దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-07T07:06:53+05:30 IST

అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి(58) కన్ను మూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

  • అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • విద్యార్థి సంఘం నేతగా ప్రస్థానం ప్రారంభం
  • పీపుల్స్‌ వార్‌, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర
  • నివాళులర్పించి కన్నీటి పర్యంతమైన సీఎం కేసీఆర్‌
  • పాడె మోసి స్నేహబంధాన్ని చాటుకున్న హరీశ్‌
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు


హైదరాబాద్‌/దుబ్బాక/సిద్దిపేట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి(58) కన్ను మూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. రామలింగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోలిపేటతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మంత్రి హరీశ్‌ రావు.. స్వయంగా పాడె మోసి రామలింగారెడ్డితో తనకున్న స్నేహబంధాన్ని చాటుకున్నారు. కాలికి రక్తప్రసరణ ఆగిపోవడంతో(గ్యాంగ్రీన్‌ రావడంతో) గత నెల 23న రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి చేసిన శస్త్ర చికిత్స వికటించడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌.. వెంటనే స్పందించి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. ఆస్పత్రి వైద్యుడు నాగేశ్వర్‌రెడ్డితో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ సోలిపేట ఆరోగ్యంపై ఆరా తీశారు. కిడ్నీలు, లివర్‌తోపాటు శరీరమంతా ఇన్‌ఫెక్షన్‌ సోకడం, గతంలోనే ఆయనకు లివర్‌ సంబంధిత వ్యాధి ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దిగజారింది. పది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తెల్లవారు జామున 2.12గంటలకు కన్నుమూశారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో అధికారిక లాంఛనాలతో రామలింగారెడ్డి అంత్యక్రియలు జరిగాయి.

సామాన్య రైతు కుటుంబం నుంచి..

దుబ్బాక మండలం చిట్టాపూర్‌లోని సామాన్య రైతు కుటుంబంలో 1961 అక్టోబరు2న రామలింగారెడ్డి జన్మించారు. దుబ్బాక జూనియర్‌ కళాశాలలో విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సోలిపేట.. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడు పీడీఎ్‌సయూలో చేరారు. రాడికల్‌ విద్యార్థి సంఘం(ఆర్‌ఎ్‌సయూ) జిల్లా కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత పీపుల్స్‌వార్‌ సానుభూతి పరుడిగా పని చేస్తూ, 1987లో ఉదయం దినపత్రికలో రిపోర్టర్‌గా చేరారు. 1986లో సుజాతను స్టేజ్‌ మ్యారేజీ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేటలో జరిగిన వివాహానికి అప్పటి ఎమ్మెల్యే కేసీఆర్‌తోపాటు కాళోజీ నారాయణరావు, వరవరరావు, నందిని సిధారెడ్డి హజరయ్యారు. 2004లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ తరఫున దొమ్మాట(ప్రస్తుత దుబ్బాక) నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా ఉంటూ 2008లో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిచిన ఆయన.. 2009లో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2014లో దుబ్బాక నుంచి విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది.. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 


కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ చిట్టాపూర్‌ చేరుకొని రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. సోలిపేట కుమారుడు సతీశ్‌రెడ్డిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి తమ పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సహచరుడైన రామలింగారెడ్డి మరణం తనను కలచివేసిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రామలింగారెడ్డి.. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు.


చేరదీసి.. చదివించి.. పెళ్లి చేసి!

తన వాళ్లంటూ ఎవరూ లేని బాలికను చేరదీసి.. చదివించి.. పెళ్లి చేసిన మానవతా వాది రామలింగారెడ్డి. తొమ్మిదేళ్ల క్రితం చిట్టాపూర్‌కు చెందిన సావిత్రిని ఆమె భర్త సాయాగౌడ్‌ హత్య చేశాడు. కన్నకూతురు రేఖను అమ్మేయాలని చూశాడు. విషయం తెలుసుకున్న సోలిపేట.. ఆ బాలికను చేరదీశారు. ఆమెకు చదువు చెప్పించి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పించారు. అదే కంపెనీలో పని చేసే యుకుడితో రేఖ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.


ఆర్నెల్లలో ఉప ఎన్నిక!

2018లో భారీ మెజారిటీతో గెలుపొందిన రామలింగారెడ్డి.. నాటి నుంచి ప్రజల మధ్యే ఉంటూ సేవలు అందించారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు సతీశ్‌రెడ్డిని వెలుగులోకి తెస్తున్న తరుణంలో అనూహ్యంగా అనారోగ్యానికి గురై మృతి చెందారు. కాగా, రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గానికి ఆరు నెలల్లోనే ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయంపైనే దుబ్బాక రాజకీయం ఆధారపడి ఉందని స్థానిక ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. 


ప్రముఖుల సంతాపం

రామలింగారెడ్డి మృతి పట్ల గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి ఎర్రబెల్లి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత,  మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సంజయ్‌, టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సంతాపం తెలిపారు.

Updated Date - 2020-08-07T07:06:53+05:30 IST