రాజ్యాంగ భాష అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2022-07-30T07:48:36+05:30 IST

అట్టడుగు సమాజానికి చెందిన మహిళ రాష్ట్రపతి అయినప్పుడు ఆమెను ‘రాష్ట్రపత్ని’ అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత..

రాజ్యాంగ భాష అభివృద్ధి చెందాలి

అట్టడుగు సమాజానికి చెందిన మహిళ రాష్ట్రపతి అయినప్పుడు ఆమెను ‘రాష్ట్రపత్ని’ అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఆధిపత్య కుల మగ దురహంకార వైఖరిని యావత్ భారత జాతి ఖండించాలి. అధీర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలి. అంతేకాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిలో ఉన్న శ్రీమతి ద్రౌపదీ ముర్మును అవమానించినందుకుగాను, మహిళల గౌరవాన్ని కించపరిచినందుకు గాను, ఆదివాసులను దూషించినందుకుగాను, రాజ్యాంగ సంరక్షక పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచినందుకు గాను, అధీర్ రంజన్ చౌదరిపై సంబంధిత చట్టాల కింద విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి.


ఇదివరకు కూడా రాష్ట్రపతి, సభాపతి, కులపతి, ఉప కులపతి పదవులు మహిళలు నిర్వహించినప్పుడు, వారికి జెండర్ పరంగా ఇంత దారుణ అవమానం లేదు.


ప్రపంచ వ్యాప్తంగా అణగారిన సమాజాలు, సమూహాలు, జెండర్లు తమపట్ల హేళనగా తిట్టుగా వ్యవహరింపబడుతున్న భాషకు వ్యతిరేకంగా పోరాడి, తమకు గౌరవ సూచకంగా ఉండే భాషను సృష్టించుకున్నారు. అట్లా నల్లజాతి వారు నీగ్రో పదాన్ని, దివ్యాంగులు వికలాంగులు పదాన్ని, ట్రాన్స్‌జెండర్లు కొజ్జా పదాన్ని, ఎస్సీలు హరిజన పదాన్ని, ఆదివాసులు గిరిజన పదాన్ని, చైర్మన్ పదాన్ని మహిళలు చైర్‌పర్సన్‌గా పోరాడి మార్చుకున్నారు. బాధిత సమూహాలు ఆధునిక సమాజంలో, అనేక కొత్త పదాలను తమను గౌరవప్రదంగా సాంకేతించడానికి ఆధునిక చరిత్ర నిండా ఎన్నో ఉద్యమాలు చేసి, భాషా మార్పును సాధించుకున్నాయి. ఇలా బాధిత సమాజాలు, సమూహాల ఆందోళనల ఫలితంగా బాధితులను గౌరవప్రదంగా పిలవడానికి హందాయైన ఎన్నో కొత్త పదాలు – రాజ్యాంగ భాషలో/మార్పు చెందుతున్న సమాజంలో వచ్చి చేరాయి.


మన రాజ్యాంగ భాషలో రాష్ట్రపతి, సభాపతి, కులపతి, ఉపకులపతి, దళపతి, అధిపతి వంటి పదాలు ఉన్నాయి. ఇవి జెండర్ పరంగా మగ ఆధిక్యతను సంకేతించే పదాలుగా ఆధునిక మహిళా స్పృహ కోణంలో చూడబడుతున్నాయి. అలాగే, పతి అనే పదానికి భర్త, అధికారి, యజమాని అనే అర్థాలు ఉన్నాయి. కానీ, పత్నికి భార్య అనే అర్థమే తప్ప వేరే అర్థాలు లేవు. ఆమె వీరపత్ని, అయినా, ధర్మపత్ని అయినా, పత్ని అయినా, మగవానితో కలిపి భార్య అనే అర్థాన్ని మాత్రమే పత్ని అనే పదం సూచిస్తున్నది.


అయితే, ఇప్పటివరకూ రాష్ట్రపతి, సభాపతి, కులపతి, ఉపకులపతి పదవులను మహిళలు అధిష్టించినప్పటికీ, పతి అనే పదంతోనే చలామణి అయినారు. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల దాకా, రకరకాల కమిటీలకు చైర్మన్ పదముతోనే అనేక మంది మహిళలు పదవుల్లో కొనసాగినారు. అయితే, మహిళా ఉద్యమాల ఒత్తిడి వలన, చైర్మన్ పదము మహిళల పరంగా చైర్‌పర్సన్‌గా, జెండర్ న్యూట్రాలిటీతో వాడకంలోకి వచ్చింది. నిజానికి చైర్ వుమన్ అని ఉండాల్సింది. ఇదే మాదిరిగా కీలకమైన రాష్ట్రపతి, సభాపతి పదవులు మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు అధిష్టించవలసివచ్చినపుడు, ఇందుకోసం స్త్రీ లింగ సూచకాలను, జెండర్ న్యూట్రల్ పదాలను ప్రస్తుత రాజ్యాంగం సృష్టించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. కేవలం మగ ఆధిపత్య భావజాలానికి అనుకూలంగా ఉన్న ప్రస్తుత పదాల్ని ఇప్పటికైనా మార్చుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్రపతి, సభాపతి మొదలైన పదవులకు రాజ్యాంగ పరంగా స్త్రీ లింగ వాచకాలను, అలాగే, లింగ తటస్థ వాచకాలను రాజ్యాంగ భాషగా సృష్టించుకోవాలి. అందుకు అనుగుణంగా కులాధిక్య, మగాధిక్య రాజకీయ సమాజము మారాలి. ఈ విధంగా రాజ్యాంగాన్ని వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది.


– జూపాక సుభద్ర

కృపాకర్ మాదిగ

Updated Date - 2022-07-30T07:48:36+05:30 IST