బకాయిల భారంలో బిందు సేద్యం

ABN , First Publish Date - 2021-06-10T05:54:52+05:30 IST

హరిత విప్లవం మొదలైన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ రంగం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశంలో...

బకాయిల భారంలో బిందు సేద్యం

హరిత విప్లవం మొదలైన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ రంగం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశంలో బిందు సేద్యం అడుగు పెట్టింది. అడుగంటుతున్న భూగర్భజలాలు, పరిమితమవుతున్న నీటి వనరులకు ప్రత్యామ్నాయంగా పరిణమించిన బిందు సేద్యం మనదేశ మెట్ట ప్రాంత రైతులకు ఆశాకిరణంగా మారింది. 2002లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బిందు సేద్యం ప్రాజెక్ట్‌పై రైతులకి పూర్తి అవగాహన కల్పించారు. 50 శాతం ప్రభుత్వ రాయితీ, 50 శాతం సులభ వాయిదాల పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణ సదుపాయాలు కల్పిస్తూ, కావాలనుకున్న రైతులందరికీ బిందు సేద్యం పరికరాలు కూడా అందించారు. 2004లో ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి మరింత ముందడుగు వేసి, కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తోడవడంతో ప్రభుత్వ రాయితీని 90 శాతానికి పెంచడం ద్వారా బిందు సేద్యాన్ని మరింత పరుగులు పెట్టించారు. కానీ ఇది కొన్ని సంవత్సరాలకే పరిమితం అయింది. తర్వాత కాలంలో రైతులకు సరైన అవగాహన కల్పించడం లోనూ ఆర్థిక వనరులు సమకూర్చడం లోనూ విఫలమవుతూ వచ్చిన ప్రభుత్వాలు బిందు సేద్యానికి తీరని అన్యాయం చేశాయి. ఏదోలా కాడి ఈడ్చుకు వస్తున్న సూక్ష్మ నీటి బిందుసేద్య పథకానికి 2019లో వచ్చిన వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా పాడి కట్టినంత పని చేసింది.


యాభై ఏళ్లకు పైగా విష రసాయనాలతో నిండిపోయిన వ్యవసాయంతో ఎదురవుతున్న బహుముఖ దుష్ఫలితాలు, భయంకర ఆరోగ్య సమస్యల నుంచి ప్రపంచం గుణ పాఠాలు నేర్చుకొంటోంది. ఇప్పుడిప్పుడే వ్యవసాయం సేంద్రియం వైపు మారుతున్న తరుణంలో సూక్ష్మ నీటి వినియోగం లాంటి విషయాలు అత్యంత కీలక పాత్ర వహిస్తున్నాయి. దానికి అనుగుణంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక బిందు సేద్యంలో దేశంలోనే మొదటిస్థానంలో దూసుకు పోతోంది. మరో పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా దానికి పోటీగా రైతులను ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నమ్మి రైతులకి సూక్ష్మసేద్యం పరికరాలు అందించి, అమర్చిన కంపెనీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిపడింది. సంవత్సరంన్నర దాటినా ఈ కంపెనీలకు నేటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈ పరిణామంతో ఈ కంపెనీలు దివాలా దశకు చేరుకున్నాయి. వీటిలో పనిచేసే సుమారు ఇరవై వేల మంది కార్మికుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేయడంతో పాటు, కొత్తగా బిందు సేద్య పరికరాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆశలపై ప్రభుత్వం నీళ్లు పోసింది. 


సూక్ష్మసేద్యం కంపెనీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకర్లకు కంపెనీలు రుణ వాయిదాలు చెల్లించడం లేదు. బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో ఈ కంపెనీల రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎ)గా మారుతున్నాయి. కరోనా మహమ్మారి ఒకటి, రెండవ దశలు ఈ కంపెనీలను మరింత అంధకారంలోకి నెట్టి వేశాయి. ఈ బకాయిలు కంపెనీల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. కంపెనీల నిర్వహణకై అనివార్య ఖర్చులు, రుణాల చెల్లింపులు నెరవేర్చవలసిన షరతుల నిర్వహణ తలకిందులైంది. బకాయిలు చెల్లించకపోవడం వలన ఉత్పత్తి లేక రైతులకు అందించవలసిన పరికరాల సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. అంకెల పరంగా చూస్తే రాష్ట్రం ఏడున్నర లక్షల ఎకరాలకు పైగా బిందుసేద్యంతో దేశంలో రెండో స్థానంలో ఉన్నది. అయితే రాష్ట్రంలో వినియోగిస్తున్న బోర్ల సంఖ్యాపరంగా, మెట్ట ప్రాంత వ్యవసాయ భూమి విస్తీర్ణం పరంగా చూసినప్పుడు బిందు సేద్యంలో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్న విషయాన్ని గుర్తించాలి. రైతులకు మరెన్నో వినూత్నమైన ఆధునిక సాంకేతికపరమైన కొత్త ప్రాజెక్టులు అందించాల్సిన ప్రస్తుత సమయంలో సాపేక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న బిందుసేద్యం పథకం నేడు కనుమరుగయ్యే దశకు చేరుకుంది.


చిన్న, సన్నకారు రైతులే కాకుండా భూస్వాములు సైతం స్వంత ఖర్చులతో బిందు సేద్య పరికరాలు సమకూర్చుకొనే ఆర్థిక పరిస్థితులు లేవు. ఇది ముఖ్యమంత్రికి తెలియదా? బిందు సేద్య వ్యవసాయం కోసం గడచిన రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన ఖర్చు ఏమైనా ఉందా? కూల్చివేతలతో మొదలైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులను పాతర వేయడంలో ఆశ్చర్యం లేనప్పటికీ, దేశంలో ఎక్కడా లేనివిధంగా మాదే రైతులకి అత్యంత మేలు చేసే ప్రభుత్వమని బాకాలు ఊదుకునేందుకు ఏమాత్రం సిగ్గు లేకుండా ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గడచిన రెండేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి 83 వేల కోట్లు ఖర్చు పెట్టామని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రాష్ట్ర రైతులకు మేలు చేసే బిందుసేద్య పరికరాలను అందించే కంపెనీలకు కట్టవలసిన రూ. 1200 కోట్ల బకాయిలు ఎందుకు గుర్తు రాలేదు? ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో చూపించే నేర్పరితనంలో కాస్తయినా రైతులకు మేలు చేసే ఇలాంటి పథకాలపై చూపించక పోవడం దురదృష్టకరం. రాజస్థాన్ తర్వాత దేశంలో అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం రాయలసీమ. 423 మిమీ సాధారణ వర్షపాతంతో రాయలసీమ అత్యంత నీటి ఎద్దడిని, ఎదుర్కొంటుంది. అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా బిందుసేద్య పథకాలను రైతుల దరి చేరకుండా నీరు గారుస్తున్నారు జగన్మోహన్‌ రెడ్డి. 85 శాతం బిందుసేద్యంతో ఇజ్రాయెల్‌ వ్యవసాయంలో ఉచ్ఛ స్థాయిని చేరుకోగా, 2.1 శాతం బిందు సేద్యంతో ఉన్న మన దేశానికి, రాష్ట్రానికి ఆ స్థాయిని చేరుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పట్టనుంది? ఆంధ్ర రాష్ట్ర రైతుల బిందు సేద్యం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బకాయిల భాండాగారంలో బందీ అయింది.

లక్ష్మీప్రసాద్‌ పాకలపాటి

Updated Date - 2021-06-10T05:54:52+05:30 IST