డంబాలు, వాస్తవాలు

ABN , First Publish Date - 2020-07-15T05:55:08+05:30 IST

కరోనా వైరస్ మీద తిరుగులేని పోరాటం ఎక్కడైనా జరుగుతోందంటే, అది నరేంద్రమోదీ నాయకత్వాన భారతదేశంలో మాత్రమే - అని యావత్ ప్రపంచం మురిసి ముక్కలవుతున్నదట...

డంబాలు, వాస్తవాలు

కరోనా వైరస్ మీద తిరుగులేని పోరాటం ఎక్కడైనా జరుగుతోందంటే, అది నరేంద్రమోదీ నాయకత్వాన భారతదేశంలో మాత్రమే - అని యావత్ ప్రపంచం మురిసి ముక్కలవుతున్నదట. కేంద్ర సాయుధ పోలీసు బలగాల సంస్థ కార్యక్రమంలో పాల్గొంటూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం నాడు చేసిన వ్యాఖ్య అది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ- ఈ నాలుగు దేశాలు కలిపితే ఎంతో, ఉత్తరప్రదేశ్ జనాభా కూడా అంతే, కానీ, అక్కడ లక్షా 30 వేల మంది చనిపోతే, యుపిలో 600 మరణాలు మాత్రమే సంభవించాయి, అందుకు కారణం యోగీ ఆదిత్యనాథ్ సమర్థ ప్రభుత్వమే- ఈ కితాబును సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోయిన శుక్రవారం నాడు ఇచ్చారు. రికవరీలు 98 శాతం ఉంటే, కేవలం 2 శాతం మరణాలను చూపిస్తూ ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తాజాగా ఫిర్యాదు చేశారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే, కరోనా వ్యాప్తి శీఘ్రగతిన లేకపోవడానికి, మరణాల సంఖ్య సాపేక్షంగా తక్కువ ఉండడానికి భారతదేశంలో ప్రభుత్వాలు, అధికారయంత్రాంగం తీసుకున్న చర్యలే కారణమా? అట్లా అని నాయకులు నిజంగా నమ్ముతున్నారా? ప్రజారోగ్య వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ, కనీస మౌలిక వసతులు కూడా లేని దుస్థితిని కల్పించిన ప్రభుత్వాలు, ఒకవేళ సద్బుద్ధి కలిగి, ప్రజలను కాపాడాలనుకుంటే మాత్రం, ఉన్నట్టుండి అద్భుతాలు చేయగలవా? 


కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న వైద్యులను, ఆరోగ్యసిబ్బందిని, పోలీసులతో సహా అత్యవసర సేవల సిబ్బందిని అభినందించవలసిందే. వారు చేస్తున్న సాహసోపేతమైన సేవలను గుర్తించవలసిందే. వారి పరిచర్యల వల్లనే, అమృతహస్తాల వల్లనే, దేశంలో అనేక మరణాలు నివారితమయ్యాయి, అనేక మంది స్వస్థత పొందారు. కానీ, అదే సమయంలో, అనేక ఇతర దేశాలలో వ్యాపించిన వైరస్, మన దేశంలో ప్రవేశించిన వైరస్ ఒకే కుదురువి అయినా, కొంత భిన్నత్వం కూడా ఉన్నదని నిపుణులు చెబుతూ వచ్చారు. కొంత వ్యాప్తి తరువాత వైరస్, తనను తాను కొంత మార్చుకుంటుందట. అట్లా మారిన వైరస్ శాఖ ఏదో మనదేశానికి వచ్చి ఉండాలి. లేదా, కొందరు ఊహించినట్టు, మనదేశంలోని భౌతిక, నైసర్గిక, జన్యుపరిస్థితులు ఆ వైరస్‌కు భిన్నంగా స్పందించి ఉండాలి. భారతదేశంలో కూడా హఠాన్మరణాలు, వేగంగా ప్రాణాంతక స్థితికి రావడం, సుదీర్ఘకాలం వ్యాధిస్థితిలో ఉండడం- వంటివి కనిపిస్తున్నాయి. కానీ, అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలతో పోల్చిచూసినప్పుడు మరణాల రేటు తక్కువగా ఉన్నది. మన ప్రభుత్వాలు ఏవో ప్రయత్నాలు చేయడం వల్లనో, బ్రహ్మాండమైన వ్యూహరచన చేసినందువల్లనో మరణాల రేటు తగ్గిందనుకోవడం హాస్యాస్పదం. మన వైద్య, ఆరోగ్య సిబ్బంది అంకిత భావానికి తగినట్టుగా, ప్రభుత్వాలు, విధాననిర్ణేతలు ముందుచూపు ప్రదర్శించి ఉంటే, నిజంగానే మరణాలు మరింతగా తగ్గి ఉండేవి. 


