ఔషధ ఎగుమతులు రూ.1,56,950 కోట్లు

ABN , First Publish Date - 2021-04-11T06:09:14+05:30 IST

ముందుగా ఊహించిన స్థాయిలో దేశీయ ఎగుమతులు పెరగకపోయినప్పటికీ.. అంత క్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోలిస్తే 2020-21లో దేశీయ కంపెనీల ఔషధ ఎగుమతుల వృద్ధి రేటు ఆకర్షణీయంగానే

ఔషధ ఎగుమతులు రూ.1,56,950 కోట్లు

2020-21 తొలి 11 నెలల్లో 12.25% వృద్ధి

150కి పైగా దేశాలకు ఎగుమతులు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ముందుగా ఊహించిన స్థాయిలో దేశీయ ఎగుమతులు పెరగకపోయినప్పటికీ.. అంత క్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోలిస్తే 2020-21లో దేశీయ కంపెనీల ఔషధ ఎగుమతుల వృద్ధి రేటు ఆకర్షణీయంగానే ఉండనుంది. 2021 ఫిబ్రవరితో ముగిసిన పదకొండు నెలలకు ఔషధ ఎగుమతులు 12.25 శాతం వృద్దితో 2,150 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,56,950 కోట్లు)కు చేరాయని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌) తెలిపింది. 2019-20లో ఔషధ ఎగుమతులు 7.57 శాతం వృద్ధితో 2,058 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 11 నెలలకు ఎగుమతులు 2,150 కోట్ల డాలర్ల (రూ.1,56,950 కోట్లు)కు చేరాయని ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు.


అంచనా ఇదీ..

బల్క్‌ డ్రగ్స్‌, డ్రగ్‌ ఇంటర్మీడియట్‌ ఎగుమతులు క్షీణించినప్పటికీ.. డ్రగ్‌ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్‌ ఎగుమతులు ఆకర్షణీయంగా 17.92 శాతం పెరుగుదల కారణంగా ఫిబ్రవరితో ముగిసిన కాలానికి ఔషధ ఎగుమతులు 12.25 శాతం పెరగడానికి వీలైంది. ఆయుష్‌ ఉత్పత్తుల ఎగుమతులు 8.73 శాతం, హెర్బల్‌ ఉత్పత్తులు 30.06 శాతం పెరిగాయి. సర్జికల్స్‌ ఎగుమతులు 3.94%, వ్యాక్సిన్ల ఎగుమతులు 2.49 శాతం చొప్పు న వృద్ధి చెందాయి. 2020-21 ఏడాది ప్రారంభంలో మొత్తం ఏడాదికి ఔషధ ఎగుమతులు 2,400 కోట్ల డాలర్లకు చేరగలవని ఫార్మాగ్జిల్‌ అంచనా వేసింది.  


6.4 కోట్ల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతి

గత ఆర్థిక సంవత్సరంలో 150కి పైగా దేశాలకు భారత కంపెనీలు ఔషధాలను ఎగుమతి చేశాయి. గత కొనేళ్లుగా భారత్‌ ఎగుమతులు చేస్తున్న దేశాల నుంచే కాకుండా కొత్త మార్కెట్ల నుంచి జనరిక్‌ ఔషధాలకు బాగా గిరాకీ లభించిందని ఉదయ్‌ భాస్కర్‌ అన్నారు. పెరిగిన గిరాకీకి అనుగుణంగా భారత కంపెనీలు ఔషధాలను సరఫరా చేశాయి. ఇందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, హెటెరో కంపెనీలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫార్మాగ్జిల్‌ వెల్లడించింది. ఇప్పటి వరకూ 82 దేశాలకు 6.4 కోట్ల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను భారత కంపెనీలు సరఫరా చేశాయి. 


లాటిన్‌ అమెరికా దేశాలపై దృష్టి..

భారత ఔషధ కంపెనీలు లాటిన్‌ అమెరికా దేశాలపై (ఎల్‌ఏసీ) దృష్టి పెడుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ ప్రాంతం వాటా 6.5 శాతం ఉంది. భారత ఔషధాలకు ఎల్‌ఏసీ నాలుగో అతిపెద్ద మార్కెట్‌. 2020 ఏప్రిల్‌-డిసెంబరు నెలల్లో ఈ దేశాలకు చేసిన ఎగుమతులు 15.9 శాతం పెరిగి 116 కోట్ల డాలర్లకు చేరాయి. ఈ దేశాల ఔషఽధాల మార్కెట్‌ విలువ 6,700 కోట్ల డాలర్లు ఉంటుందని.. ఇందులో జనరిక్‌ ఔషధాల మార్కెట్‌ 1700 కోట్ల డాలర్లని అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత్‌కు చెందిన వివిధ కంపెనీలు మెక్సికోలో యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. 

Updated Date - 2021-04-11T06:09:14+05:30 IST