ఏడాది కేసులు రెండు వారాల్లోనే..!

ABN , First Publish Date - 2021-01-16T08:58:07+05:30 IST

తాగి వాహనం నడిపే వారిపై సైబరాబాద్‌ పోలీసులు విరుచుకుపడుతున్నారు. 17 రోజుల్లో ఏకంగా 5,830 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

ఏడాది కేసులు రెండు వారాల్లోనే..!

‘డ్రంకెన్‌ డ్రైవ్‌’లో సైబరాబాద్‌ సరికొత్త రికార్డు!..

17 రోజులు.. 5,830 కేసులు..!


హైదరాబాద్‌ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తాగి వాహనం నడిపే వారిపై సైబరాబాద్‌ పోలీసులు విరుచుకుపడుతున్నారు. 17 రోజుల్లో ఏకంగా 5,830 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. సాధారణంగా ఒక కమిషనరేట్‌ పరిధిలో ఏడాది కాలంలో 3 వేల నుంచి 4 వేల డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదవుతుంటాయి. కానీ సైబరాబాద్‌ పోలీసులు మాత్రం 17 రోజుల్లోనే ఏడాది పనిని పూర్తి చేసేసి.. సరికొత్త రికార్డు సృష్టించారు. అతివేగం, తాగి వాహనం నడపడమే ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతుండడంతో.. రహదారి భద్రతకే ఈ ఏడాది పెద్దపీట వేస్తున్నట్లు సీపీ సజ్జనార్‌ ప్రకటించారు. ప్రమాదాల నివారణే ప్రథమ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. తాగి వాహనం నడిపితే.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.


మద్యం మత్తులో, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరుల మృతికి కారణమైన వారిపై ఐపీసీ సెక్షన్‌ 304  పార్టు-2 కింద ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నారు. దీని ప్రకారం దోషులకు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తాగి వాహనం నడిపిన 67 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది. మరో 752 మందికి కోర్టు జరిమానాలు విధించింది. అలాగే, జరిమానాల రూపంలో ఈ వారంలో మొత్తం రికార్డు స్థాయిలో 39 లక్షల 24 వేల 500 రూపాయలు వసూలయ్యాయని పోలీసులు తెలిపారు. 


డ్రంకెన్‌ డ్రైవ్‌ జీరో స్థాయికి తేవాలి..

డ్రంకెన్‌ డ్రైవ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి జీరో స్థాయికి తగ్గించాలనేది సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల లక్ష్యం. ఈ మేరకు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిబందనలు కఠినతరం చేస్తున్నాం. తాగిన వ్యక్తి వాహనం నడపాలంటే భయపడే పరిస్థితి తెస్తాం. ఈ దిశగా 3 నెలల పాటు.. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ను కొనసాగించాలని నిర్ణయించాం. తాగి వాహనం నడుపుతూ.. మొదటి సారి పోలీసులకు చిక్కితే.. రూ. 10వేలు జరిమనా లేదా ఆరు నెలలు జైలు శిక్ష, రెండో సారిదొరికితే రూ. 15వేల జరిమానా లేదా 2 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుంది.

 విజయ్‌ కుమార్‌, ట్రాఫిక్‌ డీసీపీ, సైబరాబాద్‌

Updated Date - 2021-01-16T08:58:07+05:30 IST