వ్యాధి ఆరంభదశలో ఉన్న రోజులలో, ప్రజలతో సంభాషిస్తున్న రోజులలో, ఏదన్నా చేశారేమో కానీ, ప్రధానమంత్రి కానీ, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రస్తుతం కరోనా పోరులో అందిస్తున్న నాయకత్వం ఏమిటో వారి అభిమానులూ భక్తులే చెప్పాలి. అమెరికాలో మరణాల రేటు ఎక్కువ ఉన్న మాట నిజమే. పాజిటివ్‌గా నిర్ధారణ పొందినవారిలో 6 శాతం నుంచి 10 శాతం దాకా మరణాలు వెళ్లాయి. ఇప్పుడు వారు పాజిటివ్‌ల సంఖ్యతో మృతుల రేటును లెక్కించడం లేదు. మొత్తం జనాభాతో లెక్క వేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది జనాభాకు 1.7 మంది దాకా మరణిస్తున్నట్టు అంచనా. ఈ లెక్కన, మన దగ్గర పాజిటివ్‌లలో రెండు శాతం మరణాలు తక్కువే. కానీ, ఇతర దేశాలతో పోల్చకపోతే, రెండుశాతం అన్నది చిన్నది కాదు. కొన్ని రకాల ఇతర ప్రాణాంతక వ్యాధులలో కూడా వందకు రెండుమరణాలు ఉండవు. కరోనా ఉపద్రవం వంటి సందర్భాలలో, ప్రజలు 98 మందిలో తమను చూసుకుని ఆశను పొందుతూనే, తక్కిన రెండు శాతంలో తాము భాగం అవుతామేమోనని భయకంపితులు కూడా అవుతారు. ప్రభుత్వాలు మరణాలు తగ్గించడానికి ఎంత క్రియాశీలంగా వ్యవహరిస్తారన్న దాన్ని బట్టి ప్రజలలో విశ్వాసం నెలకొంటుంది. ప్రజలు నమ్మకంగా ఉంటే ప్రతిపక్షాలు, కువిమర్శకులు ఏమి అన్నా ప్రభుత్వాలు భయపడనక్కరలేదు. 


కొద్దిపాటి ఆలస్యం అయినా, కేంద్రప్రభుత్వం పూర్తిగా చేయి దాటకమునుపే స్పందించిందన్న అభిప్రాయం మొదట కలిగింది. కానీ, ఏ సన్నాహమూ లేకుండా అకస్మాత్తు లాక్‌డౌన్‌ అనేక సమస్యలను సృష్టించింది. లాక్‌డౌన్‌ ఫలితాలను బేరీజు వేసుకుని, వ్యూహానికి తగిన మెరుగులు దిద్దడం కాకుండా, ఎంత త్వరగా సడలింపులు ఇద్దామా అన్న ధోరణిలో కేంద్రం వ్యవహరించింది. సడలింపు అన్నది క్రమంగా పూర్తి విశృంఖలతగా మారిపోయింది. వ్యాప్తిని పర్యవేక్షిస్తూ, నియంత్రించే పద్ధతులను ప్రభుత్వాలు క్రమంగా విరమించుకుంటూ వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతుందనుకున్నారు కానీ, వ్యాధి వ్యాప్తి తీవ్రం కావడంతో, అనేక ఆర్థిక కార్యకలాపాలు ఆరంభమే కాలేదు, అయినవి కూడా కుంటుబడ్డాయి, వేగం పుంజుకోలేదు. ప్రజలలో భయాందోళనలు వ్యాపించాయి. వ్యాప్తికి తగినట్టుగా లేని ఆరోగ్యమౌలిక వసతులు సంక్షోభానికి దారితీస్తున్నాయి. అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌లను తిరిగి విధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక విధానమూ ఒక నాయకత్వమూ ఉన్నట్టు కనిపించడం లేదు. సరిహద్దు వివాదాలు, అంతర్గత రాజకీయాలూ, ఇతర అంశాలూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే, ప్రభుత్వాధినేతలు కరోనా గురించి మాట్లాడడం మానేశారు. వైద్య, ఆరోగ్య శాఖలు తమ దారిన తాము పనిచేసుకుపోతున్నాయి తప్ప, రాజకీయ నాయకత్వం అందించే దిశానిర్దేశం ఏమీ లేదు. ఈ పరిస్థితిలో ప్రజలలో కలవరం రెట్టింపు కావడంలో ఆశ్చర్యం ఏముంది? 


మంగళవారం నాడు తెలంగాణకు చెందిన ఆరోగ్యశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, వ్యాధి వ్యాప్తి ఎట్లా ఉంటుంది, ఏ రోజుకు ఏ దశకు చేరుకుంటుంది- వంటి వివరాలు తమ దగ్గర ఉంటాయని, వాటికి తగ్గట్టు వ్యవహరిస్తామని చెప్పారు. వ్యాధి వ్యాప్తిపై పోరాటం ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన విషయం అనీ, ప్రజలకు, మీడియాకు అనవసరమనీ అధికారులు భావిస్తుంటారు. ప్రజలకు సమాచారాన్నంతా అందించడం ద్వారా మాత్రమే విశ్వాసాన్ని పొందగలరు. పరీక్షల సంఖ్యను, మృతుల సంఖ్యను దాచిపెట్టని రాష్ట్రం ఏదైనా ఉన్నదా అని సందేహం వేస్తుంది. ఆగస్టు మాసంలో వ్యాధి విపరీతంగా విజృంభిస్తే ప్రభుత్వం ఏమి చేయగలుగుతుందో ప్రజలకు తెలియకపోతే, కేవలం భయమే ప్రాణాలు తీస్తుంది. కరోనా సంక్షోభ కాలంలో మానసిక దౌర్బల్యం, భయాందోళనలు విపరీతంగా వ్యాపించి ఉన్నాయని గుర్తించవలసి ఉన్నది.

Updated Date - 2020-07-15T05:55:08+05:30 IST