బాడీగార్డ్‌తో దుబాయ్‌ యువరాణి అఫైర్.. దాచిపెట్టేందుకు రూ. 12 కోట్లు!

ABN , First Publish Date - 2020-11-24T00:37:20+05:30 IST

దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆరో భార్య, యువరాణి హాయాకు సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

బాడీగార్డ్‌తో దుబాయ్‌ యువరాణి అఫైర్.. దాచిపెట్టేందుకు రూ. 12 కోట్లు!

లండన్: దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆరో భార్య, యువరాణి హాయాకు సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె తన బ్రిటిష్ బాడీగార్డుతో రెండేళ్లపాటు సంబంధం కొనసాగించిందని, ఈ రహస్య అఫైర్‌ బయటపడకుండా ఉండేందుకు అతడికి ఖరీదైన బహుతులు, బోల్డంత డబ్బు ముట్టచెప్పిందని ‘మెయిల్ ఆన్‌లైన్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. 37 ఏళ్ల బాడీగార్డ్ రస్సెల్ ఫ్లవర్‌తో ప్రిన్సెస్ హాయా రెండేళ్లపాటు రహస్యంగా అఫైర్ కొనసాగించిందని, ఈ సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు అతడికి 1.2 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు (దాదాపు రూ. 12 కోట్లు) ఇచ్చినట్టు ‘మెయిల్ ఆన్‌లైన్’ తన కథనంలో పేర్కొంది. అంతేకాక, అతడికి 12వేల పౌండ్ల విలువైన వాచ్, వింటేజ్ షాట్‌గన్‌తోపాటు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టు వివరించింది. బాడీగార్డ్ ఎప్పుడూ తన వెంట తిరిగేలా హాయా అతడిని సమ్మోహితుడిని చేసిందని, అందుకోసం తన సొమ్మును కూడా ఉపయోగించిందని పేర్కొంది.


డబ్బులు, ఖరీదైన బహుమతులు ఇచ్చి యువరాణి హాయా తన భర్తను ఆమె వైపు తిప్పుకుందని రస్సెల్ భార్య ఆరోపించింది. ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా రస్సెల్‌ను హాయా తన వెంట తిప్పుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రస్సెల్‌కు, యువరాణి హాయాకు మధ్య ఉన్న బంధం గురించి తెలిసిన తర్వాత ఫ్లవర్ భార్య ఒక్కసారిగా షాక్‌‌కు గురై ఏడ్చేసిందని, భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించిందని ‘మెయిల్ ఆన్‌లైన్’ తన కథనంలో పేర్కొంది. 


ప్రిన్సెస్ హాయా, విడిపోయిన 70 ఏళ్ల ఆమె భర్త మధ్య లండన్ హైకోర్టులో విచారణ సందర్భంగా హాయా, ఫ్లవర్ మధ్య ఉన్న రహస్య బంధం వెలుగులోకి వచ్చింది. పిల్లల సంరక్షణ బాధ్యతను ఎవరికి అప్పగించాలన్న విషయం గురించి విచారణ జరుగుతుండగా హాయా.. తన బాడీగార్డుతో ఉన్న రహస్య బంధం గురించి వెల్లడించింది. తన బాడీగార్డుల్లో ఒకరితో తనకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించింది. కాగా, కోర్టు ఆమె ఇద్దరు చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రిన్సెస్ హాయాకే అప్పగించింది. ప్రస్తుతం ఆమె  పశ్చిమ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో ఉంటోంది. 

Updated Date - 2020-11-24T00:37:20+05:30 IST