ప్రవాసుల విషయంలో Kuwait తీసుకునే ఆ రెండు నిర్ణయాలు.. దేశ ఎకనామీని తీవ్రంగా దెబ్బతీసేవే!

ABN , First Publish Date - 2021-12-21T14:14:48+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా వలసదారులను పలు కీలక నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రవాసుల విషయంలో Kuwait తీసుకునే ఆ రెండు నిర్ణయాలు.. దేశ ఎకనామీని తీవ్రంగా దెబ్బతీసేవే!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా వలసదారులను పలు కీలక నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ప్రధానమైనవి 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని ఆపివేయడం ఒకటి, రెండోది వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ నిలిపివేత. కానీ, ఈ రెండు నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కువైత్ సర్కార్ వెనక్కి తగ్గింది. వెంటనే తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. అయితే, ఇప్పటికీ ఈ రెండు విషయాల్లో స్పష్టమైన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించ లేదు. నాన్చుడు ధోరణిని అవలంభిస్తోంది. కువైటైజేషన్‌తో పాటు ఇతర కారణాలతో ప్రవాసులకు కువైత్ ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ చుక్కలు చూపిస్తోంది.


ఇదిలా ఉంటే.. ఈ రెండు నిర్ణయాలపై ఆ దేశ హ్యూమన్ రైట్స్ హెడ్ దివాన్ అంబాసిడర్ జాసెమ్ అల్ ముబారకీ తాజాగా స్పందించారు. ఇవి రెండు దేశ ఎకనామీకి తీవ్ర ముప్పు కలిగించే నిర్ణయాలుగా ఆయన పేర్కొన్నారు. ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్‌లను నిలిపివేయడం అనేది పూర్తి వివక్షతో కూడిన నిర్ణయంగా అభివర్ణించారు. 'వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ల ఉపసంహరణ తప్పుగా పరిగణించబడుతుంది. ఇది అంతర్జాతీయ చట్టాలు లేదా మానవ హక్కులకు అనుగుణంగా లేని వివక్షతతో కూడిన నిర్ణయం. ఇలాంటి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.' అని అన్నారు. 


అలాగే 60 ఏళ్లు దాటిన వలసదారుల విషయమై కువైత్ అవలంభించిన తీరును సైతం ఆయన తప్పుబట్టారు. మానవ సామర్థ్యానికి మించిన రుసుములను విధించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని అనాలోచితమైన, అమానవీయమైన తీర్మానంగా పేర్కొన్నారు. తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడిన జాసెమ్ అల్ ముబారకీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఈ రెండు విషయాల్లో కువైత్ క్లారిటీ ఇవ్వకుండా దాట వేయడం అంత మంచిది కాదని, బ్యూరో ఎట్టిపరిస్థితిలో ఇలాంటి నిర్ణయాలను అంగీకరించబోదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.   

Updated Date - 2021-12-21T14:14:48+05:30 IST