కరువు భత్యం ఉద్యోగుల హక్కు

ABN , First Publish Date - 2020-12-01T05:39:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పింఛనర్ల డిఏను...

కరువు భత్యం ఉద్యోగుల హక్కు

ఇప్పటికే పాత డిఏను 2022 దాకా సాగదీసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు 2020 జనవరిలో పెరిగిన డిఏతో సహా పెరగబోయే డిఏలనూ స్తంభింపచేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. నేడు దీనిని ప్రతిఘటించకపోతే మరలా ఇస్తారా? రేపు వేతన సవరణలకూ ఎగనామం పెట్టరని గ్యారంటీ ఏమిటి? 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పింఛనర్ల డిఏను స్తంభింపచేస్తూ నవంబర్ 6న ఒక జిఓ (నెం. 95) విడుదల చేసింది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు పెరిగిన డిఏను ఇవ్వకుండా నిలిపివేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. పెరిగిన డిఏ బకాయిలు కూడా చెల్లించమని స్పష్టం చేశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ 18 నెలల కాలానికి పెరిగిన డిఏ బకాయిలను ఇక శాశ్వతంగా కోల్పోవలసిందే. 2021 జూలై నుంచి మాత్రమే పెరిగిన డిఏను ఇస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, కోర్టులు, యూనివర్సిటీలతో సహా అన్ని విద్యా సంస్థలు, జిల్లా పరిషత్‌ లలో పనిచేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికి ఈ జి.ఓ. వర్తిస్తుంది. కరోనా మహమ్మారి వల్ల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతమై, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం వల్లే ఈ నిర్ణయం అనివార్యమయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వాదన సహేతుకంగా కన్పిస్తున్నా నిశితంగా పరిశీలిస్తే, అందులో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. అంతేకాక, డిఏ చెల్లింపును నిలిపివేయడం వల్ల ప్రభుత్వం పేర్కొన్న సమస్యలు పరిష్కరింపబడకపోగా మరింత సంక్లిష్టమవుతాయని అవగతమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను ఊటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిఓను జారీ చేసింది. సైనికులతో సహా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల మంది పింఛన్‌ దారులకు డిఏను స్తభింపచేస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ2020 ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా లక్షా 20వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మిగులుతుందని ప్రభుత్వ అంచనా. స్వతంత్ర భారత దేశంలో అత్యవసర పరిస్థితి కాలం (1974–77)లో ఇందిరా గాంధీ ప్రభుత్వం కొన్ని నెలల పాటు వేతన స్తంభనను విధించడం తప్ప గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


