బాబోయ్‌.. డ్రగ్స్‌!

ABN , First Publish Date - 2020-11-24T06:16:15+05:30 IST

నగరంలో డ్రగ్స్‌ సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులు/ విక్రయదారులు తమకు కావాల్సిన డ్రగ్స్‌ను ఏకంగా ఆన్‌లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు.

బాబోయ్‌.. డ్రగ్స్‌!

నగరంలో విస్తరిస్తున్న సంస్కృతి

ఆన్‌లైన్‌లోనే కొనుగోలు

బిట్‌కాయిన్‌ రూపంలో చెల్లింపులు

ఖరీదైన ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వాడకం

బెంగళూరు, హైదరాబాద్‌, గోవా నుంచి కూడా దిగుమతి

విద్యార్థులే వినియోగదారులు, విక్రేతలు

ప్రత్యేకంగా కోడ్‌ లాంగ్వేజ్‌

వాట్సాప్‌ గ్రూపుల్లో చాటింగ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో డ్రగ్స్‌ సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులు/ విక్రయదారులు తమకు కావాల్సిన డ్రగ్స్‌ను ఏకంగా ఆన్‌లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు. లావాదేవీలు సైబర్‌ నిపుణులకు సైతం దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు. విద్యావంతులే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాము వినియోగించడంతో పాటు విద్యార్థులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతవరకూ గంజాయి, ఫోర్ట్విన్‌ ఇంజక్షన్లు వంటి మత్తుమందులను వాడిన కొంతమంది ఇప్పుడు కొకైన్‌, ఎండీఎంఏ పౌడర్‌, ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ వంటి మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. వీటిని గతంలో హైదరాబాద్‌, బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి తెప్పించుకునేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మార్చేశారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ఇంట్లోనే వుంటూ ఆన్‌లైన్‌ ద్వారా సరకు తెప్పించుకుంటున్నారు. ప్రత్యేక కోడ్‌ లాంగ్వేజ్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. కొద్దిరోజుల కిందట పోర్టు క్వార్టర్స్‌ వద్ద కొంతమంది డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి...నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎండీఎంఏ పౌడరుతో పాటు 61 ఎల్‌ఎస్‌డీ బోల్ట్‌ స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబరు పదిన రుషికొండ వద్ద హోటల్‌ నిర్వహించే ఎస్‌.వర్మరాజు అనే యువకుడు తాను తెప్పించిన డ్రగ్స్‌ను వేరొకరికి విక్రయించేందుకు బైక్‌పై తెన్నేటి పార్కు వద్దకు వెళ్లగా...ముందస్తు సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని బైక్‌ను తనిఖీ చేయగా ఎల్‌ఎస్‌డీ బోల్టులు, ఎండీఎంఏ పౌడరు లభించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అలాగే నగరానికి చెందిన అరవింద్‌ అగర్వాల్‌ అనే యువకుడు బెంగళూరులో బీబీఏ పూర్తిచేసి ఇటీవలే నగరానికి తిరిగివచ్చాడు. అక్కడ తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను కొనుగోలు చేసి తెప్పించుకుంటున్నాడు. వాటిని తన స్నేహితులకు అధిక ధరకు విక్రయిస్తే...  వారు నగరంలోని పలు ఇంజ నీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు మరికొంత ఎక్కువ మొత్తానికి అమ్ముకుం టూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బు రూపంలో లావాదేవీలు జరిగితే పోలీసులకు తెలిసిపోతుందనే భావనతో అర వింద్‌ బిట్‌కాయిన్స్‌ రూపంలోకి మార్చి చెల్లింపులు జరిపేవాడు. ఇందుకు సంబంఽ దించి దీనిపై సీపీ నియమించిన స్పెషల్‌ బ్రాంచి పోలీసుల బృందం ఆరుగురు ముఠా సభ్యులను గుర్తించి, ఐదుగురిని అరెస్టు చేసింది. వారి నుంచి 27 ఎండీఎంఏ బోల్ట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.


ప్రత్యేక కోడ్‌ ద్వారా సరఫరా, వినియోగం

డ్రగ్స్‌ వినియోగించే వారితోపాటు విక్రేతలు విషయం బయటకు పొక్కకుండా కోడ్‌ లాంగ్వేజ్‌ వాడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొకైన్‌ అయితే ‘సీ’ అని, ఎండీఎండీ అయితే ‘ఎం’ అని, గంజాయి అయితే ‘జే ’ అని... ఇలా ప్రత్యేకమైన కోడ్‌ రచించుకున్నారు. ప్రాంతాల వారీగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటుచేసుకుని తాము కలిసే చోటు, సమయాలను నిర్దేశించుకుంటున్నారు. 


వ్యాపారంగా...

గోవాలో ఎల్‌ఎస్‌డీసీ చిప్స్‌ స్ర్టిప్‌ రూ.వెయ్యి రూపాయలు. ఒక స్ర్టిప్‌లో 20 ఉంటాయి. వీటిని నగరానికి తీసుకువచ్చి ఒక్కోటి రూ.రెండు నుంచి మూడు వేల రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. కొకైన్‌ గ్రాము రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పటివరకూ వీటి వినియోగం హైదరాబాద్‌, ముంబై వంటి నగరాలకే పరిమితం. తాజాగా రుషికొండ ఘటనలో విశాఖలో కొకైన్‌ విని యోగం జరుగుతున్న విషయం బయటపడింది.  


అర్ధరాత్రి... నగర శివారు ప్రాంతాల్లో

డ్రగ్స్‌ సరఫరా చేసేవారితోపాటు వాటిని వినియోగించే వారంతా సాధారణంగా అర్ధరాత్రి  కలిసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. రుషికొండ, భీమిలి, దసపల్లా హిల్స్‌, ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంతోపాటు అడవివరం నుంచి కృష్ణాపురం వరకూ బీఆర్‌టీఎస్‌ రోడ్డుని అడ్డాగా మార్చుకుంటున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు.


ప్రత్యేక బృందాలతో నిఘా

నగరంలో డ్రగ్స్‌ ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశాం. ఇటీవల కాలంలో డ్రగ్స్‌ ముఠాలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ నిపుణుల సహకారం తీసుకుని అలాంటి వెబ్‌సైట్లను వాడుతున్న వారిని గుర్తిస్తున్నాం. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతుండడం, విద్యార్థులే కొరియర్లు, కొనుగోలుదారులు కావడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడిక, ఇంటర్నెట్‌ను దేనికోసం వాడుతున్నారనే దానిపై కన్నేసి ఉంచాలి. డ్రగ్స్‌ వినియోగం, సరఫరా, రవాణాకు సంబంధించిన సమాచారం వుంటే డయల్‌ 100కి సమాచారం ఇవ్వడం బాధ్యతగా భావించండి. 

- మనీష్‌కుమార్‌ సిన్హా, నగర పోలీస్‌ కమిషనర్‌

Updated Date - 2020-11-24T06:16:15+05:30 IST