దుగ్గిరాలపాడు చూపిన దారి

ABN , First Publish Date - 2021-05-15T09:54:37+05:30 IST

దుగ్గిరాలపాడు చూపిన దారి

దుగ్గిరాలపాడు చూపిన దారి

కొవిడ్‌కు అందని కృష్ణాజిల్లా గ్రామం ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణతో సెకండ్‌ వేవ్‌ని సైతం తట్టుకొన్నారు. బయటిపనులకు వెళ్లేవారికి నచ్చజెప్పి గ్రామంలోనే ఉపాధి హామీ పనులు ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణతో సెకండ్‌ వేవ్‌ని సైతం తట్టుకొన్నారు.



బయటిపనులకు వెళ్లేవారికి నచ్చజెప్పి

గ్రామంలోనే ఉపాధి హామీ పనులు

పాజిటివ్‌కి దూరంగా ఆరోగ్యసాధన


దుగ్గిరాలపాడు (జి.కొండూరు), మే 14: ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశానికి ఇప్పుడు వచ్చిన కరోనా కష్టానికీ ఆ ఊరే సమాధానంగా నిలిచింది. దాదాపు అన్ని ప్రాంతాలనూ కొవిడ్‌ గజగజలాడిస్తుంటే, ఒక్కటంటే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని గ్రామంగా కృష్ణాజిల్లాలోని దుగ్గిరాలపాడు అందరి చూపులను తనవైపు తిప్పుకొంటోంది. ఆ ఊరు కథ ఏమిటో, కరోనాను ఎలా జయించగలిగిందో చదివేద్దాం.. రండి! 


కృష్ణాజిల్లా జి.కొండూరు మండలానికి 14 కిలో మీటర్లు దూరంలో తెలంగాణ బోర్డర్‌లో ఉంటుంది దుగ్గిరాలపాడు గ్రామం. ఈగ్రామంలో వెయ్యి మంది జనాభా ఉన్నారు. నూటికి 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. పశువులు, గొర్రెల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలే ఎక్కువ. సమస్యల్లో ఐక్యమత్యం ప్రదర్శించడం ఈ ఊరిని తొలినుంచీ విలక్షణంగా నిలిపింది. అదే లక్షణం కరోనా సెకండ్‌ వేవ్‌లో కవచంలా దుగ్గిరాలపాడును కాపాడుతోంది. ఈ ఏడాది మార్చినుంచి మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న సమయంలో గ్రామంలోని పెద్దలంతా సమావేశమయ్యారు. గ్రామంలోకి కరోనా రాకుండా చూసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపై గ్రామస్థులు కొన్ని సమావేశాలు వేసుకొని సుదీర్ఘంగా మాట్లాడుకొని, కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు సాధారణంగా ఊళ్లో పనులు దొరకనివారు దూరప్రాంతాలకు వెళ్లి కూలీపనులు చేసుకొని సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. వారిద్వారా కరోనా గ్రామంలోకి వస్తుందని భావించి.. బయటి ప్రయాణాలు పూర్తిగా బంద్‌ పెట్టారు. 


మరి.. ఆ కూలీల కుటుంబాలకు బతుకు గడిచేదెలా? వారికి ఊళ్లోనే ఉపాధిహామీ పథకం పనులు ఇచ్చేలా పంచాయతీ అధికారులను ఒప్పించారు. గ్రామంలో ఎనిమిది కిరాణాషాపులు ఉన్నాయి. అక్కడే సరుకులు, కూరగాయలు కూడా కొనుక్కొంటారు. ఊరంతా ఒకేసారి షాపుల వద్ద గుమిగూడకుండా.. ఒక్కో వార్డు ప్రజలు ఒక్కోరోజు చొప్పున వెళ్లి కావాల్సిన సరుకులు, కూరలు తెచ్చుకొంటున్నారు. ఈ గ్రామంలో  ఎనిమిది వార్డులు ఉన్నాయి. ఇక.. బంధువుల ఇళ్లకు వెళ్లడం మానేశారు. తమ ఇళ్లకు బంధువులు ఎవరూ రావద్దని ఫోన్‌ల ద్వారా సమాచారం ఇచ్చారు. అనవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం మానివేశారు. మాస్క్‌లు ధరించే ఉపాధి పనులకు, వ్యవసాయ పనులకు వెళుతున్నారు. గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు లేకపోవడాన్ని గ్రామస్థులు సాధించిన విజయంగా సర్పంచ్‌ జడ రాంబాబు పేర్కొన్నారు. కష్టమనుకోకుండా కఠిన నిర్ణయాలతో గ్రామమంతా క్రమశిక్షణ పాటించడం వల్లే  ఒక్క పాజిటివ్‌ కేసు కూడా దుగ్గిరాలపాడులో నమోదు కాలేదని పంచాయతీ కార్యదర్శి డి.రామకృష్ణ తెలిపారు. 


దూరం.. దూరం..


  • దగ్గరి బంధువుల పెళ్లి పిలుపులకూ దూరం
  • సరుకుల కోసం అందరూ ఒకేసారి కాకుండా.. రోజుకొక వార్డు అనుకొని కొనుగోళ్లు
  • పనుల కోసం బయటకు రోజూ వెళ్లివచ్చేవారికి ఊళ్లోనే ఉపాధి హామీ పథకం పనుల కల్పన.
  • తమ ఊరికి రావొద్దని బంధువులకు ఫోన్లలో సమాచారం. 
  • మాస్క్‌ ధరించి ఉపాధి హామీ పథకం, పొలం పనులు


సురక్షితంగా ఉన్నాం.. ఉంటాం

‘‘అనవరంగా బయట తిరిగి కరోనా వ్యాప్తికి కారణం కాకుండా ఇళ్లకే పరిమితం అయ్యాం. బంధువుల ఇళ్లకు రాకపోకలు ఆపేసుకున్నాం. అందుకే మేం సురక్షితంగా ఉన్నాం. ఇకపై కూడా ఇంతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం.    


- తీగల గోవర్థన్‌, దుగ్గిరాలపాడు


బతికుంటే బలుసాకు తింటాం

‘‘పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర శుభకార్యాలు ఎంత దగ్గర వారివి అయినా వెళ్లడం మానేశాం. విందు భోజనాలు కాదు...మామూలు తిండి తినాలన్నా బతికి ఉండాలి కదా! బతికుంటే బలుసాకు తినొచ్చు. ముందు కరోనా బారిన పడకుండా ఉండాలి. అందుకే కఠిన క్రమశిక్షణతో మాతో పాటు మా కుటుంబాలను, నా గ్రామాన్ని కరోనా బారి నుంచి రక్షించుకొంటున్నాం.


- శివయ్య, దుగ్గిరాలపాడు


Updated Date - 2021-05-15T09:54:37+05:30 IST