డిఏ అన్నది ప్రభుత్వం ఎప్పుడూ ఆర్భాటంగా ప్రకటించే కానుక ఏమాత్రం కాదు. దానికి భిన్నంగా పెరిగిన ధరలకు అనుగుణంగా నిజ వేతనాలు పడిపోకుండా ఇచ్చే పరిహారం మాత్రమే. ఉదాహరణకు ఈ రోజు కిలో బియ్యం 40 రూపాయలు ఉందనుకుందాం. ఒక సంవత్సరం తరువాత అదే బియ్యం ధర 44 రూపాయలు అయిందనుకోండి. అప్పుడు ధర పది శాతం పెరిగినట్టు కదా. అంటే, కిలో బియ్యం కొనుక్కోవడానికి ఇప్పటి కంటే సంవత్సరం తరువాత 10 శాతం ఎక్కువ ఖర్చుపెట్టాలన్నమాట. దీనర్థం జీతం పెరగకపోతే, కార్మికుడి నిజవేతనం 10 శాతం తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న జీతం కాస్తా, 90 రూపాయలకి నిజ వేతనం పడిపోతుందని అర్ధం. దీనిని భర్తీ చేయకపోతే, కార్మికుని వేతనాలు తగ్గిపోవడమే అవుతుంది. అలా తగ్గకుండా, నిజ వేతన విలువను యథాతథంగా ఉంచడానికి ఏర్పాటు చేసిందే డిఏ. ఈ డిఏ పెరిగినప్పుడల్లా ఉద్యోగులకు జీతం పెంచేస్తున్నట్లు, అదనంగా కోట్ల రూపాయల భారం పడిపోతున్నట్లు, ఉద్యోగులకు పండగ కానుక ఇచ్చేస్తునట్లు ప్రభుత్వం గొప్ప ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. కొంత మంది ఉద్యోగులు కూడా జీతం పెరిగిపోయినట్లు భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా నిజ వేతనంలో మార్పేమీ ఉండదు.ఈ నిజ వేతనాన్ని కాపాడుకోవడానికి భారత కార్మికవర్గం బ్రిటిష్‌ పాలకుల కాలంలో పెద్ద పోరాటమే చేసింది. 1939–-45 సంవత్సరాల మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం, దేశంలో నెలకొన్న కరువు వల్ల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటి వరకు కార్మికుల వేతనం అంటే కేవలం మూల వేతనం మాత్రమే. ఇప్పటి బేసిక్‌ పే లాగా. కార్మికులు పోరాడితే, ఏ నాలుగైదేళ్ళకో ఒకసారి మూలవేతనం మాత్రమే పెరిగేది. ధరల పెరుగుదలను భర్తీ చేసేదిగా ఎటువంటి ఏర్పాటు ఉండేది కాదు. దీనివల్ల 1939 లో 100 రూపాయలు ఉన్న కార్మికుని నిజ వేతనం ధరల పెరుగుదల వల్ల 74.9 రూపాయలకు పడిపోయింది! ఇలాంటి సమయంలో నిజవేతనంలో ఏర్పడ్డ లోటును భర్తీ చేయాలని ముంబాయిలోని లక్షా 75 వేల మంది జౌళి పరిశ్రమ కార్మికులు 1940 మార్చి 5 న సమ్మె చేశారు. ఆ సమ్మె తరువాత వేతన పెంపుదల డిమాండు సర్వవ్యాపితమయింది. దేశంలో అనేక పోరాటాలు జరిగాయి. ఫలితంగా మొట్టమొదటిసారి కరువు భత్యంను (డిఏ) కార్మికవర్గం సాధించుకుంది. వాస్తవంగా దేశంలో కరువుపోయి, ధరలు పెరగకపోతే, కరువుభత్యం పెంచవలసిన అవసరమే లేదు. కానీ విచిత్రంగా మన దేశంలో నిత్యం ధరల పెరుగుదల, కరువు సాధారణమైపోయాయి. ధరల పెరుగుదలను అరికట్టలేని ప్రభుత్వం నిజవేతనాన్ని భర్తీ చేసే కరువు భత్యాన్ని మాత్రం ఎగ్గొట్టడం ప్రభుత్వ చేతకానితనం తప్ప మరొకటి కాదు. ఆఖరుకు బ్రిటిష్‌ కాలంలో కార్మికులు పొరాడి సాధించుకున్న కరువు భత్యానికి కూడా ఎసరుపెట్టడం నిస్సందేహంగా దివాళాకోరుతనమే.


