Abn logo
Oct 24 2021 @ 03:01AM

2 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ సీజ్‌

  • వెల్లడించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌
  • ముగ్గురి అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు నిందితులు
  • విద్యార్థులే టార్గెట్‌గా ఎఫిడ్రిన్‌ ముఠాలు.. ఎక్సైజ్‌ అధికార్ల వెల్లడి
  • లెహంగాల్లో డ్రగ్స్‌.. ఆస్ట్రేలియాకు ఏపీలోని నరసాపురం నుంచి..
  • బెంగళూరులో పట్టుకున్న ఎన్‌సీబీ.. 3 కిలోల సూడో ఎఫిడ్రిన్‌ సీజ్‌


పేట్‌బషీరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంతోపాటు.. పరిసర జిల్లాల్లోని విద్యార్థులే టార్గెట్‌గా ఎఫిడ్రిన్‌ను విక్రయించే డ్రగ్స్‌ ముఠా ఆటను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కట్టించారు. శనివారం కుత్బుల్లాపూర్‌లోని మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో.. జిల్లా ఎక్సైజ్‌ అధికారి విజయభాస్కర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సహాయ కమిషనర్‌ చంద్రయ్య వివరాలు వెల్లడించారు. ఓ డ్రగ్స్‌ ముఠా గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు ఎఫిడ్రిన్‌ను విక్రయిస్తోందనే సమాచారంతో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ సహదేవహ బృందం కూకట్‌పల్లి న్యూబాలాజీనగర్‌లోని ఎస్వీ సెలెక్షన్‌ అపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించింది. అక్కడ కరీంనగర్‌ జిల్లా గన్నవరం మండలం చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన పవన్‌ అలియాస్‌ చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి(24) వద్ద 5 గ్రాముల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ మూలాలను కనుగొనే క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాయిపేటకు చెందిన మహేశ్వర్‌ కన్నారెడ్డి అనే వ్యక్తి ఎఫిడ్రిన్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో.. అతణ్ని అరెస్టు చేసి, 921 గ్రాముల ఎఫిడ్రిన్‌ను సీజ్‌ చేశారు.


తదుపరి దర్యాప్తులో అతనికి నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం బవాజీపల్లి గ్రామానికి చెందిన కొండునూరి రామకృష్ణ గౌడ్‌ అనే వ్యక్తి డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో.. మహేశ్వర్‌రెడ్డితో రామకృష్ణకు ఫోన్‌ చేయించి.. పెద్దమొత్తంలో ఎఫిడ్రిన్‌ కావాలని ఆర్డరిప్పించారు. రామకృష్ణ 4.926 కిలోల డ్రగ్స్‌తో కారు(టీఎ్‌స07-జీఎన్‌8148)లో వచ్చాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం అతడిని అరెస్టు చేసింది. అతడి వద్ద సీజ్‌ చేసిన డ్రగ్స్‌ విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని సహాయ కమిషనర్‌ వివరించారు. ఎస్‌కే రెడ్డి, హనుమంత్‌రెడ్డి అనే వ్యక్తుల వద్ద రామకృష్ణ ఆ డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని, వారిద్దరిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 


లెహంగాల్లో డ్రగ్స్‌

డ్రగ్స్‌ వ్యవహారంలో మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి డ్రగ్స్‌ రవాణా జరిగింది. ఆస్ట్రేలియా చేరాల్సిన ఈ డ్రగ్స్‌ను బెంగళూరులో సీజ్‌ చేశారు. స్మగ్లర్లు లెహంగాల లేస్‌ మధ్య డ్రగ్స్‌ను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) బెంగళూరు జోన్‌ డైరెక్టర్‌ అమిత్‌ భావటె నేతృత్వంలోని బృందం ఈనెల 21న ఈ ‘ఆపరేషన్‌’ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నరసాపురం నుంచి ఆస్ట్రేలియాకు పంపేందుకు స్మగ్లర్లు మూడు లెహంగాలను కొరియర్‌ చేశారు. సమాచారం అందడంతో బెంగళూరు జోన్‌ ఎన్‌సీబీ అధికారులు రంగంలోకి దిగి.. మూడు కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. దీని విలువ రూ. కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి నరసాపురం నుంచి ఆ పార్సిల్‌ను బుక్‌ చేసినట్లు గుర్తించారు. చెన్నై ఎన్‌సీబీ అధికారులు రంగంలోకి దిగి.. నిందితుడిని శుక్రవారమే అరెస్టు చేశారు.