దుబ్బాకలో ఆ పార్టీకి మద్దతుగా పవన్ ప్రచారం..?

ABN , First Publish Date - 2020-10-21T17:26:54+05:30 IST

తెలంగాణలో జనసేన యాక్టీవ్‌ కాబోతోందా? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వ్యూహాలు రచిస్తున్నారా? ఏపీలో మిత్రపక్షంగా ఉన్న కమలం పార్టీతో కలిసి తెలంగాణలో కూడా బలపడాలనుకుంటుందా? దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు

దుబ్బాకలో ఆ పార్టీకి మద్దతుగా పవన్ ప్రచారం..?

తెలంగాణలో జనసేన యాక్టీవ్‌ కాబోతోందా? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వ్యూహాలు రచిస్తున్నారా? ఏపీలో మిత్రపక్షంగా ఉన్న కమలం పార్టీతో కలిసి తెలంగాణలో కూడా బలపడాలనుకుంటుందా? దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు తరఫున ప్రచారం చేయనున్నారా? ఇక్కడ విజయం సాధిస్తే జనసేనాని తదుపరి టార్గెట్‌ ఏమిటి?... ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


జోరందుకున్న ఊహాగానాలు...

తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక వేడి రాజుకుంటుంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచేశారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కీలక నేతలను బ‌రిలోకి దింపడంతో..పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నియోజక‌వ‌ర్గంలోని మండ‌లాల‌ను, మండ‌లంలోని గ్రామాల‌ను డివైడ్ చేసుకొని నాయ‌కుల‌కు బాధ్యత అప్పగించారు. బూత్‌ల వారీగా ఓట‌ర్లను క‌లుస్తూ... తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌రుపున ప్రచారం చేసేందుకు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నార‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి.


ఆయన వస్తే ఓట్లన్నీ తమకే అని..

2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ, టీడీపీకి పవన్‌ కల్యాణ్‌ దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. కానీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంది. కొన్నాళ్ల క్రితం ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు పొడవడంతో.. ఇరు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ... కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి దూకుడుగా వెళ్తోంది. పలు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దుబ్బాకలో మకాం వేసి అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తున్నారు. ఏపీలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారట. వాస్తవానికి ఏపీ, తెలంగాణలో పవన్‌కు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. యూత్‌లో పవర్‌స్టార్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టినా.. ఎన్నికల హామీని అమలు చేయడంలో తాత్సారం చేస్తోంది. ఈ తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేస్తే యువత ఓట్లన్నీ తమకే పడుతాయని బీజేపీ భావిస్తుందట. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ పెద్దలు పవన్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు టాక్‌ వినిపిస్తోంది.


జీహెచ్ఎంసీపైనా ప్రభావం...

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాకలో పవన్‌ ప్రచారం కలిసొచ్చి బీజేపీ విజయం సాధిస్తే.. దాని ప్రభావం బల్దియా ఎన్నికలపై పడుతుందనీ.. అది తమకు లాభిస్తుందనీ కమలనాథులు లెక్కలు వేస్తున్నారట. అయితే పవన్‌ దుబ్బాకలో బహిరంగంగా క్యాంపెయిన్‌ చేస్తారా లేక వర్చువల్‌గా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందట.  మొత్తంగా పవన్‌ కల్యాణ్‌ దుబ్బాకలో ప్రచారం చేస్తారన్న వార్తలు రాష్ట్ర పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి పవన్‌ క్యాంపెయిన్‌ కమలం పార్టీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.

Updated Date - 2020-10-21T17:26:54+05:30 IST