డ్రగ్స్‌ వాడితే వినాశనమే

ABN , First Publish Date - 2021-10-26T06:24:36+05:30 IST

గంజాయి, మత్తు కలిగించే మందులు, డ్రగ్స్‌ వంటివి వాడితే వినాశనం తప్పదని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా హెచ్చరించారు.

డ్రగ్స్‌ వాడితే వినాశనమే
కౌన్సిలింగ్‌ నిర్వహించే వైద్యుడు, ఎన్‌జీవో సంస్థ ప్రతినిధితో మాట్లాడుతున్న సీపీ

యువతతోపాటు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి

డ్రగ్స్‌ బాధితులకు ఉచితంగా చికిత్స, కౌన్సెలింగ్‌

సీపీ మనీష్‌కుమార్‌సిన్హా

విశాఖపట్నం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గంజాయి, మత్తు కలిగించే మందులు, డ్రగ్స్‌ వంటివి వాడితే వినాశనం తప్పదని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా హెచ్చరించారు. డ్రగ్స్‌కు బానిసలైనవారికి స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రతీ సోమవారం ’మార్పు’ పేరుతో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కౌన్సెలింగ్‌కు హాజరైన యువత, వారి తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడారు. నగరంలో గతకొంతకాలంగా గంజాయి, మత్తు కలిగించే మందుల వాడకం పెరుగుతోందన్నారు. 16-40  ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువమంది వీటిని వాడుతున్నట్టు గుర్తించామన్నారు. మత్తు కలిగించే మందులు, డ్రగ్స్‌ వాడడం వల్ల మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, దీనివల్ల మనిషి ఆలోచన శక్తి, విచక్షణ, పనిచేసే శక్తిని కోల్పోతాడన్నారు. ఇది కుటుంబంతోపాటు సమాజానికి తీవ్ర ఇబ్బందికరంగా మారుతోందన్నారు. దీనిని అధిగమించేందుకు వీలుగా తొమ్మిది నెలల కిందట ‘మార్పు’ పేరుతో డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ కోసం స్వర్ణభారతి స్టేడియంలో ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఒక సైక్రియాట్రిస్ట్‌, గ్రీన్‌వ్యాలీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఒక కౌన్సెలర్‌తోపాటు పోలీస్‌శాఖ నుంచి ఏసీపీ స్థాయి అధికారిని బృందంగా ఏర్పాటు చేశామన్నారు. వీరంతా డ్రగ్స్‌ వాడకానికి అలవాటుపడినవారితోపాటు వారి తల్లిదండ్రులకు వారానికి ఒకసారి చొప్పున నెలరోజులపాటు కౌన్సెలింగ్‌ చేస్తున్నారన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కానట్టయితే గ్రీన్‌వ్యాలీ ఫౌండేషన్‌కు చెందిన డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించి ఉచితంగా  చికిత్స అందిస్తున్నామన్నారు. గత తొమ్మిది నెలలల్లో మార్పు ఫోరం ద్వారా 229 మందికి కౌన్సెలింగ్‌ చేసి, సాధారణ స్థితికి వారిని తీసుకురాగలిగామన్నారు. ఏదైనా కారణం చేత ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటుపడినట్టయితే అలాంటివారు నిర్భయంగా కౌన్సెలింగ్‌ ఫోరంని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఒకవేళ బాధితులు రాలేనిపక్షంలో వారి తల్లిదండ్రులు, స్నేహితులైనా సరే సకాలంలో కౌన్సెలింగ్‌ సెంటర్‌కు తీసుకురావాలని సూచించారు. గ్రీన్‌వ్యాలీ ఫౌండేషన్‌ సీఈఓ ఉమాకుమారి మాట్లాడుతూ తమ వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చేవారిలో విద్యార్థులు, ఉద్యోగులతోపాటు  కూలి పనులు చేసుకునేవారు కూడా ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ శివకుమార్‌, డీసీపీ-1 గౌతమీశాలీ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:24:36+05:30 IST