలం చందాపూర్‌ గ్రామ శివారులో మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ పగిలిపోయి 20 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చందాపూర్‌ నుంచి సంగోజివాడికి పైప్‌లైన్‌ ద్వారా మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతుంది. ఈ పైప్‌లైన్‌ లీకేజీ కావడంతో రెండు ట్యాంకులు నిండడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైన్‌లైన్‌కు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కూడా అధికారులు గ్రామానికి వచ్చి పరిశీలించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.


తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి

- కృష్ణమూర్తి, సంగోజీవాడి

గ్రామానికి సరఫరా చేసే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలిపోవడంతో గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లీకేజీకి మరమ్మతులు నిర్వహించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. గత మూడు నెలల క్రితం ఆర్‌అండ్‌బీ అధికారులు బోరుబావి పైప్‌లైన్‌ను పగులగొట్టారు. ఇప్పటికీ మరమ్మతు చేయడం లేదు. అధికారులు స్పందించి వెంటనే పైప్‌లైన్‌లు బాగు చేయించాలి.

Updated Date - 2022-03-14T06:15:38+05:30 IST