ఎండుతున్న వరి, చెరుకు

ABN , First Publish Date - 2021-09-19T05:34:25+05:30 IST

మండలంలోని పాలేరు పాత కాల్వ కింద భూముల రైతులు మాత్రం సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళనకు సిద్దమవుతున్నారు.

ఎండుతున్న వరి, చెరుకు
సాగు నీరు అందక నెర్రెలు కొట్టిన వరి పొలం,

25రోజులుగా పాలేరు పాతకాల్వ

నుంచి సాగునీరు బంద్‌

పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

నేలకొండపల్లి, సెప్టెంబరు18:  మండలంలోని పాలేరు పాత కాల్వ కింద భూముల రైతులు మాత్రం సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటంతో జలాశయాలు నిండుగా ఉన్నాయి.   ఐనప్పటికీ పాలేరు పాత కాల్వ కింద రైతుల పొలాలకు సాగు నీరు సక్రమంగా అందటంలేదు. గతంతో అప్పటి పాలేరు శాసనసభ్యుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 70 కోట్ల నిధులను విడుదల చేశారు. పాలేరు పాతకాల్వ మొత్తాన్ని లైనింగ్‌ చేయించి, ఆధునికీకరించారు. పాలేరు పాతకాల్వ కింద ఆయకట్టు మొత్తం దాదాపు 25వేల ఎకరాలకు  సాగు నీరందటంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. కానీ అధికారుల అనాలోచిత చర్యల వలన రైతులు  నీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  

వేసవిని తలపిస్తున్న ఎండలు

వర్షాకాలం పంటకని పాలేరు పాతకాల్వకు ఇటీవల సాగునీటిని విడుదల చేశారు. సాగునీరు వస్తుందన్న ఆశతో రైతులు వరి, చెరుకు సాగు చేశారు. అయితే వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఇటీవల నీటి విడుదలను నిలుపుదల చేశారు. నీటిని నిలుపుదల చేసినప్పటికీ ఎడతెరిపి లేని వర్షాల వలన రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ కొద్ది రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు వేస్తుండటంతో పొలాలు ఎండిపోతున్నాయి. కానీ అధికారులు మాత్రం నీటిని విడుదల చేయటం లేదు. అదేమంటే వర్షాలు కురుస్తున్నాయి గదా అని సమాధానం చెపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వరి పొలాలు దాదాపుగా 25 రోజులుగా నీరు లేక ఎక్కడికక్కడ నెర్రెలు కొట్టి ఎండిపోతున్నాయి. చెరుకు పంట కూడా నీరు అందక, వేసవిని మించి ఎండలు కాస్తుండటంతో ఎండలకు తట్టుకోలేక ఎండిపోతున్నాయి.

పట్టించుకోని అధికారులు

 ముఖ్యంగా 25, 26, 27 తూముల కింద రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు నీటిని ఎప్పుడు వదలాలన్న దానిపై అధికారులకు కనీస అవగాహన ఉన్నట్లుగా లేదు. పొలాలు ఎండిపోతున్నా, పాలేరు రిజర్వాయర్‌ నిండా నీరున్నా అధికారులు మాత్రం నీటిని వదలటంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. అంతే గాకుండా కాల్వలో నాచు ఇతర వ్యర్ధాలను తొలగించటంలో అధికారులు మీనమేసాలు లెక్కిస్తున్నారు. శనివారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తమ బాధలు చెప్పుకుందామని వచ్చిన రైతులు, సమావేశానికి స్ధానిక ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే సమావేశానికి వచ్చాక, సమావేశంలో మాట్లాడిన అనంతరం రైతులు వచ్చారన్న సమాచారంతో బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. సమావేశంలో ఉన్న జేఈఈ రత్నగీతతో మాట్లాడించారు. రైతులు జేఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-09-19T05:34:25+05:30 IST