కరువు మేఘాలు!

ABN , First Publish Date - 2021-08-13T05:07:47+05:30 IST

జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌కు నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టుల్లో నిల్వలు లేకపోవడంతో.. సాగునీటి సరఫరాపై అధికారులు చేతులేత్తేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కరువు మేఘాలు!
నరసన్నపేట మండలం జమ్ములో ఎండిన వరినాట్లకు నీటి తడి పెడుతున్న రైతు

 - వెంటాడుతున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు

 - ఆందోళన చెందుతున్న అన్నదాతలు 

(ఆంధ్రజ్యోతి- శ్రీకాకుళం)

జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌కు నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టుల్లో నిల్వలు లేకపోవడంతో.. సాగునీటి సరఫరాపై అధికారులు చేతులేత్తేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లోటు వర్షపాతం వెంటాడుతున్న నేపథ్యంలో సిక్కోలును కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఇటీవల రాష్ట్రమంత్రి వర్గం భేటీలో జిల్లా మంత్రులు ప్రతిపాదన చేశారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమవుతోంది. జిల్లాకు మూడు నెలలుగా లోటు వర్షపాతం వెంటాడుతోంది. సాధారణం కంటే.. 24.5 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌లో 134.9 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 82.0మి.మీ కురిసింది. జూలైలో 189.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 191.9 మి.మీ  కురిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ(12వ తేదీ) 70.0 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 23.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒడిశా ప్రాంతంలోని వంశధార నది క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కూడా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో వంశధార ప్రాజెక్టు పరిధిలో 3,100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరేది. ఈ ఏడాది క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు లేని కారణంగా కేవలం 1000 క్యూసెక్కులు మాత్రమే  చేరిందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.50 లక్షల ఎకరాలకు వంశధార కాలువల ద్వారా సాగునీరు అందజేయాల్సి ఉంది. హిరమండలం గొట్టాబ్యారేజీలో నీటి నిల్వలు లేక రైతులకు సాగునీరు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. వంశధార కాలువల పరిధిలోని ఆయకట్టుకు తగినంత సాగునీరు అందక వరినాట్లు ఎండిపోతున్నాయి. ప్రధానంగా నరసన్నపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల పరిధిలో శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది మంత్రుల ప్రతిపాదన మేరకు జిల్లాను కరువు మండలంగా ప్రకటించి.. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


 ఆరుతడి పంటలకు ప్రణాళిక...

జిల్లాలో సెప్టెంబరు 15వ తేదీ వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే రైతులు ఆరుతడి పంటలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. నారుమడులు, ఎదలు ఎండిపోతే రైతుకు నష్టమే. ప్రత్యేకంగా కరువు మండలాల గుర్తింపు కోసం సర్వే జరగడం లేదు. ప్రతి రైతు ఈ-క్రాప్‌లో పంటలు నమోదు చేసుకోవాలి. అపరాల సాగుకు అవసరమైన విత్తనాలు అందిస్తాం.

- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళం


 15 తర్వాత వివరాలు 

జిల్లాలో కరువు పరిస్థితులపై ఈనెల 15వ తేదీ తరువాత కలెక్టర్‌ వివరాలు వెల్లడిస్తారు. కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షాలు కురిసినంత మాత్రాన జిల్లా అంతటా కరువు ఉందనడం సరికాదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. 

- సుమిత్‌ కుమార్‌, జేసీ, శ్రీకాకుళం

Updated Date - 2021-08-13T05:07:47+05:30 IST