ప్రభుత్వం ఇలా డిఏ ఎగ్గొట్టడమే కాకుండా, దీనికి మించి, ధరల పెరుగుదలను కొలిచే వినిమయ ధరల సూచీని (కన్స్యూమర్‌ ప్రైస్ ఇండెక్స్‌) లెక్కించే పధ్ధతిని, కొలిచే సూత్రాన్ని మార్చడం ద్వారా కూడా మోసం చేస్తోంది. ఇక్కడ గమనంలో తీసుకోవలసిన మరో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి- ధరలు పెరిగినప్పుడల్లా ఇలా డిఏ పెరగడం కేవలం ఏడు శాతం లోపు కార్మికులకే అమలవుతోంది. దేశంలో సింహభాగంగా ఉన్న మిగిలిన 93 శాతం మంది కార్మికులకు నిజవేతనంలో డిఏ రూపంలో ఎటువంటి భర్తీ లేదు. వారికి కూడా డి ఏ ఇవ్వాలని కార్మికవర్గం ఒక పక్క పోరాడుతుంటే, ప్రభుత్వం ఉన్న డిఏ కే ఎగనామం పెట్టడం భరించరాని చర్యే. రెండోది- పోనీ డిఏ ఆపడం వల్ల ఆర్ధిక వ్యవస్థ ఏమైనా మెరుగుపడుతుందా అంటే అది అసంభవం. ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే, మార్కెట్లో సరుకులు అమ్ముడు పోవాలి. ఆ సరుకులు కొనుక్కునే ప్రజల ఆదాయాలు పెరగాలి. కాని ప్రభుత్వ చర్య వల్ల ఉద్యోగుల నిజ ఆదాయాలు తగ్గి పోతాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 2020 జనవరి నుండి పెరగవలసిన నాలుగు శాతం డిఏను చెల్లించడం నిలిపివేసింది. 2020 జూలై, 2021 జనవరిలో పెరగబోయే డిఏ లను కూడా చెల్లించదు. కొంతమంది అంచనా ప్రకారం ధరల పెరుగుదల ఇలాగే ఉంటే ఈ కాలంలో కనీసం 18 నుంచి 20 శాతం వరకు డిఏను ఉద్యోగులు, పెన్షనర్లు కోల్పోయే అవకాశం ఉంది. ఆ మేరకు వీరి కొనుగోలు శక్తి తగ్గి, తప్పకుండా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే పడుతుంది. అందువల్ల ఏరకంగా చూసినా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకోవడానికి చేసే వాదనలలో పసలేదు. నిజంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్దేశమే కనుక ఉంటే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి. కార్మికులు అందరికీ ఈ కష్టకాలంలో డిఏను వర్తింప చేసి కొనుగోలు శక్తి పెంచాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఇప్పటికే పలువురు ఆర్ధిక వేత్తలు సూచించినట్లుగా సంపన్నులపై వారసత్వ పన్ను, సంపద పన్ను విధించడం వంటి ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం చేపట్టాలి.


వీటిని వదిలేసి, సంపన్నులకే మళ్ళీ మళ్ళీ రాయితీలు ఇస్తూ ఉద్యోగులపై పడడం ఏ మాత్రం సమంజసం కాదు. దేశానికి అంతకంటే శ్రేయస్కరం కాదు. మోదీ ప్రభుత్వం కార్మికులు పొరాడి సాధించుకున్న అనేక హక్కులపై మోదీ సర్కార్ దాడి చేస్తోంది. అందులో భాగమే కార్మిక చట్టాల సవరణ, డిఏ స్తంభన మొదలైనవి. ఆఖరుకు దేశ సరిహద్దులను కాపాడే సైనిక సిబ్బంది హక్కులను సైతం ఈ దాడి నుంచి మినహాయించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విద్యుత్‌ సంస్కరణల పేరుతో మీటర్లు బిగించడం, నూతన విద్యా విధానం పేరుతో ప్రవేటీకరణకు బాటలు వేయడం, ఇప్పుడు డి ఏ స్తంభన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్కరణ విధానాలు భక్తి వల్లో, భయం వల్లో మన రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ముందుగా అమలు చేయడం నిజంగా దురదృష్టకరమే. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలను తిరస్కరిస్తున్నాయన్నది కూడా నిర్వివాదాంశం. తమది సంక్షేమ రాజ్యమని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వానికి ఇది తగదు. ఇప్పటికే పాత డిఏను 2022 దాకా సాగదీసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు 2020 జనవరిలో పెరిగిన డిఏ తో సహా పెరగబోయే డిఏ లను కూడా ఒక్క కలం పోటుతో కాల రాచివేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. దీనిని ప్రతిఘటించకపోతే మరలా ఇస్తారని గ్యారంటీ ఏమీ లేదు. రేపు వేతన సవరణలకు కూడా ఎగనామం పెట్టరని గ్యారంటీ అంతకంటే లేదు. అందువల్ల ఉద్యోగులు, సంఘాలు వివేకంతో పోరాడి ఈ దాడిని నిలువరించడమే ఏకైక మార్గం.

ఎ. అజ శర్మ

సిఐటియు రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు

Updated Date - 2020-12-01T05:39:02+05:30 IST