రాష్ట్రంలో డ్రగ్స్‌ మాట వినపడొద్దు

ABN , First Publish Date - 2022-01-27T08:59:53+05:30 IST

రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట వినిపించకూడదని, వాటి వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇందుకోసం నార్కొటిక్‌ అండ్‌ ఆర్గనైజ్డ్‌ కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ మాట వినపడొద్దు

  • దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు
  • నేర నియంత్రణకు 
  • 1000 మందితో ప్రత్యేక విభాగం
  • అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట వినిపించకూడదని, వాటి వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇందుకోసం నార్కొటిక్‌ అండ్‌ ఆర్గనైజ్డ్‌ కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌  నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 మందితో నార్కొటిక్‌ అండ్‌ ఆర్గనైజ్డ్‌ కంట్రోల్‌ సెల్‌ పేరిట ప్రత్యేక పోలీస్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. డీజీపీ ఆధ్వర్యంలోని ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌, ఇతర వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు పని చేయాలని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాట వినపడకూడదని, ఇందుకోసం అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డ్రగ్స్‌ కేసుల్లో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు. కాగా, డ్రగ్స్‌ నియంత్రణ అంశానికి సంబంధించి రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ శుక్రవారం మరోసారి సమీక్ష జరపనున్నారు. కాగా, డ్రగ్స్‌ నియంత్రణకు సంబంధించి గతేడాది అక్టోబర్‌లోనూ సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ఇదే తరహా ఆదేశాలు ఇచ్చారు.


డీజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఓ ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. నాలుగు నెలలు కావస్తున్న అలాంటి విభాగం ఏదీ ఏర్పాటు కాలేదు. ఈసారైనా ముందడుగు పడుతుందో లేదో చూడాలి. అయితే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు గంజాయి కట్టడిపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. నాలుగు నెలల్లో వెయ్యికి పైగా కేసులు రిజస్టర్‌ చేశారు. ఈ కేసుల్లో సుమారు 1500 మందిని కటకటాల్లోకి పంపారు. 

Updated Date - 2022-01-27T08:59:53+05:30 IST