క్యాష్‌పత్రులు

ABN , First Publish Date - 2021-06-17T06:12:16+05:30 IST

కొవిడ్‌ సమయంలో నగరంలో వైద్య సేవల పేరిట దోపిడీ కొనసాగుతోంది.

క్యాష్‌పత్రులు

    1. ఓపీ చార్జీలు రెట్టింపు
    2. అమాంతం పెరిగిన బెడ్‌ చార్జీలు
    3. ఐసీయూలో చేరితే అప్పులపాలే..!
    4. డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లోనూ రెట్టింపు
    5. కొవిడ్‌ విపత్తులో పెరిగిన దోపిడీ
    6. నియంత్రణ మరిచిన ప్రభుత్వం


కర్నూలు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): 

కొవిడ్‌ సమయంలో నగరంలో వైద్య సేవల పేరిట దోపిడీ కొనసాగుతోంది. ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో ఓపీ మొదలు ల్యాబ్‌ పరీక్షల వరకూ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్‌ రోగులు వెళ్లినా, సాధారణ రోగులు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి. చాలామంది ఆస్పత్రులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఓపీ ఫీజలు, ల్యాబ్‌ టెస్టుల రేట్లు పెంచడం మొదటి వేవ్‌ నుంచి మొదలయింది. ఇదేమిటని ఎవరైనా అడిగితే, శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు వినియోగిస్తున్నాం కదా అంటున్నారు. ఆ ఖర్చు పేరిట రోగులపై అంతులేని భారం వేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఓపీ ఫీజులు పెంచకూడదని ఐఎంఏ ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. కొవిడ్‌ ఆస్పత్రుల మీద దృష్టి పెట్టినట్లే మిగతా ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, ఫీజుల మోతను తగ్గించాలని సామాన్యులు కోరుతున్నారు.


గూడూరుకు చెందిన ఓ మహిళ కడుపులో ఇబ్బందిగా ఉందని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి, అవసరమైన మందులు రాసి వారం తర్వాత రమ్మని సూచించారు. వారం తర్వాత మళ్లీ వెళితే.. ఆస్పత్రి సిబ్బంది మళ్లీ ఓపీ ఫీజు వసూలు చేశారు. ‘నేను వారం కిందే వచ్చాను. మళ్లీ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారు..?’ అని అడిగితే ‘గతంలో అలా ఉండేది. ఇపుడు మారింది, కట్టాల్సిందే’ అని సమాధానమిచ్చారు.


దగ్గు విపరీతంగా వస్తుండడంతో నందికొట్కూరుకు చెందిన ఓ వ్యక్తి ఎందుకైనా మంచిదని నగరంలోని ఓ వైద్యుడిని సంప్రదించారు. ముందు టెస్టులు చేయించుకోమని సూచించాడు. వైద్యుడు రాసిన చిట్టీని పట్టుకుని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళితే, కేవలం బ్లడ్‌, డీడైమర్‌, సీఆర్‌పీ టెస్టుల కోసం రూ.5,000 వసూలు చేశారు. బిల్లు చూసి బాధితుడి నోట మాటరాలేదు. 


లాక్‌డౌన్‌ మొదలు..

కొవిడ్‌ మొదటి వేవ్‌లో లాక్‌డౌన్‌ మొదలయ్యాక సాధారణ జబ్బులతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కాన్పులు, అత్యవసరంగా ఆపరేషన్లు చేయించుకునే వారు మినహా మిగతావారు ఇంట్లోనే ఉంటూ అంతకు ముందు వైద్యుడు సూచించిన మందులనే వాడేవారు. దీంతో ఆస్పత్రుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. మళ్లీ కాస్త పుంజుకుంటున్న తరుణంతో సెకండ్‌ వేవ్‌ వచ్చింది. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలు గత ఏడాది కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఓపీ ఫీజులను అమాంతం పెంచేశాయి. గతంలో రూ.150 తీసుకునే వారు ప్రస్తుతం రూ.300 వరకు తీసుకుంటున్నారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులైతే ఏకంగా రూ.500 వసూలు చేస్తున్నారు. 


సేవలు తగ్గడంతో..

