అప్పుడే నీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-05-05T06:37:26+05:30 IST

మండలంలో అప్పుడే వాడుకకే కాదు తాగునీటి కష్టాలూ మొదలయ్యాయి. ప్రజలు నీటి కోసం వెంపర్లాడుతున్నారు.

అప్పుడే నీటి కష్టాలు
నమశ్శివాయపురంలో మంచినీటి కోసం బిందెలతో గ్రామస్థులు

గ్రామాల్లో అడుగంటిన భూగర్భ జలాలు

అరకొరగా తాగునీరు సరఫరా

గంటల తరబడి నీటికోసం ఎదురుచూపులు

కురిచేడు, మే 4 : మండలంలో అప్పుడే వాడుకకే కాదు తాగునీటి కష్టాలూ మొదలయ్యాయి. ప్రజలు నీటి కోసం వెంపర్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులలో నీటి లభ్యత గగనమైంది. గ్రామాలలో నీటి లభ్యత లేక ప్రభుత్వం ద్వారా అందించే నీరు సరిగా అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆ నీరు ఎపుడు వస్తుందో తెలియక గంటల తరబడి వేచి చూస్తున్నారు. వచ్చిన అరకొర నీరు చాలక కొంతమంది ట్యాంకుల మీదకు ఎక్కి నీటిని తోడుకుంటున్నారు. 

మండలంలో 15 పంచాయతీలు ఉండగా 6 గ్రామాలలో నీటి కొరత ఏర్పడింది. ప్రధానంగా నమశ్శివాయపురం, పడమర గంగవరం, గంగదొనకొండ, పొట్లపాడు, బోదనంపాడు గ్రామాలలో నీటి కోసం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బోర్లు, బావులు ఎండిపోయి నీటి లభ్యత లేక పొలాల్లో బోరు బావుల నుంచి నీటిని తీసుకెళుతున్నారు. కురిచేడు నుంచి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం ద్వారా అందే నీరు వారికి చాలడం లేదు. రెండు రోజులకు ఒకసారి గ్రామాలకు రక్షిత నీరు సరఫరా అవుతోంది. ఆ నీరు వారికి చాలడం లేదు. నీరు వచ్చిన సమయంలో వందల కొద్దీ బిందెలతో నీటి కోసం గ్రామస్థులు వస్తున్నారు. నీటి ట్యాంకు వద్ద రద్దీ ఏర్పడి కుళాయిల ద్వారా నీరు అందక కొంతమంది ట్యాంకు ఎక్కి పైనుంచి నీటిని తోడుకుంటున్నారు.

పొట్లపాడు గ్రామంలో తాగునీటి లభ్యత పరిస్థితి దారుణంగా ఉంది. బావులు ఎండి పోయి చాలా కాలమైంది.  గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు నుంచి వచ్చే నీరు కుళాయిల ద్వారా అందడం లేదు. వారు ఎక్కడికక్కడ కుళాయిల పైపుల అడుగు వరకు గుంతలు తీసి నీటిని పట్టుకుంటున్నారు. అయినా చాలడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడమర గంగవరం, బోదనంపాడులో సైతం తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. వెంటనే తమకు నీటి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. ట్యాంకర్ల ద్వారా చాలినన్ని నీటిని పంపిణీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-05-05T06:37:26+05:30 IST