నెక్ట్స్ ఎవరు?

ABN , First Publish Date - 2022-01-21T16:05:59+05:30 IST

నాలుగేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు సినీ, వ్యాపార పరిశ్రమల రంగాన్ని మాదకద్రవ్యాలు ఓ కుదుపు కుదిపేశాయి. ఏళ్లు గడిచినందున సరఫరాదారులు

నెక్ట్స్ ఎవరు?

గ్యాంగ్‌లీడర్‌ టోనీ అరెస్టుతో డ్రగ్స్‌ కుంభకోణంలో ప్రముఖుల ఆనవాళ్లు

కొందరి వ్యాపారుల వివరాలు బయటకు.. 

కొనసాగుతున్న గాలింపు


హైదరాబాద్‌ సిటీ: నాలుగేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు సినీ, వ్యాపార పరిశ్రమల రంగాన్ని మాదకద్రవ్యాలు ఓ కుదుపు కుదిపేశాయి. ఏళ్లు గడిచినందున సరఫరాదారులు పారిపోయి ఉంటారని అందరూ భావించారు. కానీ, పోలీసులు, అధికారులు అప్రమత్తం కాగానే దాక్కున్నట్లు నటిస్తూ, చాప కింద నీరులా వారు దందా సాగిస్తున్నారని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. 15 రోజుల క్రితం హైదరాబాద్‌ పోలీసులకు చిక్కిన టోనీ బ్యాచ్‌తో అధికారులు మరోసారి ఉలిక్కిపడ్డారు. డ్రగ్స్‌ సరఫరాకు చెందిన పెద్ద ముఠాలకు నాయకుడిగా ఉన్న టోనీ అప్పట్లో చిక్కలేదు. దీంతో అతను తన డ్రగ్స్‌ సామ్రాజ్యాన్ని ఎక్కడెక్కడకు విస్తరిస్తున్నాడనే కోణాల్లో హైదరాబాద్‌, ముంబై పోలీసులు కూడా గాలిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గురువారం టోనీ చిక్కాడు. 


చాపకింద నీరులా..

టోనీ అరెస్టుతో డ్రగ్స్‌ మహా సరఫరాదారులు ఎక్కడికీ పారిపోలేదని, చాపకింద నీరులా తమ పని కానిచ్చేస్తున్నారనే విషయం మరోసారి తేటతెల్లమైంది. దీంతో టోనీ లాంటి ముఠాలు ఎన్ని తిరుగుతున్నాయి, ఎంత మొత్తంలో వీళ్లు నైజీరియా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్‌ లాంటి డ్రగ్స్‌ ఇక్కడికి తరలించి ఉంటారు, ఇక్కడ వారి నుంచి కొనుగోలు చేస్తున్నదెవరు? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏడుగురు వ్యాపారులు చిక్కినా  చాలా మంది ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో ఉండే ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  


15 రోజుల క్రితం..

ఈ నెల 6న నైజీరియన్‌ ఘరానా స్మగ్లర్స్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని విచారించగా టోనీ ముంబైతోపాటు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాను విస్తరింపజేయాలని పథకం వేసి తమను నగరానికి పంపాడని ఒప్పుకున్నారు. వాళ్లిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు టోనీని అరెస్టు చేయగలిగారు. పోలీసులు మూలాల్లోకి వెళితే డ్రగ్స్‌ వ్యవహారంలో అప్పట్లోలాగే ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 


ఎంతమంది ఏజెంట్లు

ప్రధాన నిందితుడు టోనీ ఇక్కడి వారిని తన ఏజెంట్లుగా  నియమించి దేశవ్యాప్తంగా దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైకి చెందిన ఇమ్రాన్‌బాబూ షేక్‌ టోనీకి ప్రధాన అనుచరుడు. అతని సాయంతో ముంబై లో కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని డ్రగ్స్‌ దందా కొనసాగిస్తుంటాడు. ఒకరి లింకుతో మరొకరిని, 15రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఘరానా స్మగ్లర్‌ నైజీరియాకు చెందిన టోనీ ఎట్టకేలకు గురువారం చిక్కడంతో హైదరాబాద్‌తోపాటు ముంబై పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 


ప్రముఖులతో సంబంధాలు

ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించి వారి ద్వారా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలతోపాటు ఎంతోమంది సెలబ్రిటీలకు టోనీ డ్రగ్స్‌ సరఫరా చేసేవాడని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా పెద్దవారితోనూ అతను నేరుగా సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని విచారించి ఫోన్‌ కాంటాక్టులు బయటకు తీస్తే దేశవ్యాప్తంగా వందలాది మంది డ్రగ్స్‌ స్మగ్లర్స్‌తోపాటు డీలర్స్‌, కొనుగోలు చేస్తున్న సెలబ్రిటీలు, సంపన్న వర్గాలకు చెందిన వారు, ప్రముఖ వ్యాపార వేత్తలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2022-01-21T16:05:59+05:30 IST