కదలిక లేని కల్లాలు

ABN , First Publish Date - 2020-10-21T05:54:21+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వరితోపాటు ఇతర పంటల సాగు పెరిగింది. పండించిన ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి స్థలంలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కదలిక లేని కల్లాలు

నత్తనడకన పనులు 

అనువుకాని సమయంలో నిధుల మంజూరే కారణం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వరితోపాటు ఇతర పంటల సాగు పెరిగింది. పండించిన ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి స్థలంలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు కల్లాల నిర్మించాలని నిర్ణయించింది. కల్లాల నిర్మాణ పథకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి నిధులను మంజూరు చేసింది. 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 వేలు..

ఈ పథకం కింద ఉమ్మడి జిల్లా పరిధిలో 78 కోట్ల 61 లక్షల రూపాయలతో 14వేల కల్లాలను నిర్మించాలని తలపెట్టింది. 50 చదరపు మీటర్ల కల్లానికి 56 వేలు, 60 చదరపు మీటర్ల కల్లానికి 68వేలు, 75 చదరపు మీటర్ల కల్లానికి 85 వేలు నిర్మాణ వ్యయంగా నిర్ణయించింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ సొంత స్థలంలో ఈ కల్లాల నిర్మాణం చేపట్టడానికి అర్హులని, బీసీ, ఓసీ రైతులు నిర్మాణ వ్యవయంలో 10 శాతాన్ని తమవంతు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. షెడ్యూల్‌ కులాలు, తెగలకు చెందిన రైతులు ఎలాంటి వాటా ధనం చెల్లించాల్సిన అవసరం లేదు. తమ స్థలంలో సొంత డబ్బు వెచ్చించి నిర్మాణ పనులు చేపడితే రెండు వాయిదాల్లో ప్రభుత్వం డబ్బు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి కరీంనగర్‌ జిల్లాలో దరఖాస్తులను స్వీకరించగా 15 మండలాలల్లో 2644 మంది రైతులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. 303 గ్రామపంచాయతీల్లో 50 చదరపు మీటర్ల కల్లాల కోసం 137 మందికి, 60 చదరపు మీటర్ల కల్లాల కోసం 139 మందికి, 75 చదరపు మీటర్ల కల్లాల కోసం 2,368 మందికి కలెక్టర్‌  పనులను మంజూరు చేశారు. ఈ 2,664 కల్లాల నిర్మాణం కోసం 20 కోట్ల 91 లక్షల 36వేల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 2,601 మందికి పనులు ప్రారంభించేందుకు అనుమతి ఉత్తర్వులను జారీ చేయగా 305 పనులను మాత్రమే ఇప్పటి వరకు ప్రగతిలో ఉన్నాయి. 

 

గన్నేరువరం మండలంలో 132 కల్లాల నిర్మాణ పనులు, రామడుగులో 38, సైదాపూర్‌లో 37, చిగురుమామిడిలో 23,  చొప్పదండిలో 12, కేశవపట్నంలో 10, తిమ్మాపూర్‌లో తొమ్మిది, వీణవంకలో ఏడు, మానకొండూర్‌లో ఆరు, జమ్మికుంటలో ఆరు, కొత్తపల్లి మండలంలో ఐదు, గంగాధరలో ఐదు, ఇల్లందకుంటలో నాలుగు, కరీంనగర్‌ రూరల్‌లో మూడు కల్లాల పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ పనులపై ఇప్పటి వరకు కేవలం 75 లక్షల 42వేల రూపాయలను మాత్రమే వెచ్చించారు. 


ఓ వైపు వర్షాలు.. మరో వైపు వ్యవసాయ పనులు

కల్లాల అవసరం ఉన్నా అనువుకాని సమయంలో నిధులు మంజూరీ కావడంతో పనులు వేగవంతంగా జరుగడం లేదు. రైతులు సొంత స్థలాల్లో వీటిని నిర్మించుకోవలసి ఉన్నందున వర్షాకాలం ఆరంభంలో ప్రతి సెంటు భూమిని వినియోగిస్తున్న నేపథ్యంలో ఖాళీ స్థలాలు లేకుండా పోయాయి. ఉన్న స్థలంలో పనులు చేపట్టడానికి అనువైన వాతావరణం లేక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. పొలాలు కోతకు రావడం, పత్తి పంట ఈనె దశకు రావడంతో కూలీలు దొరకని పరిస్థితితోపాటు రైతులు కూడా ఈ నిర్మాణాలపై దృష్టిసారించని స్థితులు నెలకొన్నాయి. దీంతో కల్లాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. 


రైతులకు ఉపయోగకరం

నిజానికి ఇలాంటి కల్లాల అవసరం ప్రతి రైతుకు ఉన్నది. ఏ గ్రామంలో కూడా ఖాళీ స్థలం లేక పోవడంతో రైతులు వరి కోతలు పూర్తికాగానే కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకుపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు సొంత కల్లాలు ఉంటే వాటిలో ఆరబోసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. వానా కాలం పంట కోసిన తర్వాత రైతులు కల్లాల నిర్మాణంపై దృష్టిసారించే అవకాశమున్నది. ఈ కల్లాల నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా మంది రైతులు తమ తమ స్థలాల్లో కల్లాల నిర్మాణానికి ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఊరుమ్మడి స్థలం లేక పోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలువనున్నది. రాబోయే రోజుల్లో కల్లాల నిర్మాణ పథకం డిమాండ్‌ మరింత పెరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-21T05:54:21+05:30 IST