Abn logo
Sep 21 2021 @ 23:24PM

ప్రాథమిక ఆస్పత్రులకు సొంత భవనాలు కరువు

- సమస్యల వలయంలో పీహెచ్‌సీలు

- మందులు భద్రపరచడానికీ ఇబ్బందే

- అద్దె భవనాల్లో తప్పని తిప్పలు

- నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

బెజ్జూరు, సెప్టెంబరు 21: ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అనేవి తప్పని సరిగా అందించాలని ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 2000 జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రాన్ని(పీహెచ్‌సీ) మంజూరు చేశారు. అయితే ఆరోగ్య ఉపకేంద్రాలకు సరైన భవనాలు లేకపోవడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉపకేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తుండటంతో భవనం ఇరుకుగా మారడం, వివిధ రకాల పరీక్షలు చేయించుకునేందుకు, టీకాలు వేయించుకునేందుకు వచ్చే గర్భిణులు, బాలింతలకు సరైన వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

గ్రామీణులకు ఎంతో అవసరం..

గ్రామీణ ప్రజలకు ఆరోగ్య ఉపకేంద్రాలు ఎంతగానో ఉపయోగపడు తున్నాయి. వీటిలో గర్భిణులు, బాలింతలకు అవసరమైన టీకాలు వేయడం, చిన్నారులకు వివిధ రకాల వ్యాధి నిరోదక టీకాలు వేయడం, వైద్యశిబిరాలు, పల్స్‌పోలియో, ఇతర వైద్యపరమైన కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఇలాంటి సేవలు అందించే ఉపకేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉపకేంద్రాలు 108, సొంత భవనాలు 60..

జిల్లాలోని 15మండలాల్లో 108 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ఇందులో కేవలం 60ఉపకేంద్రాలకు మాత్రమే సొంతభవనాలు ఉన్నాయి. మిగిలిన 48భవనాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గర్బిణులు ప్రతినెలా పరీక్షలు చేయించుకునేందుకు, చిన్నారులకు వ్యాధి నిరోదక టీకాలు వేయించేందుకు చాలా మంది వస్తుంటారు. రోగులకు అందించేందుకు మందులు, టీకాలు భద్రపర్చడానికి తగిన గదులు లేక ఏఎన్‌ఎంలు వాటిని ఉదయం కేంద్రాలకు తీసుకవచ్చి సాయంత్రం ఇళ్లకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు, ఓ సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు సరిపోయే స్థలం లేకపోవడంతో అవగాహన కార్యక్రమాలు అటకెక్కాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించి అవసరమైన ఫర్నీచర్‌, తాగునీరు, విద్యుత్తు, వైద్య సిబ్బందిని కేటాయిస్తే పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ఆ దిశగా గ్రామాల్లో సరైన సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపించాం..

- డాక్టర్‌ మనోహర్‌, జిల్లా వైద్యాధికారి, ఆసిఫాబాద్‌

ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దెభవనాల్లో నిర్వహించడం వల్ల వైద్య సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. పక్కా భవనాల నిర్మాణానికి సంబంధించిన వివరాలను గతంలోనే ప్రభుత్వానికి అందించాం. కొన్నిప్రాంతాల్లో భవన నిర్మాణాలు జరుగుతున్నా అసంపూర్తిగా ఉన్నాయి. ఆరోగ్య ఉపకేంద్రాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతాం.