ముంచుతున్న వాన!

ABN , First Publish Date - 2020-10-22T07:22:31+05:30 IST

ఎండ ఫెళ్లున కాస్తుంటుంది! కానీ.. చూస్తూచూస్తూండగానే మబ్బులు కమ్ముకోవడం మొదలవుతుంది. సూర్యుడు ఆ

ముంచుతున్న వాన!

రాజధానిలో 21 రోజుల్లో 383 మి.మీ. వర్షం.. మూడు రోజుల్లో రికార్డుస్థాయి వర్షపాతం

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి

రోజులు గడుస్తున్నా రోడ్లపై తొలగని బురద


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎండ ఫెళ్లున కాస్తుంటుంది! కానీ.. చూస్తూచూస్తూండగానే మబ్బులు కమ్ముకోవడం మొదలవుతుంది. సూర్యుడు ఆ మబ్బుల చాటుకు వెళ్లి.. చీకట్లు కమ్ముకుంటాయి!! కుండతో ఎత్తిపోసినట్టు.. పగబట్టినట్టు పెద్ద పెద్ద చినుకులతో పెద్ద వాన కొడుతుంది! కురిసేది కొద్దిసేపే అయినా కుంభవృష్టి కావడంతో రోడ్లన్నీ జలమయమైపోయి.. మోకాటి లోతు నీళ్లు నిలిచిపోతాయి! దీంతో ట్రాఫిక్‌ జామ్‌!!


గత 21 రోజులుగా రాజధాని నగరంలో వర్షాల విలయతాండవమిది. పదేళ్ల కాలం నుంచి ఎన్నడూ కురవనంత వర్షం గ్రేటర్‌ వ్యాప్తంగా ఈ అక్టోబరులో కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలో ఈ నెల1 నుంచి 21 వరకు సాధారణ వర్షాపాతానికి ఐదింతల వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 73.7 మిల్లీమీటర్లు కాగా.. కురిసింది 383 మిల్లీమీటర్ల వాన.


అలాగే రంగారెడ్డి జిల్లాలో సాధారణం 68.6 మిల్లీమీటర్లు ఉండగా.. 245.4 మిల్లీమీటర్లు, మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం 62.9 కాగా.. 262 మిల్లీమీటర్లు కురిసింది. మరీ ముఖ్యంగా.. హైదరాబాద్‌లో అక్టోబరు 9, 13, 17 తేదీల్లో కురిసిన అతి భారీ వర్షాలతోనే ఇప్పటివరకు నగరంలో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు.


వీడని వరద.. వాన

వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా సరూర్‌నగర్‌, చార్మినార్‌, ఆసి్‌ఫనగర్‌, బండ్లగూడ, ఉప్పల్‌, రామంతాపూర్‌, ఫీర్జాదిగూడ, మేడిపల్లి, నదీంకాలనీ, ఛత్రినాక, అరుంధతికాలనీల్లోని ప్రజలు ఇంకా  పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కీసర మండలంలో 57.0 మిల్లీమీటర్లు పడింది.


రోజులు గడుస్తున్నా..

ఈ నెల 13న కురిసిన వర్షానికి మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు నిండి అలుగుపారడంతో పాతబస్తీలోని అలీనగర్‌, అల్‌జుబైల్‌ కాలనీలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఆ కాలనీల్లోని పలు వీధులు నేటికీ బురదమయంగా ఉన్నాయి. అలీనగర్‌లోని నాలా పక్కన ఉంటున్న ఇళ్లలోని కింది అంతస్తుల్లోకి నీరు చేరి వస్తువులన్నీ పాడైపోయాయి.

చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి బంధువుల ఇళ్లల్లో, తెలిసినవారి ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. అల్‌జుబైల్‌ కాలనీలోని వీధులన్నీ వరదనీరు, బురదతో నిండిపోయాయి. ఈ రెండు కాలనీల్లోనే కాదు.. నగరంలో, శివారు ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.




Updated Date - 2020-10-22T07:22:31+05:30 IST