దుబ్బాక చైతన్యం ఢిల్లీకి తాకాలె

ABN , First Publish Date - 2020-09-22T07:00:42+05:30 IST

తెలంగాణ పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న దుబ్బాక చైతన్యం మళ్లీ ఢిల్లీకి తాకాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు

దుబ్బాక చైతన్యం ఢిల్లీకి తాకాలె

ఈ ఎన్నిక రైతులకు, రైతు వ్యతిరేకుల మధ్య పోరు

బీజేపీ పతనం ఇక్కడి నుంచే మొదలవ్వాలి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


దుబ్బాక, సెప్టెంబరు 21 : తెలంగాణ పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న దుబ్బాక చైతన్యం మళ్లీ ఢిల్లీకి తాకాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పద్మనాభునిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేశారు. దుబ్బాక మున్సిపల్‌ పరిధిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, స్మృతి వనం, షీ టాయిలెట్స్‌, జంక్షన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తనను అసెంబ్లీకి పంపండంలో మొదటి చెయ్యి దుబ్బాక నియోజకవర్గంలోని పద్మనాభునిపల్లి గ్రామానిదేనన్నారు. పునర్‌ విభజనకు ముందు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నదన్నారు. ఈ గ్రామం తన మొదటి ఎన్నికకు ఏకగ్రీవంగా కదిలి వచ్చి ఆదరించారన్నారు. అలాంటి ఫలితమే ఈ ఉప ఎన్నికలల్లో పునరావృతం కావాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, తనను ఆదరించినట్టుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆదరించాలన్నారు. దుబ్బాక నియోజకవర్గం గురించి సీఎం కేసీఆర్‌ అనునిత్యం పరితపిస్తారన్నారు. ఇక్కడి ప్రజలు బాగుండాలనేదే తమ ధ్యేయమన్నారు. ఇక్కడి  ప్రజలిచ్చిన ఆదరణతోనే తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు సాగు నీరు తెచ్చుకుంటున్నామన్నారు. కాలంతో, కాళేశ్వరం ప్రాజెక్టుతో పనిలేకుండానే చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే నినాదంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతు వ్యతిరేక బిల్లును తీసుకొస్తున్న బీజేపీకి దుబ్బాక నుంచే పతనం మొదలవ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్‌ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. 


దుబ్బాక పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

దుబ్బాక పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటి వరకు మంజూరైన నిధులతో స్మృతివనం, వైకుంఠధామం నిర్మించామన్నారు. స్మృతివనంలో దివంగతుల పేరుతో మొక్కను నాటే సంస్కృతికి శ్రీకారం చుట్టాలన్నారు. స్మృతి వనంతో మనపెద్దలను మొక్కలో చూసుకోవచ్చన్నారు. దుబ్బాకకు మరో వైకుంఠరథాలను అందిస్తామన్నారు. జంక్షన్‌లు కూడా మరింత అందంగా తీర్చుతామన్నారు. రూ.4 కోట్లతో దుబ్బాకలో ఆడిటోరియంను నిర్మిస్తామని, స్థలంను పట్టణం మధ్యలోనే సేకరించాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. పట్టణ ఆదాయం పెంచుకోవడానికి దుకాణ సముదాయంను కూడా నిర్మింపజేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా లక్ష డబుల్‌ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, నియోజకవర్గానికి వెయ్యి ఇళ్ల చొప్పున కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటివరకు నిర్మించిన 800 ఇళ్లను అర్హులకు త్వరలోనే అందిస్తామని, వ్యక్తి గత ఇళ్లను నిర్మించుకునేందుకు స్థలం ఉన్న వారికి మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ వనితారెడ్డి, ఆర్‌.రాజమౌళి, మున్సిపల్‌ కమిషనర్‌ నర్సయ్య, నాయకులు ఆస యాదగిరి, ఆస స్వామి, రామస్వామిగౌడ్‌, బీమసేనా తదితరులున్నారు. 


టీఆర్‌ఎ్‌సలో చేరిన కాంగ్రెస్‌ నేత

తొగుట : తొగుట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పబ్బతి మల్లారెడ్డి సోమవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హరీశ్‌రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ సూచించిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలివేరి మల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ కనకయ్య, నాయకులు నరేందర్‌రెడ్డి, కలీమోద్దీన్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T07:00:42+05:30 IST