ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌..

ABN , First Publish Date - 2021-01-10T07:47:37+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల పట్టుబడ్డ రూ. 70 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాల కేసులో తీగలాగితే.. డొంక హైదరాబాద్‌ శివార్లలో కదులుతోంది.

ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌..

  • హైదరాబాద్‌లో కదులుతున్న డొంక
  •  మూతపడ్డ పరిశ్రమల్లో ఎస్వోటీ వేట
  •  యాదాద్రి జిల్లాలో పరిశ్రమలపై అనుమానాలు
  •  వేదప్రకాశ్‌ మొబైల్‌ కాల్‌డేటాపై ఆరా
  •  రేపోమాపో నగరానికి ఇండోర్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ/యాదాద్రి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల పట్టుబడ్డ రూ. 70 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాల కేసులో తీగలాగితే.. డొంక హైదరాబాద్‌ శివార్లలో కదులుతోంది. ఇండోర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ (ఎస్వోటీ) రంగంలోకి దిగాయి. ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ను హైదరాబాద్‌ శివార్లలోని మూతపడ్డ ఫార్మా కంపెనీల్లో తయారు చేశారని తేలడంతో.. ఆ కోవలోని కంపెనీలను జల్లెడపడుతున్నారు. ముఖ్యంగా.. ఇండోర్‌ పోలీసులు అరెస్టు చేసిన వేదప్రకాశ్‌ వ్యాస్‌కు చెందిన ఫార్మా కంపెనీతోపాటు.. ఇతర కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు.


ఎవరీ వేదప్రకాశ్‌?

ఇండోర్‌ పోలీసులు అరెస్టు చేసిన వేదప్రకాశ్‌ వ్యాస్‌ రాజస్థాన్‌కు చెందినవాడు. 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి.. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో అరిస్టాన్‌ ఫార్మా నోవెటెక్‌ కంపెనీని స్థాపించాడు. బల్క్‌డ్రగ్స్‌ తయారీ రంగంలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల తయారీ ద్వారా తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో.. ఎండీఎంఏ(మిథైల్‌ ఎన్డిమాక్స్‌ మెథా పెటమిన్‌) తయారీని ప్రారంభించాడు. ‘మిస్టర్‌ క్లీన్‌’గా కనిపించేందుకు ఎక్కడా సీన్‌లోకి రాడని పోలీసులు గుర్తించారు.


అందుకే.. డ్రగ్స్‌ తయారీకి మూతపడ్డ ఫార్మా కంపెనీలను ఎంచుకునేవాడు. తయారీ మొదలు.. సరఫరా దాకా ఎక్కడా రంగంలో ఉండేవాడు కాదు. అయితే.. ఇప్పటి వరకు వందల కోట్లు విలువ చేసే ఎండీఎంఏను దేశ విదేశాల్లోని స్మగ్లర్లకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. ఎస్వోటీ పోలీసులు నోవెటెక్‌లో జరిపిన తనిఖీల్లో ఎక్కడా డ్రగ్స్‌ జాడ లభ్యం కాలేదు. దీంతో.. రాచకొండ, సైబరాబాద్‌ పరిధుల్లోని కొంపల్లి, చర్లపల్లి, నాచారం, ఘట్కేసర్‌, చౌటుప్పల్‌, బీబీనగర్‌ ప్రాంతాల్లోని మూత పడ్డ ఫార్మా కంపెనీలను జల్లెడ పడుతున్నారు. 


కాల్‌డేటాపై పోలీసుల దృష్టి

వేదప్రకాశ్‌ అరెస్టుకు ముందు అతడి ఫోన్‌ చౌటుప్పల్‌లో స్విచాఫ్‌ అయ్యింది. దీంతో పోలీసులు.. చౌటుప్పల్‌ పరిసరాల్లోని మూతపడ్డ ఫార్మా కంపెనీలపై దృష్టిసారించారు. ఫోన్‌ స్విచాఫ్‌ అవ్వడానికి ముందు వేదప్రకాశ్‌ ఎవరెవరితో మాట్లాడాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? అనే కోణాలపై దృష్టిసారించారు. అతని కాల్‌డేటాను సేకరించే పనిలో పడ్డారు. కాగా.. ఇండోర్‌ పోలీసులు వేదప్రకాశ్‌ను కస్టడీకి తీసుకునేందుకు అక్కడి కోర్టులో పిటిషన్‌ వేశారు. అతడి కస్టడీకి కోర్టు ఆమోదం తెలపగానే.. తొలుత సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా అతడిని ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఆ సమయంలో.. అతడిని ప్రశ్నించేందుకు ఎస్వోటీ పోలీసులు సిద్ధమవుతున్నారు.


అతడు నగరానికి వస్తే.. ఎక్కడ డ్రగ్స్‌ తయారు చేశా డు? ఇప్పటివరకు ఎంత మొత్తంలో డ్రగ్స్‌ను స్మగ్లర్లకు సరఫరా చేశాడు? అనే విషయాలపై స్పష్ట వస్తుంది అని అధికారులు చెబుతున్నారు. అటు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలోనూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) పలు ఫార్మా కంపెనీల్లో డ్రగ్స్‌ తయారీ గుట్టును రట్టు చేసింది.


గత ఏడాది ఆగస్టు 17న నగరంలోని ఓ పరిశ్రమతో పాటు.. ముంబైలోని మరో పరిశ్రమలో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నగరంలో రూ.97కోట్లు విలువ చేసే 500 కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. కొంపల్లి, చర్లపల్లి, చౌటుప్పల్‌ ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి డ్రగ్స్‌ తయారీ కంపెనీలను డీఆర్‌ఐ గుర్తించింది.


Updated Date - 2021-01-10T07:47:37+05:30 IST