జిల్లా వ్యాప్తంగా 250 పైగా నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు ఉన్నాయి. కొవిడ్‌ రాకముందు ఈ ఆస్పత్రులన్నింటిలో వైద్య సేవలు కొనసాగాయి. కొవిడ్‌ మొదలయ్యాకు చాలామంది వైద్యులు తమ సేవలను తగ్గించారు. కొన్నింటిని ప్రభుత్వం కొవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించింది. ఇలాంటి ఆస్పత్రులకు సాధారణ రోగులు వెళ్లడం లేదు. ఉన్న కొన్ని ఆస్పత్రులకు డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా చాలా ఆస్పత్రులు ఓపీ ఫీజులను పెంచేశాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఓపీ చెల్లుబాటు రోజుల సంఖ్యను కూడా తగ్గించేశారు. గతంలో 15 రోజుల వరకు ఓపీ చెల్లుబాటు ఆయ్యేది. ప్రస్తుతం వారం నుంచి పది రోజులకే చెల్లుబాటు అవుతోంది. ఆ తర్వాత మళ్లీ ఓపీ ఫీజు వసూలు చేస్తున్నారు.


ఐసీయూ, బెడ్‌ చార్జీల పెంపు

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసీయూ, ఎంఐసీయూ, బెడ్‌ చార్జీలను కూడా విపరీతంగా పెంచేశారు. ఎక్కువ శాతం రోగులు వైద్యులను సంప్రదించి తిరిగి ఇంటికి వెళుతుంటారు. ఓపీకి వచ్చిన కొందరిని అబ్జర్వేషన్‌ పేరిట వైద్యులు ఆస్పత్రుల్లోనే ఉండాలని సూచిస్తారు. మరికొన్నిసార్లు రోగి పరిస్థితిని బట్టి ఐసీయూలో ఉంచుతారు. గతంలో సాధారణ ఆస్పత్రుల్లో ఐసీయూ రూ.4 వేలు వసూలు చేసేవారు. ప్రసుతం రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. బెడ్లు, రూం చార్జీలు గతంలో రూ.1,000 నుంచి రూ.1,500 ఉంటే ప్రస్తుతం రూ.2500 పైమాటే! ఆస్పత్రుల యాజమాన్యాలు ఇలా ప్రతి దానికి ధరలు పెంచేయడంతో సామాన్యులు అప్పులపాలవుతున్నారు. 


వైద్యం కోసం వెళితే టెస్టులు రాయడం పరిపాటిగా మారిపోయింది. కరోనా వచ్చాక అది మరీ ఎక్కువైంది. చిన్నపాటి జ్వరం వచ్చినా అన్ని టెస్టులు చేయించుకోమని వైద్యులు సూచిస్తున్నారు. టెస్టుల్లో ఏమీ కనిపించకపోతే మరిన్ని టెస్టులు రాస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొ స్తుందోనని భయపడి, వైద్యులు రాసే అన్ని టెస్టులను రోగులు చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా చాలా డయాగ్నస్టిక్‌ సెంటర్లు దోపిడీకి తెరలేపాయి. ప్రతి టెస్టుకు రేట్లను పెంచేశాయి. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌, హెచ్‌బీ, సీఆర్‌పీ, డీడైమర్‌.. ఇలా అన్నింటి రేట్లు బాగా పెరిగిపోయాయి. సీటీ స్కాన్‌కు ఒకానొక సమయంలో రూ.5 వేలు వసూలు చేశారు. దీన్ని గమనించిన ప్రభుత్వం, కొన్ని టెస్టుల ధరలకు పరిమితి విధించింది. ప్రస్తుతం సీటీ స్కాన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేస్తున్నారు. మిగిలిన వాటిపై దోపిడీ కొనసాగుతోంది. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌కు గతంలో రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.400 తీసుకుంటున్నారు. డీడైమర్‌, సీఆర్‌పీ టెస్టులు గతంలో చాలా తక్కువ ధరలకే చేసేవారు. ప్రస్తుతం ఈ రెండింటినీ కరోనా మార్కర్లుగా వైద్యులు భావిస్తున్నారు. వీటికి రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-17T06:12:16+05:30 IST