మొండి బాకీలు డబుల్‌!

ABN , First Publish Date - 2021-01-12T09:14:00+05:30 IST

కరోనా మహమ్మారి బ్యాంకింగ్‌ రంగా న్ని దారుణంగా కుంగదీసింది. బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 13.5 శాతానికి దూసుకుపోవచ్చని, స్థూల ఆర్థిక స్థితి మరింత దిగారితే 14.8 శాతం వరకు కూడా పెరగవచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనా వేసింది.

మొండి బాకీలు డబుల్‌!

సెప్టెంబరు నాటికి 13.5 శాతానికి పెరగవచ్చని ఆర్‌బీఐ హెచ్చరిక

1998-99 తర్వాత ఇదే గరిష్ఠం.. పరిస్థితి దిగజారితే 14.8ు చేరే చాన్స్‌


ముంబై: కరోనా మహమ్మారి బ్యాంకింగ్‌ రంగా న్ని దారుణంగా కుంగదీసింది. బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 13.5 శాతానికి దూసుకుపోవచ్చని, స్థూల ఆర్థిక స్థితి మరింత దిగారితే 14.8 శాతం వరకు కూడా పెరగవచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఆర్‌బీఐ నిర్వహించిన ఒత్తిడి పరీక్షల్లో ఇది తేలిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు కూడా కుంగడంతో పాటు మూలధన కొరత ఏర్పడవచ్చని హెచ్చరించారు. 


సాధారణ పరిస్థితుల్లో బ్యాంకుల జీఎన్‌పీఏలు గత సెప్టెంబరు నాటి 7.5 శాతంతో పోల్చితే 13.5 శాతం వరకు పెరగవచ్చు. ఆర్థిక స్థితి మరింత దిగజారితే అది 14.8 శాతం వరకు పెరగవచ్చు.


విభాగాల వారీగా పరిశీలిస్తే జీఎన్‌పీఏ ప్రభు త్వ రంగ బ్యాంకులకు 9.7 శాతం నుంచి 16.2 శాతానికి (తీవ్ర స్థితిలో 17.6 శాతం), ప్రైవేటు బ్యాంకులకు 4.6 శాతం నుంచి 7.9 శాతం (తీవ్ర స్థితిలో 8.8 శాతం), విదేశీ బ్యాంకులకు 2.5 శాతం నుంచి 5.4 శాతం (తీవ్ర స్థితిలో 6.5 శాతం) దూసుకుపోవచ్చు.


గతంలో 1998-99లో బ్యాంకుల స్థాయిలో ఎన్‌పీఏలు 14.8 శాతానికి చేరాయి. అది 24 సంవత్సరాల గరిష్ఠ స్థాయి. అలాగే 1997 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇవి 15.7 శాతానికి చేరాయి. ఆ తర్వాత తిరిగి ఈ స్థాయికి రావడం ఇదే ప్రథమం అవుతుంది. 


సడలింపులు ఉపసంహరిస్తే ముప్పే

కొవిడ్‌-19 నేపథ్యంలో బ్యాంకులకు ఇచ్చిన సడలింపులపే ఉపసంహరించినట్టయితే బ్యాలెన్స్‌ షీట్లు తిరగబడడమే కాకుండా భారీ మూలధన కొరత ఏర్పడే ముప్పు ఉన్నదని ఎఫ్‌ఎ్‌సఆర్‌ నివేదికకు రాసిన ముందుమాటలో దాస్‌ హెచ్చరించా రు. దీన్ని నివారించుకోవాలంటే బ్యాంకులు మూలధనం పెంచుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిస్థితులను మదింపు చేసుకోవాలని, వ్యాపార నమూనాలు మార్చుకోవాలని ఆయన సూచించారు.


రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ ఆరు నెలల రుణ మారటోరియం, ఏకకాల రుణ పునర్‌ వ్యవస్థీకరణ కూడా ప్రకటించింది. బ్యాంకులు త్వరలో మూడో త్రైమాసికం ఫలితాలు ప్రకటించనున్నాయి. ప్రభుత్వం కూడా ఆదాయాల్లో క్షీణతను తట్టుకునేందుకు రుణసమీకరణ భారీగా పెంచుకుని బ్యాంకులపై అదనపు ఒత్తిడి తెచ్చిందని, ఇప్పటివరకు రుణ సమీకరణ సజావుగానే సాగుతోందని దాస్‌ అన్నారు. ఏది ఏమైనా ఆర్థిక సుస్థిరతను కాపాడడం ఆర్‌బీఐ బాధ్యత అని ఆయన నొక్కి వక్కాణించారు. 


ఎన్‌పీఏల పునర్వర్గీకరణ గడువు పొడిగింపు?

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల ఎన్‌పీఏ పునర్వర్గీకణ కాలపరిమితిని 120 రోజులకు పెంచడంపై ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 90 రోజుల గడువు దాటిన ప్రతి రుణం ఎన్‌పీఏగా పరిగణనలోకి వస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది అతి తక్కువ గడువు అని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇందుకు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలో సవరణలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరితే ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్లోనే దీన్ని ప్రతిపాదించే వీలుంది. 


మార్కెట్ల ర్యాలీపై కన్నేయండి

నానాటికీ దూసుకుపోతున్న ఆర్థిక మార్కెట్లకు, వాస్తవ ఆర్థిక కార్యకలాపాలకు మధ్యన అనుసంధానం లోపించిందని, ఫలితంగా అసాధారణంగా ఆస్తుల విలువలు పెరిగిపోయి ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెస్తున్నాయని దాస్‌ హెచ్చరించారు. ఈ రిస్క్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన బ్యాంకులను కోరారు. గత ఏడాది  మార్చిలో 40 శాతం మేరకు కరెక్షన్‌కు గురైన భారత మార్కెట్‌ ఇటీవల ఏర్పడిన ర్యాలీలో 80 శాతం మేరకు దూసుకుపోయి ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-01-12T09:14:00+05:30 IST