దుబ్బాకలో కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం.. ఫలించేనా..?

ABN , First Publish Date - 2020-10-25T17:00:47+05:30 IST

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహం అమలు చేస్తోందా? అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందా? ఈ ఉప ఎన్నికలో గెలిచి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునేందుకు సిద్ధమవుతోందా? పార్టీ అధినాయకత్వం అగ్రనేతలకు ఇచ్చిన టాస్క్‌

దుబ్బాకలో కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం.. ఫలించేనా..?

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహం అమలు చేస్తోందా? అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోందా? ఈ ఉప ఎన్నికలో గెలిచి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునేందుకు సిద్ధమవుతోందా? పార్టీ అధినాయకత్వం అగ్రనేతలకు ఇచ్చిన టాస్క్‌ ఏమిటి? ఈ ఎన్నిక గెలుపు రాబోయే ఎన్నికలకు బూస్ట్‌గా పనిచేస్తుందని భావిస్తోందా? అసలు హస్తం పార్టీ త్రిముఖ వ్యూహం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.


దుబ్బాకలో గెలవాల్సిందే...

దుబ్బాక ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్‌ హీట్‌ అంతకంతకు పెరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. దుబ్బాకలో గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి తప్పనిసరి అయింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఇన్నాళ్లు ప్రభుత్వంపై కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో పస లేదనీ.. వారి ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుంది. అదే హస్తం పార్టీ గెలిస్తే త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విజయం క్యాడర్‌కు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు ఉత్సాహాన్ని నింపుతుందనుకుంటున్నారు. ఒకవేళ దుబ్బాకలో బీజేపీ విజయం కైవసం చేసుకుంటే అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు మోగడంతో పాటు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాలని రాష్ట్ర నాయత్వం స్కెచ్‌ వేసింది. ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది.


తామే బరిలో దిగినట్లుగా ప్రచారం...

త్రిముఖ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన నెలరోజులుగా గ్రామాల్లో మొహరించింది. కొందరు ముఖ్య నేతలు ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారాన్ని గ్రామస్థాయికి, బూత్ స్థాయికి తీసుకెళ్తున్నారు. నాయకులు ఏ స్థాయిలో క్యాంపెయిన్‌ చేస్తున్నారన్న విషయాన్ని.. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా లెక్కిస్తారట. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులకు ఒక్కో పోలింగ్‌ బూత్ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. అక్కడ ఓట్లు తక్కువ వస్తే ఆ నాయకుడే బాధ్యతవహించాల్సి ఉంటుందట. ఇలా నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక నాయకుడిని నియమించారు. తమ పరిధిలో సరైన ఓట్లు రాకపోతే ఎక్కడ పరువుపోతుందోనని తామే ఎన్నికల బరిలో దిగినట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


ముత్యంరెడ్డి క్రేజ్ లాభిస్తుందని...

మరోవైపు రాష్ట్ర అగ్రనాయకులు, ప్రజాకర్షణ ఉన్న నేతలు దుబ్బాక నియోజకవర్గంలోని ఊరూరు చుట్టేస్తున్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌, భట్టి, వీహెచ్‌, దామోదర రాజనరసింహా లాంటి నేతలంతా టీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇది మరో వ్యూహం. ఇక మూడోదిగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ముత్యం శ్రీనివాసరెడ్డి తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తమకు ప్లస్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడేవారని రాజకీయపార్టీలకతీతంగా అందరూ అంగీకరిస్తారు. గతంలో కేసీఆర్‌, ముత్యంరెడ్డి మంత్రులుగా పనిచేసిన సమయంలో సిద్దిపేటలో కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధికి పోటీగా దుబ్బాకలో పనులు చేపట్టేవారని చెబుతారు. నిధుల విషయంలోనూ, అభివృద్ధి పనుల విషయంలోనూ ఇద్దరి మధ్య పోటీ ఉండేదంటారు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్‌, సిద్దిపేట స్థాయిలో దుబ్బాకను అభివృద్ధి చేయలేదనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ నేతలు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. ముత్యంరెడ్డి పట్ల నియోజకవర్గంలో సానుకూలత.. ఆయన చనిపోయాక సానుభూతి కలిసొస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బూత్‌ స్థాయిలో మేనేజ్‌మెంట్‌, ముఖ్యనేతల విస్తృత ప్రచారం.. ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తమకు లాభిస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నారు. మరి వారి త్రిముఖ వ్యూహం దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.

Updated Date - 2020-10-25T17:00:47+05:30 IST