దుబాయి–భారత్ కరోనా బంధం

ABN , First Publish Date - 2021-12-29T09:14:19+05:30 IST

నిష్క్రమించనున్న 2021కి వీడ్కోలు చెబుతూ ఆగమించనున్న 2022కి సుస్వాగతం పలుకుతూ ఈ కాలమ్ పాఠకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....

దుబాయి–భారత్  కరోనా బంధం

నిష్క్రమించనున్న 2021కి వీడ్కోలు చెబుతూ ఆగమించనున్న 2022కి సుస్వాగతం పలుకుతూ ఈ కాలమ్ పాఠకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


కరోనా కార్చిచ్చు కారణాన కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జనసమూహాలు గుమిగూడకుండా నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. అందుకు భిన్నంగా పర్యాటకుల స్వప్నమైన దుబాయిలో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి.


కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో వివిధ యూరోపియన్ నగరాలకు చెందిన పర్యాటకులతో పాటు భారతీయ సంపన్నులు అనేక మంది నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి దుబాయికి వస్తున్నారు. బుర్జ్ ఖలీఫాతో పాటు నగరంలోని వివిధ ప్రదేశాల వద్ద గతంలో వలే ఈ సారి కూడ భారీ ఎత్తున బాణాసంచా కాంతులను విరజిమ్మేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు అన్ని కూడ దాదాపు నిండుగా ఉన్నాయి. కరోనా భయాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా నూతన సంవత్సర సంబరాలలో పర్యాటకులు మునిగిపోయారు. పెరుగు తున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక దుబాయి ఎక్స్ పోలో వినోద కార్యక్రమాలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అయినా నగర వ్యాప్తంగా సంబురాలు మహోత్సాహంతో జరుగుతున్నాయి. గల్ఫ్ లోని ఇతర దేశాలకు ఉన్నట్టుగా చమురు సంపద ఏ మాత్రం లేని దుబాయి ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. కరోనా ప్రతికూల పరిస్ధితుల తాకిడిలో కూడా దుబాయి పర్యాటక రంగం తన ప్రభావాన్ని పరిరక్షించుకోవడానికి అమిత ప్రాధాన్యమిస్తోంది. అది దాని మనుగడకు అనివార్యం కూడా. అదే చమురు ప్రధాన ఆదాయంగా ఉన్న ఆబుధాబి, సౌదీ అరేబియా, కువైత్ దేశాలు మాత్రం సుదీర్ఘ కాలం అనేక ఆంక్షలు విధించాయి.


కరోనా కారణాన అమెరికా, యూరోప్, చైనా, భారత్‌తో సహా పర్యాటక రంగం విలవిలలాడుతుండగా దుబాయి మాత్రం 2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. దుబాయి పర్యాటక రంగం 64 శాతం అభివృద్ధిని నమోదు చేసుకుంది. మరే ఇతర దేశ పర్యాటకమూ ఆ స్థాయికి చేరుకోలేదు. ఈ ఏడాది భారత్ నుంచి విదేశాలకు వెళ్ళిన వారిలో సగం కంటే ఎక్కువ మంది దుబాయికి వెళ్ళినట్లుగా గణంకాలు చెబుతున్నాయి. భారత్ లో హైదరాబాద్ తో సహా పలు నగరాలలో ప్రారంభ దశలో నిర్ధారణ అయిన ఒమైక్రాన్ కేసులన్నీ కూడ విదేశాల నుంచి దుబాయి మీదుగా భారత్ కు ప్రయాణించిన వారివే కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం కరోనా కేసులను ప్రప్రథమంగా బయటపెట్టింది దుబాయి అనేది మరిచిపోకూడదు. దుబాయి సందర్శనకు వచ్చిన కొంత మంది చైనా పౌరులకు కొవిడ్ -19 వ్యాధి సోకిందని 2020 జనవరి 29న దుబాయి అధికారులు వెల్లడించే వరకు భారత్‌తో సహా అనేక దేశాలకు కరోనా తీవ్రతగూర్చి ఏ మాత్రం అవగాహన లేదనేది వాస్తవం. 


కరోనా కారణాన అన్ని దేశాలలోని విభిన్న రంగాలు దెబ్బతిన్నప్పటికీ దుబాయికి వచ్చేసరికి పరిస్థితి భిన్నమైనది. పూర్తిగా పర్యాటకులపై ఆధారపడ్డ దుబాయికి ఇతర దేశాలతో పోల్చితే ఎక్కువ నష్టం వాటిల్లింది. అయితే ఆ నష్టాన్ని తగ్గించేందుకు దుబాయి రాజు శేఖ్ మోహమ్మద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్ధితులు కుదుటపడుతుండగా కరోనా మళ్లీ దుబాయిలో సైతం విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ అని ప్రత్యేకించి ప్రస్తావన చేయకుండా కరోనా కేసులను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు దుబాయిలో అధికారికంగా ఒక్క ఒమైక్రాన్ కేసును ఈ డిసెంబర్ ఆరంభంలో ప్రకటించారు. ఆ తరువాత ఒమైక్రాన్ అనే ప్రస్తావన ఎక్కడా లేదు. దుబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లో కరోనా కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా అనూహ్యంగా పెరిగిపోతోంది. కానీ ఆసుపత్రుల పాలై క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఎక్కువగా లేకపోవడం ఇక్కడ ఊరట కలిగించే విషయం. 


సెలవుల పై స్వదేశానికి వెళ్ళి రావాలనుకొంటున్న వేలాది తెలుగు వారితో పాటు ఇతర భారతీయ ప్రవాసుల పరిస్ధితీ అమ్యగోచరంగా మారింది. భారత్ లో క్రమేణా అమలులోకి వస్తున్న ఆంక్షల కారణాన, వెళ్ళి ఇరుక్కుపోతామనే భయం చాలామంది ప్రవాసులను వెంటాడుతోంది.


కరోనా కారణాన ఇప్పటికే దుబాయిలో భారీ సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి బాట పట్టారు. ఒక ఏడాదిలో ఒక్క కేరళకు చెందిన 8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారంటే పరిస్ధితిని ఉహించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారస్తులు దివాలా తీసారు. రానున్న నూతన సంవత్సరంలో పరిస్ధితులన్నీ చక్కగా ఉండాలని కోరుకుందాం. 

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2021-12-29T09:14:19+05:30 IST