Abn logo
Sep 5 2021 @ 13:24PM

పిల్లల విషయంలో అలా చేస్తున్న Parents కు.. Dubai పోలీసుల గట్టి వార్నింగ్!

దుబాయ్: వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలివెళ్తున్న తల్లిదండ్రులను దుబాయ్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలివెళ్లొద్దని సూచించారు. ఇలా వేడి అధికంగా ఉండే ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాల్లో ఉష్ణోగ్రత 70 సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని, ఇది పిల్లలకు ప్రాణాలకు ముప్పు అని వారించారు. ఈ వేసవి కాలం ప్రారంభం నుంచి అక్కడి పోలీసులు 'పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలి వెళ్లొద్దు' అనే నినాదంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా సమ్మర్ సీజన్‌లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి తల్లిదండ్రులను పోలీసులు సూచించారు. 


ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ భద్రతా అవగాహన విభాగం డైరెక్టర్ బుట్టి అల్ ఫలాసీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతాకు సంబంధించిన సమస్యల పరిష్కారం దిశగా ఏడాది మొత్తం దుబాయ్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తుంటారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో పిల్లల పట్ల పేరెంట్స్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలి వెళ్లడం అనేది కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలకు తీవ్రంగా పరిణమిస్తుందన్నారు. గడిచిన ఏడు నెలల కాలంలో తల్లిదండ్రులు వాహనాల్లో ఒంటరిగా వదిలి వెళ్లిన 39 మంది పిల్లలను తాము కాపాడినట్లు అల్ ఫలాసీ తెలిపారు. 


పిల్లలను వాహనాల్లో కూర్చొబెట్టి లాక్‌చేసి వెళ్లడం వల్ల వారికి ఊపిరాడక స్పృహ కోల్పోవడం, మరింత సమయం గడిస్తే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయని అన్నారు. తల్లిదండ్రుల చిన్న నిర్లక్ష్యం కారణంగా అన్యాయంగా పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కనుక పేరెంట్స్ ఎట్టిపరిస్థితుల్లో పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలివెళ్లకూడదని, వారితో పాటే తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను అసలు వదిలి వెళ్లకూడదని హెచ్చరించారు.  

తాజా వార్తలుమరిన్ని...