కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-04-20T03:18:21+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజల్లో ఎలాంటి మార్పు రానందున కరోనా కట్టడికి పోలీసులు కఠిన ఆంక్షలు విధించినట్లు డీఎస్పీ డీ.ప్రసాద్‌రావు తెలిపారు.

కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు : డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్‌రావు

శ్రీరామ నవమి, రంజాన్‌ పండుగలకూ పరిమితులు

కావలి, ఏప్రిల్‌ 19: కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజల్లో ఎలాంటి మార్పు రానందున కరోనా కట్టడికి పోలీసులు కఠిన ఆంక్షలు విధించినట్లు డీఎస్పీ డీ.ప్రసాద్‌రావు తెలిపారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది కరోనా అనుభవం దృష్ట్య ప్రజల్లో మార్పు వస్తుందని ఆశించామన్నారు. కానీ ప్రజల్లో ఎలాంటి మార్పు కన్పించకపోవటంతో కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు పెట్టుకుని సామాజిక దూరం పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా వ్యాపారులు  కొవిడ్‌ నిబంధనల మేరకు తమ వ్యాపారాలు కొనసాగించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ప్రజలు రోడ్లపై గుంపులు గుంపులుగా కనిపించినా, మాస్కు పెట్టుకోకపోయినా జరిమానా విధిస్తామన్నారు. ప్రజలకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించి కరోనా నుంచి రక్షణ పొందాలన్నారు.

శ్రీరామ నవమి, రంజాన్‌ పండుగలకూ పరిమితులు

కరోనా దృష్ట్యా శ్రీరామనవమి, రంజాన్‌ పండుగలను ప్రజలు పరిమిత సంఖ్యలోనే ఆలయాలకు, మసీదులకు వచ్చి జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పండుగలను తమ ఇళ్లలోనే జరుపుకుంటే మంచిదన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలకు ఎక్కడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోకుండా పరిమిత సంఖ్యలో భక్తిశ్రద్ధలతో పండుగలను జరుకోవాలన్నారు. రంజాన్‌కు ఉపవాసం ఉండే ముస్లింలు కూడా మసీదులకు పరిమిత సంఖ్యలో వచ్చి ప్రార్థనలు జరుపుకోవాలని, మిగిలిన వారు ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. 

వేసవి దొంగలతో  జాగ్రత్త

వేసవికాలం వచ్చిందంటే తరచూ దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరుబయట నిద్రించటం, తలుపులు తీసుకుని ఇంట్లో నిద్రించటం చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. వేసవిలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచుకోవద్దని, తాళాలు వేసి వెళ్లే టప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే మీ ఇళ్లకు భద్రత కల్పిస్తామని చెప్పారు.


Updated Date - 2021-04-20T03:18:21+05:30 IST