కోనసీమలో ‘ముంపు’

ABN , First Publish Date - 2020-08-14T10:30:53+05:30 IST

ఆగస్టులో వచ్చే వరదలు కోనసీమ వాసులను ఎప్పుడూ హడలెత్తిస్తుంటాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో గోదావరి నదికి భారీ వరద ప్రవాహం ముంచెత్తుతున్న నే

కోనసీమలో ‘ముంపు’

అమలాపురం-ఆంధ్రజ్యోతి:

ఆగస్టులో వచ్చే వరదలు కోనసీమ వాసులను ఎప్పుడూ హడలెత్తిస్తుంటాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో గోదావరి నదికి భారీ వరద ప్రవాహం ముంచెత్తుతున్న నేపథ్యంలో ధవళే శ్వరం బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టడంతో కోనసీమ లోని గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయల్లోకి వరదనీరు భారీగా పెరిగింది. దాంతో సమీప లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.


ముందు జాగ్రత్త చర్యగా కోటిపల్లి-ముక్తేశ్వరం, సఖినేటిపల్లి-నరసాపురం రేవుల్లోని పంటులపై రాకపోకలను నిలిపివేశా రు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ పాతవంతెన వరద ముంపునకు గురైంది. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక కాజ్‌వే వద్ద వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో రాత్రికి కాజ్‌వే మునకకు గురయ్యే అవకాశం ఉంది. పి.గన్నవరం మండలం జి.పెదపూడి, సమీప లంక గ్రామాల నుంచి పడవలపై ప్రయాణికులను దాటిస్తున్నారు.


వరద ఉధృతి రాత్రికి మరింత పెరగవచ్చనేది ఇరిగేషన్‌శాఖ అధికారుల అంచనా. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువులకు చెందిన రైతులు ఈసారి వరద ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా పట్టుబడులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక రాష్ర్టాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌, ఒడిసా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


వీటితోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురు స్తున్నాయి. కోనసీమలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై స్వల్పంగానే జల్లులు పడినప్పటికీ ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంది. సముద్రం కెరటాల ఉధృతీ తీవ్రంగా ఉంది. ఇటు భారీ వర్షాలు, అటు వరద తీవ్రత కోనసీమ ప్రజలను కలవరపెడుతున్నాయి.

Updated Date - 2020-08-14T10:30:53+05:30 IST