చినుకు.. వణుకు!

ABN , First Publish Date - 2022-06-23T05:39:29+05:30 IST

జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడడంతో ఓ వైపు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నపటికీ మరోవైపు సీజనల్‌ వ్యాధులు కలవరపెడుతున్నాయి.

చినుకు.. వణుకు!
జిల్లాలో మారుమూల తండాల్లో అపరిశుభ్రంగా ఉన్న దృశ్యం

- జిల్లాపై పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల బెడద

- ప్రజలు విష జ్వరాల బారినపడే అవకాశం

- మురికివాడల్లో లోపిస్తున్న పారిశుధ్యం

- మారుమూల గ్రామాలు, తండాల్లోనే అధిక కేసులు

- ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో వైద్యం అంతంత మాత్రమే

- మందులున్నా అందని వైద్యసేవలు

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత


కామారెడ్డి, జూన్‌ 22(ఆంద్రజ్యోతి): జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడడంతో ఓ వైపు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నపటికీ మరోవైపు సీజనల్‌ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ప్రతీ ఏడాది చినుకు పడిందంటే మారుమూల గ్రామాలు, తండాలవాసులు విష జ్వరాలతో వణికి పోతున్నారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాల ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారినపడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు వెనకబడిన ప్రాంతాలతో పాటు మురికి వాడలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఆరోగ్యంపై, పారిశుధ్యంపై స్థానిక ప్రజలకు అవగాహన లేకపోవడం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. జిల్లా పరిధిలో ప్రతీ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఆసుపత్రులలో సరిపడా మందులు ఉన్నప్పటికీ రోగం వస్తే మందు గోళి ఇచ్చేందుకు సరిపడా వైద్యులు సిబ్బంది లేకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావలసిన అవసరం ఎంతైనా ఉంది.

మందులు ఫుల్‌.. సేవలు నిల్‌

జిల్లా పరిధిలోని జిల్లా, ఏరియా ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలలో సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందు గోళీలు, వ్యాక్సిన్‌లు, అన్ని రకాలు మందులు  అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు వాటిని అందించేందుకు వైద్యులు కాని, సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ, తండాల్లో అధిక మొత్తంలో ప్రతీసారి డెంగ్యూ, మలేరియా, విషజ్వరాల బారినపడినవారే అధికంగా ఉంటున్నారు. వీరంతా ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో రోగాలను నయం చేసేందుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఆ మందు గోళీలను ఏ పద్ధతితో వాడాలో తెలిపేందుకు వైద్యులు, సిబ్బంది లేక ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. విష జ్వరాల బారినపడే మరికొందరు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందేందుకు స్థోమత లేక అరకొర సేవలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చిక్సిత పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు సరైన వైద్యం అందక ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఆసుపత్రులపై దృష్టి సారించి పూర్తిస్థాయి వైద్యులను, సిబ్బందిని నియమించి రోగులకు అన్ని రకాల మందులను సమయానికి అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

కామారెడ్డిలో పలు కాలనీల్లో మురుగునీటితో ప్రజల అవస్థలు

కామారెడ్డి పట్టణంలో 17 వరకు మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడల్లో పారిశుధ్యం లోపించడం వల్ల, ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మురికివాడల్లో దోమలు, ఈగలు, పందులు స్వైరవిహారం చేస్తుండటంతో వాటి బారినపడుతూ విషజ్వరాల పాలవుతున్నారు. తీరా వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే సరైన వైద్యులు లేకపోవడంతో చికిత్స అందటం లేదని ప్రజలు వాపోతున్నారు. బతుకమ్మకుంట, అయ్యప్పనగర్‌, హరిజనవాడ, రాజీవ్‌నగర్‌, ఇంద్రనగర్‌, వాంబేకాలనీ తదితర కాలనీల్లో మురుగునీరు పేరుకపోవడం, రోడ్లపై మురుగునీరు పారడంతో పాటు దోమలు, ఈగల సంతతి పెరిగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నా మున్సిపల్‌ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు పీహెచ్‌సీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల్లోని గ్రామాలు, తండాల్లో అధిక మొత్తంలో విష జ్వరాలు  ప్రబలుతున్నాయి. ప్రధానంగా పారిశుధ్యం లోపించడంతోనే దోమకాటు లాంటి వ్యాధులకు గురవుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలు సీజనల్‌ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు వైద్యసేవలను అందించాలి. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి ఆయా శాఖలకు చెందిన సిబ్బంది మండలాలు, గ్రామాలు, తండాలను పర్యటించాలి. ప్రధానంగా వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, నీటి పారుదల శాఖ అధికారులు సీజనల్‌ వ్యాధుల భారిన ప్రజలు పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-06-23T05:39:29+05:30 IST